హైదరాబాద్, వెలుగు: తెలంగాణ తల్లి విగ్రహం గ్రామీణ, సామాన్య ప్రజలను ప్రతిబింబిస్తున్నదని శాసనమండలి ముక్తకంఠంతో ప్రశంసలు కురిపించింది. సోమవారం ఉదయం శాసనమండలి, చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ తల్లి విగ్రహంపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు జీవన్‌రెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్, తీన్మార్ మల్లన్న, బీజేపీ సభ్యుడు ఎనీఎన్రెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీలు అలుగుబెల్లి నర్సిరెడ్డి, రఘోత్తమ్ రెడ్డి మాట్లాడారు. చైర్మన్ సుఖేందర్‌రెడ్డి సోనియాగాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఎంపీగా తమ తెలంగాణ పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ సభ్యులు విగ్రహ ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు పలకడాన్ని స్వాగతించారు. సభ్యుల అభ్యర్థన మేరకు భవిష్యత్తులో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలనే అంశాన్ని, అన్ని కలెక్టరేట్లలో విగ్రహ ఏర్పాటును పరిశీలిస్తామని తెలిపారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌గా మార్చే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. వచ్చే సోమవారం ఉదయం 10గంటల వరకు కౌన్సిల్ వాయిదా పడింది.
గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టింది: జీవన్‌రెడ్డి
కాంగ్రెస్ సభ్యులు జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టింది. ఆకు పచ్చని రంగుతో పంటలను, శాంతి సౌభాగ్యాన్ని ప్రతిబింబించింది. వరి, మక్క, జొన్న, సజ్జ పంటలతో, కంటె ఆభరణాలతో ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఉంది. ప్రతిపక్షాల విమర్శలు అర్థరహితం’అని అన్నారు.
వాస్తవాలకు ప్రతిబింబం: అలుగుబెల్లి నర్సిరెడ్డి
విగ్రహం వాస్తవాలు ప్రతిబింబించేలా ఉంది. ఏడాదిలోనే విగ్రహాన్ని ఆవిష్కరించడం అభినందనీయం. గత 2009 నుంచి అందెశ్రీ గీతాన్ని పాఠశాలల్లో ఆలపించే వారు. ఇప్పుడు గీతాన్ని అధికారికంగా ప్రకటించడం హర్షణీయం.
నిజమైన రూపం: తీన్మార్ మల్లన్న
తెలంగాణ తల్లి విగ్రహం అద్భుతం. తెలంగాణ బిడ్డగా నాకు గర్వంగా ఉంది. తల్లి 9నెలలు గర్భంలో మోస్తే తెలంగాణ తల్లి ఆరు దశాబ్దాలు మోసింది. బైరాన్‌పల్లిలో పోరాడిన అమ్మలా, చాకలి ఐలమ్మలా 17 అడుగుల అసలైన అమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించడం బాగుంది. సెక్రటేరియెట్ వద్ద ఉన్న తెలుగుతల్లి ఫ్లై ఓవర్పేరును తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్ గా మార్చాలి. అన్ని కలెక్టరేట్లలో విగ్రహాలను ఏర్పాటు చేయాలి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఫొటో పెట్టాలి.