ఏపీలోని ఊరికి తెలంగాణ ఎంపీ ల్యాడ్స్ నిధులు

  • ఓ కలెక్టర్​ సొంతూరి శ్మశాన వాటిక కోసం రూ.10 లక్షలు కేటాయింపు
  • రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ తీరు వివాదాస్పదం​

సూర్యాపేట, వెలుగు: రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ వ్యవహారశైలి తీవ్ర వివాదాస్పదమవుతున్నది. మన రాష్ట్రంలో మౌలిక వసతుల కోసం ఖర్చు చేయాల్సిన ఎంపీ ల్యాడ్స్ నిధులను ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు గ్రామ శ్మశాన వాటిక అభివృద్ధికి ఖర్చు చేయడం చర్చనీయాంశమైంది. ఏకంగా రూ.10లక్షలు కేటాయించడంతో  ఏపీలో రాజకీయంగా పెద్ద దుమారం రేగింది. రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ నుంచి ఫండ్స్ తెచ్చుకోవాల్సిన దుస్థితి వచ్చిందని అక్కడి అధికార పార్టీపై ప్రతిపక్షాలు మండిపడటంతో ఈ విషయం వెలుగుచూసింది. కాగా, ఈ ఫండ్స్​ కేటాయించింది సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు సొంతూరు కావడం అధికారవర్గాల్లోనూ చర్చకు దారి తీసింది. 

గతంలోనూ ఓ ప్రైవేట్ వెంచర్ కోసం ఎంపీ బడుగుల లింగయ్య రూ.60లక్షలు కేటాయించి విమర్శల పాలయ్యారు.  సూర్యాపేటలోని కాసరబాదరోడ్ లోని మహా ప్రస్థానం నిర్మాణం ఫండ్స్ లేక మధ్యలో ఆగిపోయింది. ఇలాంటి టైంలో ఏపీకి ఫండ్స్ కేటాయించడంపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. రాజ్యసభ సభ్యులకు ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి దేశంలో ఎక్కడైనా రూ.25లక్షల వరకు ఖర్చు చేసే వెసులుబాటు ఉన్నందునే కలెక్టర్ సొంతూరుకు ఫండ్స్ ఇచ్చారని ఆయన వర్గీయులు చెప్తుండటం గమనార్హం.