హైదరాబాద్, వెలుగు: వంటనూనెల డిమాండ్, సరఫరా తదితర అంశాలపై చర్చించడానికి ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐవీపీఏ) ' గ్లోబల్ రౌండ్‌టేబుల్ 2022 ఆన్ వెజ్ ఆయిల్, ఆయిల్‌సీడ్ సెక్టార్' పేరుతో సమావేశం నిర్వహించింది. రౌండ్ టేబుల్ ఆన్ సస్టెయినబుల్ పామ్ ఆయిల్ (ఆర్ఎస్పీఓ), సెంటర్ ఫర్ రెస్పాన్సిబుల్ బిజినెస్, మలేషియన్ పామ్ ఆయిల్ కౌన్సిల్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఈవెంట్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖల ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, తెలంగాణ ఐవీపీఏ ప్రెసిడెంట్ సుధాకర్ దేశాయ్, వంటనూనెల పరిశ్రమల ప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కంపెనీలకు 15 రోజుల్లోనే పర్మిషన్లు ఇస్తున్నామని, తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి 35 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ఈ సమావేశంలో వంటనూనెల నిపుణులు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు, కంపెనీలు ఒక వేదికను పంచుకున్నాయి. పలు అంశాలపై నిపుణులు ప్రసంగించారు. వివిధ సమస్యలపై ప్యానెల్ చర్చలు జరిగాయి. సరఫరా & డిమాండ్ , వెజ్ ఆయిల్ ఉత్పత్తిని పెంచడంపై పలువురు తమ అభిప్రాయాలను తెలిపారు. ఈవెంట్‌లో కంపెనీలు తమ ప్రాజెక్ట్‌లను ప్రదర్శించాయి. ఈ సందర్భంగా ఐవీపీఏ ప్రెసిడెంట్ సుధాకర్ దేశాయ్ మాట్లాడుతూ, “మహమ్మారి, యుద్ధం కారణంగా ఆహార కొరత ఏర్పడింది. డిమాండ్, సరఫరా మధ్య తేడా పెరిగింది. ఉత్పత్తి, నిర్వహణ వంటి సవాళ్లకు కారణమైంది. వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి రోడ్ మ్యాప్ తయారు చేయడమే టార్గెట్‌గా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం”అని వివరించారు.