రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర : వివేక్ వెంకటస్వామి

రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర  :  వివేక్ వెంకటస్వామి
  • రాష్ట్రంలో ఎంపీ సీట్లు తగ్గించే ప్రయత్నం: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
  • నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగినయ్​
  • సిలిండర్ ధర పెంచి సామాన్యులపై భారం మోపిందని ఫైర్
  • మోదీ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నరు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీల్లో 
  • జై బాపు.. జై భీమ్.. జైసంవిధాన్ ప్రోగ్రామ్​కు హాజరు 

కోల్​బెల్ట్​/జైపూర్, వెలుగు: రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రంలో ఎంపీ సీట్లను తగ్గించే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక నిత్యవసరాల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. ‘‘గ్యాస్ సిలిండర్ ధర పెంచడంతో సామాన్యులపై రూ.150 కోట్ల భారం పడింది. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా మన దేశంలోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్.. ఇప్పుడు వెయ్యి రూపాయలకు పెరిగింది’’అని వివేక్ అన్నారు. 

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని అమరవాది, మందమర్రి మున్సిపాలిటీలోని అంగడిబజార్, చిర్రకుంట, భీమారం మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన జై బాపు.. జై భీమ్.. జైసంవిధాన్ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి వివేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీజీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు.

 పొన్నారంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. భీమారంలో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడారు. ఎన్నికల టైమ్​లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. ఆర్టీసీలో ఫ్రీ జర్నీ కోసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. పేదలకు సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు. సన్న వడ్ల సాగును ప్రోత్సహించేందుకు రూ.500 బోనస్ ఇచ్చామన్నారు. 

బీఆర్ఎస్ హయాంలో బియ్యం మాఫియా

బీఆర్ఎస్ హయాంలో బియ్యం మాఫియా తయారైందని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పులోకి నెట్టిందని మండిపడ్డారు. ‘‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేశారు. మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసింది. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10లక్షలకు పెంచింది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రోగులకు ఆర్థిక సాయం అందిస్తున్నాం.

 పొన్నారం మోడల్​ విలేజ్​లో 198 ఇండ్లు మంజూరయ్యాయి. ఏడాది కాలంలో చెన్నూరు నియోజకవర్గం నుంచి 950 మంది సీఎంఆర్ఎఫ్​ కోసం దరఖాస్తు చేసుకుంటే.. 70శాతం మందికి సాయం మంజూరైంది. నేను పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడు క్యాతనపల్లి రైల్వే గేటు వద్ద ఆర్వోబీ సాంక్షన్ చేయించిన. తర్వాత ఎంపీ, ఎమ్మెల్యేగా పని చేసిన బాల్క సుమన్ బ్రిడ్జి గురించి పట్టించుకోలే. నేను, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కలిసి ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి చేయించినం. బీఆర్ఎస్ లీడర్లు మాత్రం తామే చేయించినట్లు సంబురాలు చేసుకోవడం విడ్డూరంగా ఉన్నది. అమరవాది గ్రామంలో రూ.35 లక్షలతో అభివృద్ధి పనులు చేపడ్తున్నాం’’అని వివేక్ అన్నారు. 

ఏఐ ఫొటోలతో తప్పుదారి పట్టిస్తున్నరు

కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఏఐ ఫొటోలతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించారని వివేక్ మండిపడ్డారు. సోషల్ మీడియా అకౌంట్​లో గ్రాఫిక్స్ ఫొటోలు పోస్టు చేసి.. నిజం తెలిశాక డిలీట్ చేశారన్నారు. ‘‘బీఆర్ఎస్ హయాంలో తప్పుడు కేసులు పెట్టారు. ప్రజా ప్రభుత్వంలో అలాంటి వాటికి స్థానం లేదు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో స్మశాన వాటికలకు భూమి ఇవ్వాలని సింగరేణి మేనేజ్​మెంట్​ను కోరిన. సీఎండీని కూడా కలిసిన. త్వరలో భూమికి పర్మిషన్ వస్తది. 

రూ.200 కోట్లతో చెన్నూరు మండలం సోమనపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నాం. అన్ని స్కూళ్లకు రిపేర్లు చేయిస్తాం. బీఆర్ఎస్ పాలనలో మందమర్రి మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోలేదు. నేను ఎమ్మెల్యే అయ్యాక సీసీ రోడ్లు, డ్రైయినేజీలు, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేసినం. కాకా వెంకటస్వామి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మందమర్రి, బెల్లంపల్లి మున్సిపాలిటీలకు గోదావరి తాగునీటి సప్లై కోసం రూ.24 కోట్లతో ముల్కల నుంచి శాశ్వత నీటి పథకం ఏర్పాటు చేశారు. విశాక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మున్సిపాలిటీల్లో ట్యాంకర్ల ద్వారా నీళ్లు సప్లై చేశాం. రూ.30 కోట్లతో అమృత్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్​ను ఎంపీ వంశీకృష్ణ మంజూరు చేయించారు. భీమారం మండలానికి రూ.1.20 కోట్ల నిధులు, కొత్త పీహెచ్​సీ మంజూరు చేశాం. ప్రభుత్వ పథకాల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఊరుకోం’’అని వివేక్ అన్నారు.