వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) వరంగల్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ)లో చివరి సంవత్సరం చదువుతున్న బీటెక్ విద్యార్థి రవి షా రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీ దక్కినట్లు నిట్ అధికారులు వెల్లడించారు. రవి షాతో పాటు మరో 12 మంది విద్యార్థులు రూ.68 లక్షల విలువైన వార్షిక ప్యాకేజీలు లభించగా, ఎన్‌ఐటీ వరంగల్‌లోని బీటెక్ విద్యార్థుల్లో 82 శాతం మంది ఉద్యోగాలు సాధించారని తెలిపారు.
ఈ సంవత్సరం సగటు ప్యాకేజీ 15.6 లక్షలుగా ఉందని వివరించారు. ఈ ఏడాది రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ప్రైవేట్ రంగానికి చెందిన 250కి పైగా కంపెనీలు, 10 ప్రభుత్వరంగ సంస్థలు పాల్గొన్నాయని, అర్హత సాధించిన 1,483 మంది విద్యార్థుల్లో 1,128 మంది విద్యార్థులు ఉద్యోగ ఆఫర్లను పొందారని చెప్పారు.
రవిషా పంజాబ్‌లోని లూథియానాకు చెందినవాడు. బిటెక్ చదువుతున్న టైమ్ లోనే షా రెండు ఇంటర్న్‌షిప్‌ల ద్వారా ఎక్స్ పీరియన్స్ పొందాడు. రవిషా తండ్రి వ్యాపారవేత్త, తల్లి గృహిణి. ప్రస్తుతం ఐటీ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ తనకు ఉద్యోగం వస్తుందనే నమ్మకం ఉందని.. అయితే ఇంత ఎక్కువ ప్యాకేజీ వస్తుందని తాను ఊహించలేదని చెప్పారు. తన సీనియర్లు అధ్యాపకుల సహాయంతో కోడింగ్, డేటా స్ట్రక్చర్ నేర్చుకున్నానని చెప్పిన రవిషా.. అవే తనకు ఉపయోగపడ్డాయని తెలిపాడు.