నాటి నుంచి నేటి దాకా.. తెలంగాణ ఎమ్మెల్యేల్లో ఏ కులంవాళ్లు ఎందరు?

నాటి నుంచి నేటి దాకా.. తెలంగాణ ఎమ్మెల్యేల్లో ఏ కులంవాళ్లు ఎందరు?

ఈ దేశంలో వేల సంవత్సరాలుగా అణచివేతకు గురైన బీసీ వర్గాలు స్వాతంత్య్రానంతరం  తాము అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతామని, అగ్రవర్ణాలతో పోటీపడే సమాన అవకాశాలు లభిస్తాయని, తమ జనాభా దామాషా ప్రకారం న్యాయబద్ధమైన వాటా లభిస్తుందని ఆశించారు. స్వాతంత్య్రం వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలలో  రిజర్వేషన్లు కల్పించడంతో  కొంతమేర లబ్ధి చేకూరినప్పటికీ చట్టసభలలో రిజర్వేషన్లు లేకపోవడం వలన వారి ప్రాతినిధ్యం నామమాత్రంగా మారింది. ఈ దేశ పరిపాలనలో వారు భాగస్వాములు కాలేకపోతున్నారు.  ఎస్సీ, ఎస్టీలకు వారు జనాభా దామాషా ప్రకారం చట్టసభలలో రిజర్వేషన్లు ఉండడం వలన వారి ప్రాతినిధ్యం కొంతవరకైనా మెరుగుగా ఉంది. 

 జనరల్ సీట్లలో వారు  పోటీచేసి గెలిచిన సీట్లు చాలా తక్కువ.  అనాదిగా అగ్రవర్ణాలు వివిధ ధర్మాల, వాదాల పేరిట సామాజిక న్యాయాన్ని సమాధి చేశారు. మెజారిటీ ప్రజల జీవితాలను బానిస బతుకులుగా మార్చారు.  సంపద,  రాజకీయ అధికారం.. ఆధిపత్య అగ్రవర్ణాల వారి చేతుల్లో ఉండటం వలన  బీసీలు  బానిస సంకెళ్లు  తెంపుకోలేకపోతున్నారు. చట్టసభలలో  నామమాత్రంగా మిగిలిపోతున్నారు. ఉదాహరణకు  తెలంగాణ ప్రాంతంలో 1952 నుంచి 2023 వరకు 16 సార్లు శాసనసభకు ఎన్నికలు జరగగా ప్రతిసారి బీసీలు నామమాత్రపు ఉనికినే చాటుకున్నారు.  ఐదు శాతం జనాభా లేని అగ్రకులాలు 50శాతం పైగా సీట్లు సాధిస్తున్నారు. ఈ పక్క పట్టికను గమనించినట్లయితే  బీసీల రాజకీయ ప్రాతినిధ్యం తేటతెల్లమవుతుంది.  

బీసీలు రాజ్యాధికార కాంక్ష పెంచుకోవాలి

చదువుకున్నవారు, ఆర్థికంగా స్థిరపడిన బీసీలు క్రియాశీలక రాజకీయాలలోకి రావాలి.  రాజ్యాధికార కాంక్ష పెంచుకోవాలి. అగ్రవర్ణాలు పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టాలి. చట్టసభలలో  బీసీలకు రిజర్వేషన్లు లేవు. కాబట్టి, ఒక బీసీ కులం ఇంకో బీసీ కులాన్ని డామినేట్ చేస్తుందనే  భావన నుంచి బయటకువచ్చి అందరు సంఘటితమై ఉద్యమించాలి.  ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చి చట్టసభలలో రిజర్వేషన్లు సాధించాలి. అప్పుడే బీసీలు రాజ్యాధికారం పొందగలుగుతారు.  బీసీలలో ఉన్న అత్యంత వెనుకబడిన వర్గాలు కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలి. 

 బీసీల రాజకీయ వెనుకబాటుతనం తేటతెల్లం అయ్యేలా  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కులగణన చేపట్టాలి. బీసీలలో కూడా సబ్ కేటగిరీలు చేసి మిగిలినవారు కూడా రాజ్యాధికారంలో పాలుపంచుకునేలా రిజర్వేషన్లు అమలుచేయాలి. అప్పుడే సామాజిక న్యాయం అట్టడుగు వర్గాలకు అందుతుంది.  ప్రజాస్వామ్యం అంటే ఒక రెండు, మూడు కులాల పాలన కాదు.  ఇది ప్రజలందరి పాలన.  డాక్టర్  బాబాసాహెబ్ అంబేద్కర్  చెప్పిన ‘రాజ్యాధికారమే సామాజిక ప్రగతికి తాళం చెవి’  వాస్తవాన్ని బీసీలు గుర్తించాలి.  రాజ్యాధికారం లేనిదే సామాజిక న్యాయం సాధ్యం కాదు. అందుకే  విభేదాలు పక్కన పెట్టి కులాలు వేరైనా బీసీలందరూ ఒక్కటే అన్న నినాదంతో ఐక్యంగా ఉద్యమించాలి. రాజ్యాధికారం చేపట్టాలి,  సమర్థ పాలకులమని నిరూపించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. 

బీసీలను ఎవరు రక్షించాలి?

