ఐదుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవమే!..మూడు పార్టీల అభ్యర్థుల ఎన్నిక లాంఛనమే..

ఐదుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవమే!..మూడు పార్టీల అభ్యర్థుల ఎన్నిక లాంఛనమే..
  • 3 పార్టీల అభ్యర్థుల ఎన్నిక లాంఛనమే..ఈ నెల 20న ప్రకటించనున్న ఈసీ
  • కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్​, శంకర్ నాయక్, విజయశాంతి..సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం నామినేషన్​ దాఖలు
  • పాల్గొన్న సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు
  • బీఆర్ఎస్​ నుంచి నామినేషన్ వేసిన దాసోజు

హైదరాబాద్, వెలుగు:ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లు 5 ఏకగ్రీవం కానున్నాయి. ఈ స్థానాలకు 3 ప్రధాన పార్టీల నుంచి ఒక్కో సీటుకు ఒక్కో నామినేషన్ దాఖలు కాగా.. ముగ్గురు ఇండిపెండెంట్లు ఫైల్​ చేశారు. అయితే, ఇండిపెం డెంట్ల నామిషన్లు నిబంధనలకు లోబడి లేకపోవడంతో ప్రధాన పార్టీలకు చెందిన ఐదుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే చాన్స్​ఉంది. నామినేష న్లకు చివరిరోజైన సోమవారం మొత్తం 8 నామినేషన్లు వచ్చాయి. ఇందులో కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, శంకర్​నాయక్​, విజయశాంతి.. సీపీఐ నుంచి  నెల్లికంటి సత్యం.. బీఆర్ఎస్​ నుంచి దాసోజు శ్రవణ్ నామినేషన్లు దాఖలు చేశారు.  మరో ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా నామినేషన్​ వేశారు. అయితే,  ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి ఆ నామినేషన్ పత్రాలు లేకపోవడంతో మంగళవారం ఈసీ చేపట్టనున్న  పరిశీలనలో అవి తిరస్కరణకు గురయ్యే చాన్స్​ ఉన్నది. 

 ఈ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసే ఒక్కో అభ్యర్థి కనీసం 10 మంది ఎమ్మెల్యేల మద్దతు తీసుకొని వారి సంతకాలతో నామినేషన్లను దాఖలు చేస్తేనే అవి ప్రాథమికంగా చెల్లుబాటు అవుతాయి. అయితే ఈ ముగ్గురు ఇండింపెండెంట్లు ఆ నిబంధనలను పాటించలేదు.  ఈ నెల 20 న ఎమ్మెల్సీ ఫలితాలను ఎలక్షన్ కమిషన్ ప్రకటించి, అదే రోజున ఏగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు  ధృవీకరణ పత్రాలను అందజేయనున్నది.  ఎమ్మెల్యేల సంఖ్యా బలం ప్రకారం కాంగ్రెస్ 3, దాని మిత్రపక్షమైన సీపీఐ ఒకటి, బీఆర్ఎస్​ ఒక సీటును గెలుచుకోనున్నాయి. కాంగ్రెస్​ నుంచి అద్దంకి దయాకర్, శంకర్​నాయక్, విజయశాంతి, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్​ తరఫున దాసోజు శ్రవణ్​కుమార్​ ఎన్నిక ఏకగ్రీవం కానున్నది. 

అట్టహాసంగా నామినేషన్లు దాఖలు

నామినేషన్లకు సోమవారం చివరి తేదీ కావడంతో 5 స్థానాలకు ప్రధాన పార్టీలు.. తమ అభ్యర్థులను ఆదివారం రాత్రి ప్రకటించాయి.  దీంతో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతితో పాటు సీపీఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం  సోమవారం మధ్యాహ్నం అసెంబ్లీకి చేరుకొని, అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ  కార్యాలయంలో ఈసీ అధికారులకు తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. 

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, శ్రీధర్ బాబుతో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఇతర సీపీఐ నేతలు పాల్గొన్నారు. మజ్లిస్ కు చెందిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొని, వారి నామినేషన్ పత్రాలపై మద్దతుగా సంతకాలు చేశారు.  

అంతకుముందు అభ్యర్థులు గన్ పార్కు వద్ద ఉన్న  తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు. నామినేషన్​దాఖలు కార్యక్రమంలో అభ్యర్థులతోపాటు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో అసెంబ్లీ ప్రాంగణమంతా జనంతో కిటకిటలాడింది. కాగా, ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవం కానున్న అద్దంకి దయాకర్, శంకర్​నాయక్​, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్ నల్గొండ జిల్లాకు  చెందినవారే కావడం గమనార్హం.