స్వైప్ చెయ్.. సరుకులు తీసుకో.. ఏటీఎం కార్డులా తెలంగాణ కొత్త రేషన్ కార్డు..!?

హైదరాబాద్: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రేవంత్ సర్కార్ విప్లవాత్మక మార్పుకు నాంది పలకనున్నట్లు తెలిసింది. కొత్త రేషన్ కార్డుల జారీలో పాత పద్ధతికి స్వస్తి పలకాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇకపై పాత కార్డుల మాదిరిగా కాకుండా స్వైప్ కార్డుల తరహాలో ఉండనున్నట్లు వార్తలొస్తున్నాయి. స్వైప్ కార్డుల తరహాలో ఈ కొత్త రేషన్ కార్డులను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. కార్డ్ స్వైప్ చేసి షాపింగ్ చేసినంత సింపుల్గా, ఏటీఎంలో కార్డు పెట్టి డబ్బులు తీసుకున్నంత సులభంగా ఇకపై తెలంగాణలో రేషన్ సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.

ఒక ఐడీ కార్డు పరిమాణంలో ఉండే స్వైపింగ్ కార్డులను రూపొందించి అందులో ఒక చిప్ను అమర్చాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ కొత్త రేషన్ కార్డును స్వైప్ చేయగానే చిప్ యాక్టివేట్ అయ్యేలా కార్డును డిజైన్ చేయనున్నారు. చిప్ యాక్టివేట్ అయిన క్షణాల్లోనే రేషన్ కార్డు లబ్దిదారుడి వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు.. పూర్తి సమాచారం మానిటర్లో డిస్ప్లే అవుతుంది. ఈ విధానం అమల్లోకి వస్తే రేషన్లో మోసాలను అరికట్టడంతో పాటు డూప్లికేషన్ అవకాశాలు తక్కువగా ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఏటీఎం కార్డుల తరహాలో ఉండే ఈ తరహా డిజిటల్ రేషన్ కార్డ్స్ విధానం హర్యానాలో విజయవంతంగా అమలైంది. యూపీలో బార్ కోడ్ తరహాలో రేషన్ కార్డుల విధానం అమల్లో ఉంది. ఒడిశాలో ఏటీఎం తరహాలో ఉండే రేషన్ కార్డులను ప్రవేశపెట్టడానికి అక్కడి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గ్రెయిన్ ఏటీఎంల పేరుతో ఒడిశాలో ఈ తరహా కొత్త రేషన్ కార్డులను లబ్దిదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. తెలంగాణలో చాలా కాలంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో లక్షలాది మంది వీటి కోసం నిరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. రేషన్ కార్డు, హెల్త్ కార్డులకు అర్హతలు, విధివిధానాలపై ప్రభుత్వం ఇటీవల చర్చించింది. వార్షికాదాయ పరిమితి పైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఈ రెండు కార్డుల జారీ కోసం ఇటీవలే ఉత్తమ్ కుమార్ చైర్మన్గా ముగ్గురు సభ్యుల సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీ తొలి సమావేశం ఈ మధ్యే జరిగింది.

కొత్త కార్డుల జారీకి దరఖాస్తులు ఎప్పటి నుంచి స్వీకరించేంది.. జారీ ప్రక్రియపై త్వరలో విధివిధానాలను జారీ చేయనున్నారని తెలుస్తోంది. అంతేకాదు.. స్వైప్ కార్డుల తరహాలో రేషన్ కార్డు రూపకల్పనకు, చిప్తో అనుసంధానించే ప్రక్రియకు సంబంధించి సాఫ్ట్వేర్ నిపుణులతో సబ్ కమిటీ చర్చించింది. ఈ తరహా కార్డుల రూపకల్పనకు, జారీకి సంబంధించి సాధ్యాసాధ్యాలపై చర్చ జరిగింది. కొత్త రేషన్ కార్డులను స్వైప్ కార్డుల తరహాలో తీసుకురావొచ్చని సాఫ్ట్వేర్ నిపుణుల బృందం ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దీంతో.. ఇక ఈ ఆలోచనను వీలైనంత త్వరగా ముందుకు తీసుకెళ్లి లబ్దిదారులకు రేషన్ స్వైప్ కార్డులను అందించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.