పంచాయతీల అభివృద్ధిలో తెలంగాణ మోడల్:​అజయ్ నారాయణ ఝా

పంచాయతీల అభివృద్ధిలో తెలంగాణ మోడల్:​అజయ్ నారాయణ ఝా

యాదాద్రి, వెలుగు: పంచాయతీల అభివృద్ధిలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు మోడల్‎గా నిలిచిందని 16వ ఆర్థిక సంఘం సభ్యుడు అజయ్ నారాయణ ఝా పేర్కొన్నారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం అనంతారంలో మంగళవారం ఆయన పర్యటించారు. ముందుగా పల్లె దవాఖానను సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. అనంతరం స్వచ్ఛదనం-– పచ్చదనం, శానిటేషన్ పై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ తిలకించారు. జడ్పీ హై స్కూల్‎లో నిర్మించిన అదనపు తరగతి గదులను పరిశీలించి, మొక్కలు నాటారు. గ్రామ పంచాయతీ ఆవరణలో స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూపులతో  భేటీ అయ్యారు. 

అనంత రం ఆయన మాట్లాడుతూ15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా పంచాయతీల్లో పనులు బాగా జరుగుతున్నాయన్నారు. వచ్చే 16వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. 16వ ఆర్థిక సంఘం సభ్యుడు మనోజ్ పాండా, జాయింట్ సెక్రటరీ కేకే మిశ్రా, జాయింట్ డైరెక్టర్ దావిందర్ చోడా, డిప్యూటీ డైరెక్టర్ అభిషేక్ నందన్, అసిస్టెంట్ డైరెక్టర్ హజారిక, రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితారామచంద్రన్, కలెక్టర్ హనుమంతు జెండగే, అడిషనల్ కలెక్టర్ గంగాధర్, జడ్పీ సీఈవో శోభారాణి ఉన్నారు.