![మోడల్ స్కూళ్ల టీచర్లకు బదిలీలు...ఇదీ షెడ్యూల్..](https://static.v6velugu.com/uploads/2023/07/Telangana-Model-schools-teachers-TransfersTelangana-Model-schools-teachers-Transfers_5RsE7DHgbe.jpg)
- రిక్రూట్ అయినంక తొలిసారి ట్రాన్స్ ఫర్లు
- ఈ నెల 5 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు
- షెడ్యూల్ రిలీజ్ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పని చేస్తున్న టీచర్లకు ఎట్టకేలకు బదిలీలు నిర్వహించేందుకు సర్కారు సిద్ధమైంది. ఈ మేరకు సోమవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన షెడ్యూల్ రిలీజ్ చేశారు. బదిలీల ప్రక్రియ ఈ నెల5తో ప్రారంభమై నెలాఖరు వరకు ముగియనున్నది. బదిలీల ద్వారా దాదాపు 2,600 మంది టీచర్లకు లబ్ధి చేకూరనున్నది. రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్లలో సుమారు 2,800 మంది టీజీటీ, పీజీటీలతో పాటు ప్రిన్సిపల్స్ పని చేస్తున్నారు. వీరంతా 2013, 2014 సంవత్సరాల్లో రిక్రూట్ అయ్యారు. ఏ స్కూల్లో అయితే రిక్రూట్ అయ్యారో.. అప్పటి నుంచి అదే స్కూల్లో పని చేస్తున్నారు. వివిధ కారణాలతో రెండేండ్ల నుంచి దాదాపు 200 మంది ట్రాన్స్ఫర్ అయ్యారు. వీళ్లు తప్పా.. మిగిలిన 2,600 మంది బదిలీల ప్రక్రియలో పాల్గొనేందుకు అర్హులని అధికారులు ప్రకటించారు. ఐదేండ్ల సర్వీస్ పూర్తయిన ప్రిన్సిపల్స్, 8 ఏండ్ల సర్వీస్ పూర్తయిన టీజీటీ, పీజీటీలు బదిలీ కానున్నారు. వీరికి పాత జోన్ల ప్రకారమే బదిలీలు చేపట్టనున్నారు. మరోపక్క నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా స్కూల్ లో జాయిన్ అయిన తేదీనే పరిగణనలోకి తీసుకొని సీనియార్టీ లిస్టులు రెడీ చేయనున్నారు. కాగా, బదిలీల షెడ్యూల్ రిలీజ్ పై మోడల్ స్కూల్ టీచర్ల సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ షెడ్యూల్...
- ఈ నెల5న తాత్కాలిక ఖాళీల లిస్టు వెబ్సైట్లో పెడతారు.
- 5 నుంచి 7 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
- దాని ప్రింటౌట్ ను టీజీటీ, పీజీటీలు ప్రిన్సిపల్‌కు, ప్రిన్సిపల్స్ డీఈఓలకు ఇవ్వాలి.
- 8న వెబ్సైట్లో ఖాళీల ఫైనల్ జాబితా పెడతారు.
- 18, 19 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి.
- 20 నుంచి 23 వరకు బదిలీల లిస్టు రిలీజ్ చేస్తారు.
- 23 నుంచి 26 వరకు టీచర్లు కొత్త స్కూళ్లలో జాయిన్ కావాలి.