- బీఆర్ఎస్ సర్కారు ఆదుకోవట్లేదని ఈ నెల 5న సూసైడ్ అటెంప్ట్
- చికిత్స పొందుతూ కన్ను మూసిన మల్లయ్య
కరీంనగర్ రూరల్, వెలుగు : ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమంలో పాల్గొని కొట్లాడితే తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ సర్కార్తనను ఆదుకోవడం లేదంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఉద్యమకారుడు కుక్కల మల్లయ్య(58) చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశాడు. గ్రామస్తులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. కరీంనగర్ రూరల్‌మండలం దుబ్బపల్లికి చెందిన మల్లయ్య ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. రాష్ట్రం వచ్చాక ఉద్యమంలో పాల్గొన్న చాలామందికి కళాకారులుగా ఉద్యోగాలు వచ్చాయని, తెలంగాణ కోసం కొట్లాడితే తనకేం రాలేదని మదనపడుతూ ఉండేవాడు.
ALSO READ:జోరుగా దందా.. పర్మిట్ల మాటున అక్రమ కలప రవాణా
ఈ క్రమంలో సెప్టెంబర్5న కరీంనగర్‌లోని అమరవీరుల స్తూపం దగ్గర గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆటో డ్రైవర్లు గమనించి ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం చనిపోయాడు. మృతుడికి భార్య దేవేంద్ర, కొడుకులు సంజీవ్‌కుమార్, సాయిచంద్, కూతురు సారిక ఉన్నారు.