బనకచర్లపై సీఎం, ఇరిగేషన్ మంత్రి ఎందుకు స్పందిస్తలే? : హరీశ్​

బనకచర్లపై సీఎం, ఇరిగేషన్ మంత్రి ఎందుకు స్పందిస్తలే? : హరీశ్​

కేంద్రానికి లేఖ రాయాలి: హరీశ్​

హైదరాబాద్, వెలుగు: నీళ్ల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్, అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రం ఎంతో నష్టపోయే ప్రమాదం ఉన్నదని తెలిపారు. తెలంగాణ భవన్​లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘గోదావరి జలాలను తరలించుకుపోయేందుకు ఏపీ ప్రయత్నిస్తున్నది. తుంగభద్రపై ఏపీ, కర్నాటకలు కొత్త ప్రాజెక్టులు కడ్తున్నయ్. పోలవరం ప్రాజెక్టు రైట్ కెనాల్ సామర్థ్యాన్ని ఏపీ ఇప్పటికే మూడింతలు పెంచింది. దాంతో పాటు బనకచర్ల ద్వారా పెన్నా బేసిన్​కు 200 టీఎంసీలు తరలించే ప్రయత్నం చేస్తున్నది.

 ఏపీ ప్రభుత్వం.. ఈ ప్రాజెక్టును వేగంగా చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నా సర్కారులో చలనం లేదు. సీతారామసాగర్, సమ్మక్కసాగర్, కాళేశ్వరం మూడో టీఎంసీ, అంబేద్కర్ వార్ధా పెండింగ్​లో ఉన్నాయి. వాటికి క్లియరెన్సులు తీసుకురావడంలో కాంగ్రెస్ విఫలమైంది. ఏపీ కడ్తున్న ప్రాజెక్టులను ఆపాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం లేఖలు కూడా రాయలేదు. కొత్త ప్రాజెక్టులు కడ్తున్నామని.. నిధులివ్వాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు.

 ఏడీబీ నుంచి రూ.40 వేల కోట్లు ఇప్పిస్తామని కేంద్రం మాట కూడా ఇచ్చింది. ప్రాజెక్టులను ఆపాలని ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసే సోయి ప్రభుత్వానికి లేకుండా పోయింది’’అని హరీశ్ విమర్శించారు. సలహాదారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఏపీ అక్రమంగా కడుతున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద సుప్రీంకోర్టులో తప్పుడు వాదనలు వినిపించిన ఆదిత్యనాథ్ దాస్​కు కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించిందని తెలిపారు. అలాంటి వ్యక్తిని సలహాదారుగా పెట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు. అడ్వైజర్లుగా పెట్టుకునేందుకు ఇంకెవరూ దొరకలేదా? అని ప్రశ్నించారు.

లేఖ రాసి ఉంటే అప్పుడే ఎందుకు బయటపెట్టలేదు

బనకచర్లపై కేంద్రానికి 22నే లేఖ రాసి ఉంటే అప్పుడే మీడియాకు ఇచ్చి ఉండేవారు కదా అని హరీశ్ రావు ప్రశ్నించారు. తాను ప్రెస్‌‌‌‌మీట్ పెట్టాక మేల్కొని 22డేట్‌‌‌‌తో లెటర్ రాసి ఇప్పుడు విడుదల చేశారని దుయ్యబట్టారు.