- ఈనెల 26తో ముగియనున్న పాలకవర్గం గడువు
- కౌన్సిలర్లకు ఇదే చివరి జెండా వందనం
- ఇప్పటికే స్థానిక సంస్థల్లో కొనసాగుతున్న ఆఫీసర్ల పాలన
- రిజర్వేషన్ల అంశంపై జోరుగా చర్చ
- ఎన్నికల కోసం ఆశావహుల ఎదురుచూపు
ఆదిలాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో ఆరు రోజుల్లో అన్ని బల్దియాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన ప్రారంభం కానుంది. జనవరి 26న రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పాలకవర్గాల పదవీ కాలం ముగియనుంది. దీంతో ఎన్నికలు జరిగేంత వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వీరి పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. గ్రామ పంచాయతీ, జడ్పీ, మండల పరిషత్‌లలో ఇప్పటికే ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ఇటీవల ఓటరు తుది జాబితా సైతం విడుదల చేయగా రిజర్వేషన్లపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వం ఇటీవల బీసీల రిజర్వేషన్లు పెంచేందుకు నిర్ణయించిన నేపథ్యంలో కులగణన సర్వే చేపట్టింది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ప్రకటన చేసిన వెంటనే ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. దీంతో ఫిబ్రవరి, మార్చి నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలతో పాటు వరుసగా జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అటు మరో వారంలో పదవులు కోల్పోనున్న చైర్మన్లు, కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
అధికారుల చేతుల్లోకి పాలన
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే గ్రామ పంచాయతీ, జడ్పీ, మండల పరిషత్‌లలో ప్రత్యేక పాలన కొనసాగుతోంది. వారం రోజుల్లో మున్సిపాలిటీలు కూడా అధికారుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. 2020 జనవరిలో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరిగ్గా.. ఈ ఏడాది జనవరి 26తో వారి పదవీ కాలం ముగియనుంది. గణతంత్ర దినోత్సవం రోజు చివరిసారిగా వారు జాతీయ జెండా ఎగురవేయనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 141 మున్సిపాలి టీలు, 13 కార్పొరేషన్లు ఉన్నాయి. ఇటీవల కొత్తగా మంచిర్యాల, మహబూబ్ నగర్ మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మరో 12 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, కాగజ్ నగర్, నిర్మల్, భైంసా, ఖానాపూర్, మందమర్రి, బెల్లంపల్లి, చెన్నూర్, నస్పూర్, క్యాతనపల్లి, లక్సెట్టిపేట మున్సిపాలిటీలు ఉండగా.. మందమర్రి మినహా మిగతా పదింటికి ఎన్నికలు
జరగనున్నాయి.
ALSO READ : నాలుగు స్కీములకు ఇయ్యాల్టి నుంచి అప్లికేషన్లు
మారనున్న బల్దియా రాజకీయ ముఖచిత్రం
పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బల్దియాల్లో రాజకీయ ముఖ చిత్రం మారనుంది. గత ఎన్నికల్లో భైంసా మినహా మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చోట్ల మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ చైర్మన్ పదవులను కోల్పోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సైతం ఖానాపూర్, బెల్లంపల్లి, నస్పూర్, మంచిర్యాల, క్యాతనపల్లి మున్సిపల్ పాలకవర్గాలపై అవిశ్వాసం పెట్టడంతో బీఆర్ఎస్ చైర్మన్ పదవులు కోల్పోయి కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్లింది.
నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కాగజ్‌నగర్ చైర్మన్ షాహిన్సుల్తానా సైతం కాంగ్రెస్‌లో చేరడంతో బీఆర్ఎస్ నేతలు ఆదిలాబాద్, లక్సెట్టిపేట, చెన్నూర్ మున్సిపాలిటీల్లో మాత్రం చైర్మన్ పదవుల్లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. కాంగ్రెస్ పూర్తిస్థాయిలో ఎన్నికలకు సిద్ధమవుతూ అన్ని చైర్మన్ స్థానాలపై కన్నేసింది.