మునిసిపల్​ చట్టంకోసం ఉరుకులాటేల!

మునిసిపల్​ చట్టంకోసం ఉరుకులాటేల!

ప్రజల ఆస్తులకు, హక్కులకు, వారికి కల్పించాల్సిన మౌలిక సదుపాయాలకు నేరుగా బాధ్యత వహంచేవి స్థానిక సంస్థలే. పల్లెలన్నీ పట్టణాలుగా డెవలప్​ అవుతున్న దశలో మునిసిపాలిటీలపై మరింత భారం పడనుంది. ఈ వ్యవస్థను పటిష్టం చేయడానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్​రావు మార్పును భుజాలకెత్తుకున్నారు. అదే ‘తెలంగాణ మునిసిపల్​ యాక్ట్​–2‌‌019’. దీనిలోని ప్రతి ఒక్క అంశాన్నీ తానే స్వయంగా పరిశీలించి యాక్ట్​ని రూపొందించానని చెప్తున్నారాయన.పూర్తిగా కేసీఆర్​ ఇష్టాయిష్టాలతో ‘ప్రజలకోసం తెచ్చిన ఈ చట్టం’పై ఒక సమగ్ర పరిశీలన.

తెలంగాణ మునిసిపల్​ చట్టం–2019’ని ఈ నెల 18న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రతి చట్టానికి ప్రారంభంలో దానికి సంబంధించిన ప్రస్తావన (ప్రియాంబుల్​) ఉంటుంది. అందులో చట్టం ఉద్దేశాన్ని క్లియర్​గా రాస్తారు. అసెంబ్లీలో మూడు గంటల సేపు మాత్రమే చర్చించి ఆమోదించిన ఈ చట్టంలో క్లారిటీ లేదు. లక్ష్యం, ఉద్దేశం లేని కారణంగా చట్టంలో దశాదిశా లేని ప్రస్తావనలు ఎన్నో చోటుచేసుకున్నాయి.

ఈ యాక్ట్​ డ్రాఫ్ట్ కాపీ​ని ప్రజల ముందు పెట్టి, వాళ్ల అభిప్రాయాలను తెలుసుకొని, వాటికి తగ్గట్లు మార్పులు చేసుంటే బాగుండేది. అప్పుడు ఈ చట్టాన్ని అందరూ స్వాగతించేవారు. అలా కాకుండా డైరెక్ట్​గా ఒక రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టి; రెండో రోజు ముగ్గురు, నలుగురు ప్రసంగించిన తర్వాత ఆమోదించటం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా ఉంది.

చట్టం వచ్చిన తర్వాత, అది నిర్వచించిన పద్ధతిలో కొత్త మునిసిపాలిటీలను ఏర్పాటుచేయాలి. కానీ.. చట్టం ఆమోదం పొందే ప్రక్రియలో ఉండగానే కొత్త మునిసిపాలిటీలను పొందుపరచటం ప్రాథమిక సూత్రాలకు వ్యతిరేకంగా భావించవచ్చు. ‘తెలంగాణ మునిసిపల్​ చట్టం–2019’ ద్వారా 128 మునిసిపాలిటీలను, 12 మునిసిపల్​ కార్పొరేషన్లను గుర్తించారు. ఈ 12​ కార్పొరేషన్లలో 6 కార్పొరేషన్లు హైదరాబాద్​కు ఆనుకొనే ఉన్నాయి. వాటి ఏర్పాటు వెనక ఉన్న లక్ష్యం గానీ తగిన జస్టిఫికేషన్ గానీ ఈ చట్టంలో లేవు.

‘హైదరాబాద్’లో ఇలా చేయాల్సింది..

