
దక్షిణ భారతదేశ రాజకీయ చరిత్రలో ముల్కీ ఉద్యమాలు కీలకమైన పాత్ర పోషించాయి. ముల్కీ అంటే స్థానికుడు. ముల్క్ అంటే దేశం. బహుమనీల కాలం నుంచి ముల్కీ, నాన్‌ముల్కీల సమస్య ఉండేది. 14వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్ వంశాలైన ఖిల్జి, తుగ్లక్ సైన్యాలతోపాటు దక్షిణ భారతదేశానికి వచ్చి స్థిరపడిన వారిని దక్కనీలు అంటారు. వీరిలో హిందువులు, ముస్లింలూ ఉన్నారు. వీరు బహమనీ సుల్తానుల కాలంలో ప్రభుత్వ పదవులు, ఉద్యోగులు పొందేవారు. అదే సమయంలో ఇరాన్, ఇరాక్, టర్కీ, అరేబియా నుంచి కూడా అనేక మంది దక్షిణ భారతదేశానికి వచ్చి స్థిరపడ్డారు. వీరిని ఆఫాకీలు అనేవారు. అంటే స్థానికేతరులు అని అర్థం. దక్కనీలు మల్కీలుగా, ఆఫాకీలు గైర్ ముల్కీలుగా వ్యవహరించేవారు.
ఆ కాలంలో వర్తక వాణిజ్యాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయ సహకారాలు అందజేసేది. పన్నుల మినహాయింపునిచ్చి సౌకర్యాలు కల్పించేది. విదేశాల నుంచి వచ్చిన ఆఫాకీలు వర్తక వాణిజ్యాల్లో చేరి ఆర్థికంగా స్థిరపడ్డారు. సైన్యం, ఇతర ఉద్యోగాల్లో ప్రముఖ స్థానాలను ఆక్రమించారు. మంత్రి పదవులు సంపాదించారు. దక్కనీలంతా అన్ని రంగాల్లో రెండో శ్రేణి పౌరులుగా ఉండేవారు. మొత్తం రాజ్య సంపదలో ఆఫాకీలదే పైచేయి. సంపదలో దక్కనీల వాటా అతి తక్కువ. వారికి చిన్నచిన్న ఉద్యోగాలు మాత్రమే దక్కాయి.
ప్రభుత్వ పాలనలో ఆఫాకీలే ఆధిక్యం సంపాదించి అన్ని ప్రయోజనాలు పొందారు. దీనివల్ల ఆఫాకీలకు, దక్కనీలకు అన్ని రంగాల్లో అంతరాలు పెరిగి శత్రుత్వం ఏర్పడింది. దీనికి మత విభేదాలు కూడా తోడయ్యాయి. ఆఫాకీలంతా షియాలు. దక్కనీలంతా సున్నీలు. మూడో మొహమ్మద్ ప్రధాని గవాన్ పరిపాలన సంస్కరణలు దక్కనీలకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఫలితంగా బీదర్‌లో ఆఫాకీలు, దక్కనీల మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ముల్కీ, గైర్ ముల్కీల మధ్య అంత:కలహాల కారణంగానే బహమని రాజ్యం 16వ శతాబ్దంలో పతనమైంది.
స్థానికులకే ప్రాధాన్యమిచ్చిన కుతుబ్‌షాహీలు
1512లో గోల్కొండలో స్వతంత్ర కుతుబ్‌షాహీ రాజ్యాన్ని స్థాపించిన కులీకుతుబ్‌షా ఆఫాకీ అయినా దక్కనీలకే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చాడు. స్థానిక భాష తెలుగును ప్రోత్సహించాడు. అబుల్ హసన్ తానీషా కాలంలో ప్రధాన మంత్రిగా మాదన్న, సైన్యాధిపతిగా అక్కన్న పనిచేశారు. కుతుబ్‌షాహీ రాజులు స్థానికుల చరిత్రను, భాషా సంస్కృతులను గౌరవించడం వల్ల ముల్కీ సమస్య తలెత్తలేదు. వీరి పతనం తర్వాత మొఘలులు 37 సంవత్సరాలు దక్కన్‌ను పాలించారు. 1724లో నిజాం ఉల ల్ ముల్క్ స్వాతంత్ర్యం ప్రకటించుకొని హైదరాబాద్‌లో అసఫ్‌జాహీ రాజ్యాన్ని స్థాపించాడు. మొదటి నిజాం దక్కన్కు వచ్చినప్పుడు తన వెంట విశ్వాస పాత్రులైన అనుచరులను తీసుకువచ్చాడు.