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీసీలు ముందుండి పోరాటం సాగించారు.  తెలంగాణ  సాధించిన తర్వాత  రాష్ట్రంలో సామాజిక న్యాయం అందరికీ అందుతుందని ఆశపడ్డారు. కానీ,  మరల దొరల పాలన వచ్చి దగా పడ్డారు. 2009లో 23 మంది బీసీ శాసనసభ సభ్యులు ఉంటే 2014లో 20,  2023లో 19కి  పడిపోయినారు. ఇదే ధోరణి కొనసాగితే వీరి ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.  కాగా, 2029 నుంచి చట్టసభలలో మహిళా రిజర్వేషన్లు కూడా అమలు కాబోతున్నాయి.  అందులో బీసీ మహిళలకు రిజర్వేషన్లు లేవు.  ఇది మూలిగే నక్కపై  తాటిపండు పడిన చందంలాగ ఉంది. 

ఈ మధ్యకాలంలో చాలామంది బీసీలు రకరకాల భావజాలంలో  కొట్టుకొనిపోతూ తమకు జరుగుతున్న అన్యాయాలని తాము గుర్తించలేకపోతున్నారు. ఏ వర్గాలైతే వారిని అణచివేస్తున్నారో ఆ వర్గాల జెండాలే మోస్తున్నారు. ఇక బీసీలను ఎవరు రక్షించాలి? అన్ని రాజకీయపార్టీలు బీసీలను  ఓటుబ్యాంకుగా వాడుకొని వదిలేసినవే.  ఏ ఒక్కరికీ బీసీల అభివృద్ధిపై చిత్తశుద్ధిలేదనేది అక్షరసత్యం.  ఇప్పటికైనా బీసీలు వాస్తవాలు తెలుసుకోవాలి. ఉద్యమ బాట పట్టాలి.

1952-–2023 వరకు తెలంగాణ ఎమ్మెల్యేల కులాల వారీగా  లెక్కలు చూసినట్లయితే జనాభాలో 60% ఉన్న బీసీలు 1952 అసెంబ్లీలో 9 మంది ఉండగా 2023 నాటికి 19 మందికి నామమాత్రంగా పెరిగినారు. 1978లో అత్యధికంగా 27 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉండగా,  ప్రాంతీయ పార్టీ  తెలుగుదేశం హవాలో 1983లో 15,  1985లో 14 సంఖ్యకు పడిపోయినారు.  ప్రస్తుత అసెంబ్లీలో 16% అనగా 19 మంది ఉన్నారు. దీనిని బట్టి తెలిసింది ఏమిటంటే బీసీలలో ఇంకా రాజకీయ చైతన్యం రాలేదు.  బానిస మనస్తత్వంతోనే ఉన్నారు. 1983 తర్వాత రాజకీయాలలో  ‘3ఎం’ (మనీ పవర్, మజిల్ పవర్, మీడియా పవర్ )ల  పాత్ర పెరగటమే ప్రధాన కారణం.  

బీసీ కులాలలో ఏయే కులాలు అసెంబ్లీకి తమ ప్రతినిధులను రెగ్యులర్​గా  పంపాయనేది  పై పట్టికను సునిశితంగా పరిశీలిస్తే అవి కేవలం ఐదు కులాలే ఉన్నాయి. అవి మున్నూరు కాపు, గౌడ, యాదవ, ముదిరాజ్, పద్మశాలీలు. ఇక శాసనసభకు అడపాదడపా ఎమ్మెల్యేలను పంపిన కులాలు లింగాయత్, రజక, పెరిక, విశ్వకర్మ,  కురుమ,  గంగపుత్ర , వంజర,  బోయ,  లోద క్షత్రియ లేదా బొందిలి,  ఖత్రి,  సగర,  సేవక,  ఆరె మరాఠీ మొదలైనవి. 

 బీసీలలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 136 కులాలు ఉండగా అందులో సుమారు 120 కులాలు నేటికీ తమ నేతలను శాసనసభకు పంపలేకపోయారు.  మూడు లక్షలకు పైబడి జనాభా ఉన్న నాయీ బ్రాహ్మణులు (మంగలి) శాలివాహనులు (కుమ్మరి), వడ్డెరలు ఈ 77 ఏండ్ల స్వాతంత్ర్య పాలనలో ఒక్క సభ్యుడిని కూడా శాసనసభకు పంపలేకపోయారు. నాయీ బ్రాహ్మణుడు అయిన భారతరత్న  కర్పూరి ఠాకూర్ బిహార్​లో ముఖ్యమంత్రిగా పనిచేసి జననాయకుడైనారు.  

మన పొరుగు రాష్ట్రం తమిళనాడులో  నాయీ బ్రాహ్మణులు ముఖ్యమంత్రులుగా  ఏలుతుంటే ఇక్కడ ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. కేవలం లక్ష జనాభా ఉన్న ఒక అగ్రకులం అసెంబ్లీలో ప్రతిసారి ఐదు నుంచి ఏడు శాతం సీట్లు సంపాదిస్తున్నది.  అలాగే  మూడు శాతం జనాభా ఉన్న ఇంకో అగ్ర కులం 33% సీట్లు సాధిస్తున్నది.  60% జనాభా ఉన్న బీసీలు ఎక్కడో  మూలనపడి ఉంటున్నారు. 10 నుంచి 20% మించడం లేదు.  ఇది ఎక్కడి సామాజిక న్యాయం, ఇదెక్కడి ప్రజాస్వామ్య పాలన? 

- టి.చిరంజీవులు,  ఐఏఎస్​(రిటైర్డ్​)