ఈ ప్రాంతాలను గ్రేటర్​ హైదరాబాద్​ మునిసిపల్ కార్పొరేషన్​(జీహెచ్​ఎంసీ)లో కలపకుండా హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​మెంట్​ అథారిటీ (హెచ్​ఎండీఏ) పరిధి నుంచి మినహాయించటం వల్ల భవిష్యత్​లో సమస్యలు వస్తాయి. పాలన సౌలభ్యం కోసమే ఈ​ కార్పొరేషన్లను ఏర్పాటు చేశారనుకుంటే ఒకప్పుడు నగరం​ చుట్టూ ఉన్న 12 మునిసిపాలిటీలను జీహెచ్​ఎంసీ నుంచి విడదీసి ఉండాల్సింది. జవహర్​నగర్​లో​ ఇప్పటికే అనేక ప్రభుత్వ భూములు కబ్జా అయ్యాయి.

ఇక, చట్టంలో ఉన్న విషయాలకు వస్తే..

మాస్టర్​ ప్లాన్ అంటే ఏమిటి? దాని పరిధి ఎంత? అనే విషయాలను వివరంగా చెప్పాల్సి ఉంది. ఇందులో సర్ఫేస్​ వాటర్​ రిసోర్సెస్​, గ్రీనరీ, చెట్లు, లోకల్​ ఫారెస్ట్​లు వంటి అంశాలనూ చేర్చాలి. ‘ఇది మునిసిపల్​ లిమిట్స్​లో చేసే ప్లాన్​’ అని ఎక్కడా క్లియర్​గా లేదు.

కొత్త మునిసిపాలిటీలు మాస్టర్​ ప్లాన్​ను రూపొందించేటప్పుడు లోకల్​ ఏరియా ప్లాన్​తో లింక్​ చేయాలని చట్టం చెబుతోంది. లోకల్​ ఏరియా ప్లాన్​ అంటే ఏమిటి? దాన్ని ఎవరు తయారుచేస్తారు? అనే క్లారిటీ లేదు.

చట్టంలో ఆర్థిక సంవత్సరానికి నిర్వచనం లేదు. మునిసిపాలిటీలకు ప్రభుత్వం ఇచ్చే నిధులను ఇష్టానుసారం విడుదల చేయడం వల్ల ఆర్థిక సంవత్సర నిర్వచన అవసరం ఏర్పడింది.

గతంలో మునిసిపాలిటీలు స్కూల్స్​ నడిపేవి. ఇప్పుడు ఈ పరిధిలో ‘విద్య ఒక బాధ్యత’గా లేకపోవటం ప్రధాన లోపం.

సెక్షన్​–114 ప్రకారం వాటర్​ రిసోర్సెస్​పై మునిసిపాలిటీలకు యాజమాన్య హక్కులు కల్పించారు. కానీ.. ఆ వాటర్​ ప్రవహించే (క్యాచ్​మెంట్)​ ఏరియాపై మాత్రం రైట్స్​ ఇవ్వలేదు. దీంతో ఆ ప్రయోజనం దెబ్బతింటోంది. నీళ్లు పారే ఏరియాను బట్టి చెరువుల్లో, కుంటల్లో మంచి నీరు ఉండొచ్చు. క్యాచ్​మెంట్​ ఏరియా డ్యామేజ్​ అయినా, పొల్యూట్​ అయినా చెరువుల్లో వాటర్​ క్వాంటిటీ, క్వాలిటీపై ఎఫెక్ట్​ తప్పకుండా ఉంటుంది. అందువల్ల క్యాచ్​మెంట్​ ఏరియాపైనా మునిసిపాలిటీలకు రైట్స్​ ఇవ్వాలి.

హరితహారంలో నాటే మొక్కల్లో 85 శాతాన్ని బతికించాల్సిన బాధ్యతను వార్డు మెంబర్లపై పెట్టారు. మునిసిపాలిటీల్లోని అనేక వార్డుల్లో ఖాళీ ఏరియాలు లేకపోవటం, రోడ్లన్నీ కాంక్రీట్​గా మారటంతో ఈ బాధ్యతలను ఏ కోణంలో అర్థం చేసుకోవాలి?