అందులో ముస్లింలతోపాటు హిందువులు ముఖ్యంగా కాయస్తులు ఉన్నారు. వీరంతా జాగీర్లు, మంత్రి పదవులతోపాటు ఉన్నత ఉద్యోగాలన్నీ చేజిక్కించుకున్నారు. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత మొఘలుల రాజ్యం అంతరించగానే ఢిల్లీ, లక్నో, ముర్షిదాబాద్, అవధ్ రాజ్యాల నుంచి పదవులు, ఉద్యోగాలు కోల్పోయిన వారంతా ఏ కల్లోలం లేని నిజాం రాజ్యంలోకి వలస వచ్చారు. ఐదో నిజాం అఫ్జలుద్దౌలా కాలంలో ప్రధాని సాలార్జంగ్ చేపట్టిన పరిపాలన సంస్కరణల వల్ల కాయస్తులు, ఖత్రీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కోసం వలస వచ్చారు.
హైదరాబాద్‌లో సివిల్ సర్వీసు స్థాపించిన సాలార్జంగ్ తప్పనిసరై అలీగఢ్ విశ్వవిద్యాలయం నుంచి విద్యావంతులైన వారిని హైదరాబాద్‌కు ఆహ్వానించాడు. ఒకటో సాలార్జంగ్ తన పరిపాలనా సంస్కరణలు త్వరతగతిన సమర్థవంతంగా అమలు జరగాలంటే సమర్థులైన, ఆంగ్లం తెలిసిన, పరిపాలనలో అనుభవం కలిగిన వారు ఉండాలని భావించి బ్రిటీష్ ఇండియాలో అధికారులుగా పనిచేసిన వారిని హైదరాబాద్ ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించారు. ఈ విధంగా వలసలు ప్రారంభమయ్యాయి.
బయటి నుంచి వచ్చిన ఉద్యోగులు స్థానిక ఉద్యోగులకు తగిన శిక్షణ ఇచ్చి, వారికి బాధ్యతలు అప్పగించి వెనక్కి తిరిగిపోతారని సాలార్జంగ్ అనుకున్నాడు. ఈ కాలంలోనే ఉత్తర్‌ప్రదేశ్ నుంచి బిల్గ్రామి వంశానికి చెందిన అనేక మంది ఇక్కడికి వచ్చి ఉన్నత ఉద్యోగాలు పొందారు. అలాగే, బెంగళూరు నుంచి అఘోరనాథ్ ఛటోపాధ్యాయ మొదలైనవారు, తమిళదేశం నుంచి ఇంగ్లీష్ బాగా వచ్చినవారు హైదరాబాద్‌కు వలస వచ్చారు. దీంతో స్థానికుల జీవితాలు చిందరవందర అయ్యాయి. వీరంతా నిజాం నవాబుకు మొరపెట్టుకున్నారు. ఉద్యోగులందరూ ముల్కీ, నాన్ ముల్కీలుగా చీలిపోయారు.
1888 గెజిట్
ఉద్యోగులపై నివేదిక అందిన తర్వాత మహబూబ్ అలీఖాన్ 1888లో ఒక జరీదా(గెజిట్)ను జారీ చేశాడు. దీని ప్రకారం నిజాం రాజ్యంలోని ఉద్యోగాలన్నీ అర్హతల ప్రకారం విదేశీయుల జోక్యం లేకుండా స్వదేశీయులకే ఇవ్వాలని నిర్ణయించారు. నాన్ ముల్కీలు ఉద్యోగాలు పొందాలంటే ప్రధాన మంత్రి ప్రత్యేక అనుమతి పొందాలి. ఈ గెజిట్ ప్రకారం స్థానికుడిగా గుర్తింపు పొందడానికి 12 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసి ఉండాలి. లేదా 15 సంవత్సరాలు స్థిర నివాసం కలిగి ఉండాలి. గెజిట్ 1888 తర్వాత కూడా నాన్ ముల్కీల నియామకం హైదారాబాద్‌లో పెరుగుతూనే వచ్చింది.
