తెలంగాణకు సాంస్కృతిక విధానం అవసరం

తెలంగాణకు సాంస్కృతిక విధానం అవసరం
  • ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం

ముషీరాబాద్, వెలుగు: ఇప్పటివరకు తెలంగాణకంటూ ప్రత్యేకంగా సాంస్కృతిక విధానం లేదని, తీసుకురావాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. గతంలో కొంతమంది పెద్దలు కలిసి ఆర్ట్ అసోసియేషన్, జననాట్య మండలి, అరుణోదయ ఏర్పాటు చేసి ఒక రూపం ఇచ్చి ముందుకు నడిపించే ప్రయత్నం చేశారన్నారు. కొత్తగా సాంస్కృతిక విధానాన్ని రూపొందించాలని కోరారు. మంగళవారం సాయంత్రం ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో డాక్టర్ సబ్బని లక్ష్మీనారాయణ రచించిన ‘సబ్బని సమగ్ర తెలంగాణ సాహిత్యం’ అనే పుస్తకాన్ని సంగిశెట్టి శ్రీనివాస్, కవి యాకూబ్, ప్రొఫెసర్ కోదండరాం కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. 

తెలంగాణ సాధనలో రచయితల పాత్ర చాలా ఉందని, ఉద్యమాన్ని మరింతగా రికార్డుల్లోకి ఎక్కించాలని పిలుపునిచ్చారు. దేవులపల్లి వెంకటేశ్వరరావు రాసిన ‘ది హిస్టరీ ఆఫ్ తెలంగాణ పీపుల్స్ ఆర్మ్డ్ ఫోర్స్’ పుస్తకావిష్కరణ జరిగింది. ప్రముఖ రచయిత నిఖిలేశ్వర్, కవి యాకూబ్ హాజరై ఆవిష్కరించారు. ‘అనేక వైపుల’ అనే పుస్తకాన్ని రచయిత్రి బి.అనురాధ, సీనియర్ జర్నలిస్ట్​వేణుగోపాల్, రచయిత ఏకే ప్రభాకర్ ఆవిష్కరించారు. అలాగే బుక్​ఫెయిర్​లో తెలంగాణ బాలోత్సవం కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఉర్దూ కవి సమ్మేళనం ఎంతో అలరించింది. పలువురులు ఉర్దూ కవులు కవయిత్రులు మహమ్మద్ ముస్తఫా, హుమేరా సయ్యద్, డాక్టర్ అతియా ముజీబ్, వహీద్ పాషా, రుబీనా, సాల్మన్, లతీఫ్ పాల్గొని కవితలను చదివి వినిపించారు.