ఖమ్మంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ రెండు వర్గాలుగా చీలిపోయింది. TNGO ఉద్యోగులు ఒకరినొకరు కుర్చీలతో కొట్టుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పువ్వాడ అజయ్ కు అనుకూలంగా వ్యవహరించిన అప్జల్ హసన్ ఒక వర్గం, మాజీ TNGO అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస రావు మరొక వర్గంగా విడిపోయారు. బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు అనుకూలంగా అబ్జల్ హసన్ వర్గం వ్యవహరించిందని.. అయితే అధికారంలో ఉన్నప్పుడు అప్జల్ హసన్ ఒక వర్గం తమను అన్యాయానికి గురి చేసి.. అక్రమాలకు పాల్పడ్డారని మాజీ TNGO అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస రావు వర్గం ఆరోపించింది. అయితే నిన్న(డిసెంబర్ 3) పువ్వాడ అజయ్ కుమార్ ఓడిపోయి అధికారం మారడంతో ఈ గ్రూపులు ఏర్పడ్డాయి.
అధికారంలో ఉన్నప్పుడు TNGO కార్యాలయాన్ని బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చాడని అబ్జల్ హసన్ పై ఆరోపణలు వచ్చాయి. TNGO కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవాలని మాజీ TNGO అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస రావు వర్గం అక్కడికి చేరుకుంది. అయితే శ్రీనివాస రావు వర్గం అక్కడికి రాకముందే ప్రస్తుత TNGO అధ్యక్షుడు అబ్జల్ హసన్ వర్గీయులు కార్యాలయానికి తాళం వేసుకున్నారు.
దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇరువర్గాల వారు ఒకరినొకరు కుర్చీలతో కొట్టుకున్నారు. ఆ తర్వాత అప్జల్ కు వ్యతిరేకంగా తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగులు నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.