దేశంలో తీవ్ర నీటి కరువు ఉంది. ఈ నేపథ్యంలో వాన నీటి సంరక్షణ, వాడిన నీటిని తిరిగి వినియోగించుకోవటాన్ని మునిసిపాలిటీల విధుల్లో చేర్చాల్సింది. బిల్డింగ్​ ఓనర్లు, మునిసిపాలిటీలు వేస్ట్​ వాటర్​ను దగ్గరలోని వాగుల్లోకి, పంట పొలాల్లోకి వదలకుండా చర్యలు చేపట్టాలి.

ప్రతిపాదిత ‘తెలంగాణ మునిసిపల్​ చట్టం–2019’లోని సెక్షన్​–292లో ‘ప్రజలకు సమాచారాన్ని నిర్దేశిత పద్ధతి ప్రకారం ఇస్తాం’ అని ఉంది. సమాచార హక్కు చట్టంలో దీనికి సంబంధించి రూల్స్​,​ రెగ్యులేషన్స్​ ఉన్నాయి. అందువల్ల ఈ సెక్షన్​ను తిరగరాసి సమాచార హక్కు చట్టంతో జోడిస్తే సరి. మునిసిపల్​ జీవోలన్నింటినీ ప్రజలకు అందుబాటులో ఉంచాలి.

ఈ చట్టంలో కనీసం 8 కమిటీల ప్రస్తావన ఉంది. ఇవన్నీ దాదాపు జిల్లా కలెక్టర్​ పరిధిలోనే పనిచేస్తాయి. ఈ కమిటీలు కూడా మునిసిపాలిటీల అధికారాలను తగ్గిస్తాయి. ఇలా జరక్కుండా ఉండాలంటే మునిసిపాలిటీల పరిధిలోకే తేవాలి.

మునిసిపాలిటీల్లో భూముల సర్వే, రికార్డులు,  నిర్వహణ గురించి ఈ చట్టంలో ఎక్కడా ప్రస్తావించలేదు.

బిల్డింగులు, వాటి నిర్మాణం,  సంబంధిత ట్యాక్స్​ల గురించి ఈ చట్టంలో ఉంది. కానీ.. పబ్లిక్​ బిల్డింగులు, గవర్నమెంట్​ బిల్డింగుల ప్రస్తావన లేదు.

అత్యున్నత ప్రమాణాలతో ఒక శిక్షణ సంస్థ (స్టేట్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ అర్బన్​ ఎక్స్​లెన్స్) ఏర్పాటు గురించి చట్టంలోని సెక్షన్​–81 చెబుతోంది. దీని అవసరమేంటో వివరణ ఇవ్వలేదు.

మునిసిపాలిటీలు రెండేళ్లకోసారి క్రెడిట్​ రేటింగ్​ తెచ్చుకోవటానికి చర్యలు చేపట్టాలని చట్టంలోని సెక్షన్​–106(5) నిర్దేశిస్తోంది.

సెక్షన్​–107(2)లో ఆర్థిక సంఘం ప్రస్తావనే ఉంది. ఈ సెక్షన్​కు అదనంగా ఆర్థిక సంఘం నిధుల విడుదలకు ప్రమాణాలనూ పొందుపరచాలి. ఆ బాధ్యతను ప్రభుత్వంపైనే ఉంచాలి.

మునిసిపాలిటీ ఫండ్స్​లో నాలుగు రకాలు చాలా ముఖ్యమైనవి. అవి..

ఎ)  కేంద్ర ఆర్థిక సంఘం నిధులు;

బి) రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు;

సి) రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్​ గ్రాంట్లు;

డి) మునిసిపాలిటీ ఇన్​కం సోర్స్​. ఈ నాలుగు నిధుల ప్రస్తావన ఈ చట్టంలో ఒక చోట లేదు. వాటి మధ్య పరస్పర ఆధార సంబంధాల గురించి కూడా ఏం చెప్పలేదు.

సాధారణంగా మునిసిపాలిటీలకు ప్రభుత్వ విభాగాలు నిధుల బాకీ ఉండటం చూస్తున్నాం. అయితే ఈ సమస్య గురించి గానీ దాని పరిష్కారం గురించి గానీ ఈ చట్టంలో ప్రస్తావించలేదు.

