ఘనంగా మొదలైన నాగోబా జాతర.. అర్ధరాత్రి నాగోబాకు జలాభిషేకం

  • అర్ధరాత్రి నాగోబాకు జలాభిషేకం
  • ఘనంగా మొదలైన కేస్లాపూర్​ జాతర
  • మెస్రం వంశీయుల సంప్రదాయపూజలు
  • తరలివస్తున్న భక్తులు

గుడిహత్నూర్, వెలుగు :  ఆదిలాబాద్ ​జిల్లా కేస్లాపూర్​లో ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా జాతర ఘనంగా ప్రారంభమైంది. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని మెస్రం వంశీయులు హస్తినమడుగు నుంచి తెచ్చిన గోదావరి జలాలతో నాగోబాకు అభిషేకం నిర్వహించి మహాపూజలకు శ్రీకారం చుట్టారు. ఆలయ ఆవరణలో విడిది చేసిన మెస్రం వంశీయులు శుక్రవారం తాము తెచ్చిన పవిత్ర జలానికి పూజలు చేశారు. మురాడి ఆలయం నుంచి విగ్రహాలను తీసుకుని ప్రధాన ఆలయానికి చేరుకున్నారు. మర్రిచెట్టు వద్ద పూజలు చేశారు. సిరికొండ గుగ్గిల్ల వంశం వారు ప్రత్యేకంగా తయారుచేసి తీసుకువచ్చిన కొత్త కుండలకు పూజలు చేశారు. మెస్రం వంశ 22 కితలకు చెందిన ఆడపడుచులు కుండలను తీసుకుని కోనేరు నుంచి నీటిని తీసుకురాగా..గతేడాది నిర్మించిన మట్టి పుట్టలను మెస్రం వంశ అల్లుళ్లు తొలగించారు. మెస్రం వంశ ఆడపడుచులు తెచ్చిన జలాలు, మట్టి మిశ్రమంతో కొత్త పుట్టలను తయారు చేశారు. సంప్రదాయ వాయిద్యాలతో పుట్టలకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మట్టి ఉండలను తయారుచేసి సతీ దేవతల ముందు ఏడు వరుసలతో భౌల తయారు చేసి పూజలు చేశారు. ఆలయ సమీపంలోని గోవాడలో 22 కితల వారీగా బస చేశారు.

అర్దరాత్రి మహాపూజలతో ..

పవిత్ర గోదావరి జలాలతో నాగోబాకు అభిషేకం చేసి మహాపూజలు ప్రారంభించిన తర్వాత మెస్రం వంశ కొత్త కోడళ్లతో ఏడుగురు సతీ దేవతల పూజలు చేయించి మెస్రం వంశ పెద్దలతో భేటింగ్‌(నూతన వధువుల పరిచయం) నిర్వహించారు. అనంతరం కొత్త కోడళ్లను నాగోబా దర్శనం చేయించి మెస్రం వంశీయులుగా గుర్తించారు. అర్ధరాత్రి మాహాపూజలకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.