వచ్చే ఏడాది నుంచి ఇంజినీరింగ్‌కు కొత్త ఫీజులు

వచ్చే ఏడాది నుంచి ఇంజినీరింగ్‌కు కొత్త ఫీజులు
  • ప్రైవేట్​ ప్రొఫెషనల్ కాలేజీల్లో ఫీజుల ఖరారుపై కసరత్తు 
  • 1,229 కాలేజీల నుంచి టీఏఎఫ్ఆర్సీకి అప్లికేషన్లు 
  • మార్చి నుంచి హియరింగ్ షురూ 
  • వచ్చే మూడేండ్ల వరకు  పెంచిన ఫీజుల వర్తింపు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్​ ప్రొఫెషనల్ కాలేజీల్లో కొత్త  ఫీజులు అమల్లోకి రానున్నాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ.. ఇలా అన్ని కోర్సుల్లో ఫీజులు పెరిగే చాన్స్ఉన్నది. దీనికి సంబంధించిన ప్రక్రియను తెలంగాణ అడ్మిషన్స్ అండ్  ఫీజు రెగ్యులరేటరీ కమిటీ  (టీఏఎఫ్ఆర్సీ) మొదలుపెట్టింది. ఇప్పటికే  కొత్త ఫీజుల ప్రతిపాదనలపై నోటిఫికేషన్ ఇచ్చింది. డిగ్రీ, పీజీ స్థాయిలోని 24 రకాల కోర్సులకు 2025–26 విద్యా సంవత్సరానికి  టీఏఎఫ్ఆర్సీ ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది. రాబోయే మూడేండ్ల పాటు అవే ఫీజులు కంటిన్యూ కానున్నాయి. దీనికి సంబంధించి టీఏఎఫ్ఆర్సీ నోటిఫికేషన్ ఇవ్వగా, వివిధ కోర్సులు కొనసాగిస్తున్న 1,229 కాలేజీలు అప్లై చేసుకున్నాయి. 

అప్పట్లో 1,291 కాలేజీలు దరఖాస్తు చేసుకోగా,  ప్రస్తుతం ఆ సంఖ్య 1,229కు తగ్గింది.  ప్రధానంగా బీటెక్, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఎంబీఏ, బీఈడీ.. తదితర కోర్సులు అందించే కాలేజీలు తగ్గాయి. అయితే, గత మూడేండ్లలో కాలేజీ మేనేజ్​మెంట్ల ఆదాయం, ఖర్చుల వివరాలతోపాటు ఆయా కాలేజీలు ఎంత ఫీజులను పెంచాలనే ప్రతిపాదనలను టీఏఎఫ్ఆర్సీకి ఆన్ లైన్ ద్వారా పంపించారు. హార్డ్ కాపీలనూ ఆఫీసులో అందించారు.  ప్రస్తుతం ఆయా కాలేజీలు ఇచ్చిన లెక్కలను చార్టెడ్ అకౌంటెంట్లతో టీఏఎఫ్ఆర్సీ అధికారులు ఆడిటింగ్ చేయిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మార్చి లో ఒక్కో కాలేజీని పిలిచి, హియరింగ్ ప్రక్రియ కొనసాగిస్తారు. ఆ తర్వాత టీఏఎఫ్ఆర్సీ కమిటీ.. ఒక ఫీజును నిర్ణయించి, దాన్ని సర్కారు ఆమోదానికి పంపిస్తుంది. 

సర్కారు నిర్ణయం మేరకు  కొత్త ఫీజులు ఖరారు కానున్నాయి. అయితే,  2022లో సర్కారు నిర్ణయించిన ఫీజులను వ్యతిరేకించిన కొన్ని కాలేజీలు.. హైకోర్టులో కేసు వేశాయి. దీంతో ఆ కాలేజీల్లో సీట్ల పెంపునకు కోర్టు అనుమతి ఇచ్చింది.  ఈ సారి ఇంజినీరింగ్ కాలేజీల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ పై సర్కారు దృష్టి పెట్టిన నేపథ్యంలో, ఫీజుల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొన్నది.  

ఈ కోర్సుల్లోనే పెంపు..

రాష్ట్రంలో 24  కోర్సుల్లో  వచ్చే ఏడాది నుంచి కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి. 2022లో నిర్ణయించిన ఫీజులే ప్రస్తుతం కంటిన్యూ అవుతున్నాయి. బీఈ/ బీటెక్, బీ ఫార్మసీ, ఫార్మా–డీ, బీ ఆర్క్, బీ ప్లానింగ్, ఎంటెక్ / ఎంఈ, ఎం ఆర్క్, ఎం ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఎఫ్ఏ మూడేండ్లు / ఐదేండ్లు, ఎల్ఎల్ బీ,ఎల్ఎల్ఎం, బీఎల్, బీఈడీ, ఎంఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ తదితర కోర్సుల్లో ఫీజులు ఖరారు కానున్నాయి.  అయితే, ఇంజినీరింగ్ తో పాటు పలు కోర్సుల్లో మినిమమ్ ఫీజు పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు ఇంజినీరింగ్ లో కామన్ మినిమమ్ ఫీజు ఏటా రూ.35 వేలే ఉండగా, దాన్ని రూ.50 వేలకు పెంచాలని గతం నుంచి ప్రైవేట్​ మేనేజ్​మెంట్లు కోరుతున్నాయి.