మునిసిపాలిటీల ఇన్​కం సోర్సులకు ఆర్థిక సంఘం కన్ఫాం చేసే ఫండ్సే ఆధారం. ప్రతి ఆర్థిక సంవత్సరం మొదలైన వెంటనే నిధులు విడుదలయ్యేలా చట్టంలో ప్రపోజల్స్​ ఉండాలి.

మునిసిపాలిటీలు జిల్లా కలెక్టర్​లను సంప్రదించి బడ్జెట్​ను రూపొందించుకోవాలని సెక్షన్​–107(3) సూచిస్తోంది. కలెక్టర్​కు ఈ బాధ్యత ఎందుకు?. ఈ సెక్షన్​ను చట్టం నుంచి తీసేయాలి. ఎక్స్​పర్ట్​లు, మేధావుల సాయంతో బడ్జెట్​ను తయారుచేసుకునే సెక్షన్​ను చేర్చాలి.

మునిసిపాలిటీ బడ్జెట్​ తయారీకి ముందు స్థానికంగా ఉండే అన్ని వర్గాలతో సంప్రదింపులు చేయాల్సిన అవసరాన్ని సెక్షన్​–107(బడ్జెట్​ ఎస్టిమేట్​)లో పెట్టాలి.

ఈ చట్టంలో హెల్త్​ గురించి పైపైనే ప్రస్తావించారు. లోతుగా పొందుపరచలేదు. తగిన సెక్షన్లు పెట్టలేదు. ప్రజారోగ్య సమగ్ర ప్రణాళిక రూపకల్పన, అమలుకు చేపట్టాల్సిన చర్యలను చట్టంలో చేర్చాలి.

ఎ)  అన్ని టౌన్లలో దుమ్ము సమస్య తీవ్రంగా ఉంది. వాయు కాలుష్యం​ పెరుగుతోంది. అందువల్ల స్వచ్ఛమైన గాలి అందేలా మునిసిపాలిటీలు తగిన చర్యలు చేపట్టాలి. ఈ బాధ్యతల గురించి చట్టంలో స్పష్టంగా రాయాలి.

ఎండ, వేడి, వడగాడ్పుల నుంచి ప్రజలకు రిలీఫ్​ కలిగించే చర్యలు చేపట్టేలా సెక్షన్​–163ని సవరించాలి.

కీలకమైన డేటా కోసం రూపొందించిన సెక్షన్​–165, 166, 167, 168, 169, 170లను బర్డ్​, డెత్​, అనాథ శవాల లెక్కలకే పరిమితం చేశారు. ఈ సెక్షన్లను సవరించి ఎలాబరేట్ చేయాలి. మునిసిపాలిటీలో స్టాటిస్టిక్స్​ డిపార్ట్​మెంట్​ని ఏర్పాటుచేయాలి. మునిసిపాలిటీ పరిధిలోని సోషల్​, ఎకనామికల్​ ఇష్యూస్​; రోడ్లు, ట్రాఫిక్​, వెహికిల్స్​, యాక్సిడెంట్లు, బిజినెస్​, ప్రొడక్షన్​ వంటి అంశాలపై నాన్​స్టాప్​గా డేటా కలెక్ట్​ చేసి రిలీజ్​ చేయాలి.

టౌన్​ ప్లానింగ్​: సెక్షన్​–172 నుంచి 174 వరకు చాలా సెక్షన్లు ఉన్నాయి. వాటిలో భూముల అభివృద్ధి, లేఔట్​ గురించి ప్రస్తావించారు. కానీ.. ఏ సెక్షన్​ కూడా ఈ భూములు మునిసిపాలిటీ పరిధిలోవా? జిల్లా పరిధిలోవా? అనే క్లారిటీ ఇవ్వలేదు. ఈ సెక్షన్లలోని కొన్ని స్టేట్​మెంట్లే కన్ఫ్యూజన్​కి కారణం. ఈ భూములు మునిసిపాలిటీ పరిధిలోకి వచ్చేవే అయితే జిల్లా స్థాయి కమిటీ ఎందుకు?. మునిసిపాలిటీల అధికారాలను ఈ కమిటీ కాలరాస్తోంది. కలెక్టర్​ చైర్మన్​గా లేఔట్​ అప్రూవల్​ కమిటీ ఏర్పాటు గురించి చట్టంలో ఉంది.​ ఈ రెండు కమిటీల మధ్య అధికారాలు, బాధ్యతలు, నిర్ణయాలకు సంబంధించి ఘర్షణ వాతావరణం తలెత్తొచ్చు.

