నేడు ఉమ్మడి పాలమూరుకు మంత్రుల రాక

నేడు ఉమ్మడి పాలమూరుకు మంత్రుల రాక
  • ప్రాజెక్టులను పరిశీలించనున్న రాష్ట్ర మంత్రులు 
  • నాగర్ కర్నూల్ లో రివ్యూ మీటింగ్ 

నాగర్​కర్నూల్, వెలుగు :  మహబూబ్​నగర్​ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతి సమీక్షించేందుకు బుధవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి  దామోదర రాజనర్సింహ, ఎక్సైజ్, టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులతో కలిసి పర్యటించనున్నారు.  బుధవారం ఉదయం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఉదండాపూర్​ రిజర్వాయర్, జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండలంలో రిజర్వాయర్,​ వనపర్తి జిల్లాలోని భీమా ప్రాజెక్ట్​లో భాగమైన శంకర సముద్రం రిజర్వాయర్​ పనులు పరిశీలిస్తారు.

నాగర్​కర్నూల్​ జిల్లాలో నిర్మాణంలో ఉన్న పాలమూరు రంగారెడ్డి మొదటి మూడు ప్యాకేజీ పనులు నార్లాపూర్​ రిజర్వాయర్, పంప్​హౌజ్ పనులు తీరు తెలుసుకోనున్నారు.  నార్లాపూర్​ నుంచి బిజినేపల్లి మండలంలోని వట్టెం రిజర్వాయర్​పంప్​హౌజ్​ పనులు చూస్తారు.  జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ, కలెక్టర్లు, ఇరిగేషన్ అధికారులు పాల్గొననున్నారు.  ప్రాజెక్టుల సందర్శన అనంతరం  నాగర్ కర్నూల్ కలెక్టరేట్​లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజా ప్రతినిధులు, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్  తెలిపారు.