రేషన్​ కార్డుల జారీ ఎప్పుడు .. మార్చి 1 దాటినా రాని స్పష్టత

రేషన్​ కార్డుల జారీ ఎప్పుడు ..  మార్చి 1 దాటినా రాని స్పష్టత
  • ఏడున్నర లక్షలు దాటిన దరఖాస్తులు  
  • మీ సేవ సెంటర్లకు జనాల క్యూ 
  • ప్రజాప్రతినిధులది ఒకమాట,  అధికారులది మరో మాట 

హైదరాబాద్​సిటీ, వెలుగు : గ్రేటర్​పరిధిలో రేషన్​ కార్డుల జారీ ప్రక్రియ గందరగోళంగా మారింది. కార్డుల జారీపై ప్రజాప్రతినిధులదో మాట, అధికారులదో మాటగా ఉంటోంది. ఇటీవల హైదరాబాద్​ జిల్లా ఇన్​చార్జ్​ మంత్రి పొన్నం ప్రభాకర్​ మార్చి ఒకటి నుంచి రేషన్ ​కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించారు. దీంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేశారు. కానీ, మూడో తారీఖు వచ్చినా ఆ ఊసే కనిపించడం లేదు. దీనిపై పౌరసరఫరాల శాఖ అధికారులను సంప్రదిస్తే ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. అంతకు ముందు ఇదే అధికారులు మార్చి మొదటి వారంలో కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. ఒక్కోసారి ఒక్కోమాట చెప్తుండడంతో జనాలు అసలు రేషన్​ కార్డులు ఇస్తారా..ఇవ్వరా అన్న అయోమయంలో ఉన్నారు.  

తికమక ప్రకటనలు 

హైదరాబాద్​ కోర్​ సిటీ పరిధిలోని 9 సర్కిళ్లలోని ప్రజలు కొత్త రేషన్​ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. మార్పులు, చేర్పులు చేసుకునేందుక, కొత్త పేర్లను నమోదు చేసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు సర్కిల్​ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఒకసారి దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవద్దని ఒకసారి, తర్వాత అందరూ మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని ప్రకటనలు చేస్తుండడంతో తికమకపడుతున్నారు. ఎందుకైనా మంచిదని చాలా మంది ఎన్నిసార్లయితే అన్ని సార్లు దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో నగరంలోని మీ సేవ సెంటర్ల వద్ద రోజూ వేల సంఖ్యలో దరఖాస్తుదారులు బారులు తీరుతున్నారు.  

10 రోజుల్లో భారీగా దరఖాస్తులు

గ్రేటర్ ​పరిధిలో కొత్త రేషన్​ కార్డుల కోసం ఇప్పటివరకు లక్షల్లో దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా చేసుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం 9 సర్కిళ్ల పరిధిలో  6,39,451 రేషన్​ కార్డులున్నాయి. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో 5.40 లక్షల మంది, నాలుగు నెలల కింద కులగణన సర్వేలో 83 వేల మంది అప్లై చేసుకున్నారు. ఇటీవల మీసేవ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రకటించడంతో జనాలంతా మళ్లీ క్యూలు కట్టారు. దీంతో రెండు వారాల్లోనే 1,31,484 మంది రేషన్​కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

అర్హుల జాబితా రాలే : సివిల్​ సప్లయీస్​

రేషన్​ కార్డుల జారీ ఎందుకింత ఆలస్యం అవుతోందని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారి ఒకరిని అడగ్గా..‘ నాలుగు నెలల కింద బల్దియా నిర్వహించిన కులగణన సర్వేలో దరఖాస్తుల్లో అర్హుల జాబితా వివరాలు ఇప్పటికీ మాకు అందలేదు. తాజాగా మీసేవ కేంద్రాల నుంచి స్వీకరిస్తున్న దరఖాస్తుల వివరాలు కూడా పూర్తిగా అందలేదు. ఈ దరఖాస్తులు మాకు చేరితే ఇంటింటి సర్వే నిర్వహించి అర్హులను గుర్తిస్తాం’ అని సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకూ కార్డుల జారీపై తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని అంటున్నారు.