– డాక్టర్​ నర్సింహారెడ్డి దొంతి,

పబ్లిక్​ పాలసీ అనలిస్ట్​.

 

మునిసిపాలిటీల పరిధి సహజంగా​ జియోఫిజికల్​, ఎన్విరాన్​మెంటల్​, సోషల్​, ఎకనామికల్​ ఇష్యూస్​తో  ముడిపడి ఉంటుంది. కానీ.. ఈ విషయాలతో సంబంధం లేకుండా, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా మునిసిపాలిటీ పరిధిని నిర్ణయించే అధికారాన్ని ఈ చట్టం ((సెక్షన్​–3(3)(ఏ నుంచి హెచ్​) వరకు)) రాష్ట్ర ప్రభుత్వానికి కట్టబెట్టింది. హైదరాబాద్​ చుట్టుపక్కల గ్రామ పంచాయతీలను సిటీలో విలీనం చేయటంతో తలెత్తున్న చెడు పరిణామాలను చూస్తున్నాం. మునిసిపాలిటీల ఏర్పాటు, పరిధుల నిర్ణయం వలసవాద ప్రక్రియలకు ఏమాత్రం తీసిపోవు. ఇలాంటి పద్ధతులు ప్రజాస్వామ్యంలో మంచివి కావు.

రాజ్యాంగ సవరణ–74 ద్వారా మునిపాలిటీలకు, టౌన్లకు ఫ్రీడం, సెల్ఫ్​ రిలయెన్స్​, అటానమీ వచ్చాయి. మునిసిపల్​ చట్టం–2019లో ఈ సవరణకు వ్యతిరేకంగా కొన్ని సెక్షన్లు ఉన్నాయి. వాటి ద్వారా ప్రభుత్వానికి చాలా పవర్లు వస్తాయి. అవి..

ఎ.  సెక్షన్​–45 ద్వారా ప్రభుత్వం మునిసిపాలిటీల్లో ఏ ఆఫీసర్​నైనా నియమించొచ్చు.

బి.            సెక్షన్​–65 నుంచి 70 వరకు ఉన్న రూల్స్, రెగ్యులేషన్స్​ ప్రకారం గవర్నమెంట్​ గానీ జిల్లా కలెక్టర్​ గానీ మునిసిపాలిటీల్లోని ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులను (చైర్మన్​ సహా) డిస్మిస్​ చేయొచ్చు. ప్రభుత్వం గానీ జిల్లా కలెక్టర్​ గానీ తనకుతానుగా లేదా ఎవరైనా ఇచ్చిన విజ్ఞప్తి మేరకు తగిన విచారణ జరిపి ఈ నిర్ణయం తీసుకోవచ్చని సెక్షన్​–66(1) చెబుతోంది. సెక్షన్​–65 సాయంతో మునిసిపాలిటీల తీర్మానాలను రద్దు లేదా సస్పెండ్​ చేయొచ్చు. స్థానిక సంస్థల అధికారాలకు, అస్తిత్వానికి, ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా ఈ సెక్షన్లు తెలంగాణ మునిసిపల్​ చట్టం–2019లో ఉండటం ఖండించాల్సిన విషయం. ఈ సెక్షన్లు రాజకీయ కారణాల వల్ల దుర్వినియోగం అయ్యే ఛాన్స్​లు ఉన్నాయి. ఈ అధికారాలపై నియంత్రణ అవసరం.