ఆరో నిజాం కాలంలో
మహబూబ్ అలీఖాన్ కాలంలో 1880లో పార్సీ స్థానంలో ఉర్దూ అధికార భాషగా మారింది. ఇది ప్రజల భాష. ఇంగ్లీష్‌ను తప్పనిసరి భాషగా ప్రవేశపెట్టారు. ఉర్దూ, ఇంగ్లీషుల్లో ఏకకాలంలో సమానమైన ప్రావీణ్యం లేక ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు ప్రాతినిధ్యం తగ్గింది. 1883లో సాలార్జంగ్–1 మరణానంతరం మీర్ లాయక్ అలీ(రెండో సాలార్జంగ్) బ్రిటీష్ వారి మద్దతుతో హైదరాబాద్ దివాన్ అయ్యాడు. ఇతను గైర్ ముల్కీల పక్షం వహించాడు. ఈ విషయమై ముల్కీలు మహబూబ్ అలీఖాన్‌కు ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన నవాబు నిజాం రాజ్యంలో ఎంత మంది పని చేస్తున్నారు? ఏయే రాష్ట్రాలకు చెందినవారు హైదరాబాద్ రాజ్యంలో విధులు నిర్వర్తిస్తున్నారు? వారి హోదా? తదితర వివరాలను సమర్పించాలంటూ ప్రధానిని ఆదేశించారు. దీంతో మొదటి హైదరాబాద్ సివిల్ లిస్ట్–1886 రూపొందింది. దీని ప్రకారం ముల్కీ ఉద్యోగులు 52శాతం, వారి జీతభత్యాలపై ఖర్చు 42 శాతం, నాన్ ముల్కీ ఉద్యోగులు 48 శాతం, వారి జీత భత్యాలపై ఖర్చు 58శాతంగా తేలింది. 48 శాతం నాన్ ముల్కీల్లో 20శాతం హిందుస్తానీ/ ఉత్తర భారతీయులు 14 శాతం మద్రాస్, 8 శాతం యూరప్, ఇతర దేశాల వారు 1 శాతం ఉండేవారు.
మహారాజా కిషన్ ప్రసాద్
హైదరాబాద్ సంస్థానంలో ఉన్నత పదవుల నియామకంలో బ్రిటీష్‌వారి జోక్యం ఎక్కువగా ఉండేది. 1901లో బ్రిటీష్ వారి ఒత్తిడి వల్ల మీర్ మహబూబ్ అలీఖాన్ కాసన్ వాకర్‌ను ఆర్థికశాఖ కార్యదర్శిగా నియమించాడు. ఇతను తర్వాత ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశాడు. వాకర్ నాన్‌ముల్కీలను విచక్షణారహితంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించాడు. 1901లో ముల్కీ మహారాజా కిషన్ ప్రసాద్ హైదరాబాద్ దివాన్ అయ్యాడు. ఇతను స్థానికులకు/ ముల్కీలకు ప్రాధాన్యత ఇచ్చేవాడు. కానీ బ్రిటీష్‌వారి మద్దతుతో కాసన్ వాకర్ నాన్ ముల్కీలను ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించేవాడు.
1911లో మహబూబ్ అలీఖాన్ మరణానంతరం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ పాలకుడయ్యాడు. ఇతను 1912లో కాసన్ వాకర్‌ను ఆర్థిక మంత్రి పదవి నుంచి తప్పించాడు. కానీ, 1912 వరకు పదవిలో కొనసాగి ఇష్టం వచ్చినట్లు బయటి వారిని ఉద్యోగాల్లో నియమించి అరాచకం సృష్టించాడు కాసన్ వాకర్. నాన్ ముల్కీల విషయం ప్రజల్లో పెద్ద చర్చనీయాంశమైంది. విద్యావంతుల్లో భయాందోళనలు నెలకొని ఇక తమకు ఉద్యోగాలు దొరకవన్న నిరాశ నిస్పృహలతో చివరి అంచుకు చేరుకున్నారు.
ముల్కీ ఉద్యోగులు కూడా తమకు ఇక పదోన్నతులు రావని అభద్రతా భావంలో మునిగిపోయారు. జీతభత్యాల వ్యత్యాసం కూడా వారిని అవమానపరిచింది. అసంతృప్తి సర్వత్రా వ్యాపించి ప్రభుత్వ పాలనా యంత్రాంగం ముల్కీ, నాన్ ముల్కీలుగా రెండు ముక్కలైంది. మహారాజా కిషన్ ప్రసాద్, వాకర్‌కు మధ్య ప్రత్యక్ష యుద్ధం ప్రారంభమైంది. కిషన్ ప్రసాద్ ముల్కీల పక్షాన ఉండటం వల్ల చాలా వరకు ముల్కీల రక్షణకు చర్యలు తీసుకున్నారు.