తెలంగాణలో మేం గెలిస్తే కేసీఆర్​ జైలుకే: అమిత్​ షా

  • కేసీఆర్​ మిషన్​ అంటే.. అది కమీషన్​
  • కమీషన్ల ముఠాను బయటకు గుంజుతం
  • సామాజిక న్యాయం కోసం బీసీని సీఎం చేస్తం.. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నం
  • మతపరమైన ముస్లింల రిజర్వేషన్లు ఎత్తేసి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పెంచుతం
  • బైరాన్​పల్లి అమరవీరుల స్మృతిచిహ్నం నిర్మిస్తమని హామీ

జనగామ, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్​ జైలుకు పోవడం ఖాయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అవినీతిలో తెలంగాణ సర్కారు దేశంలోనే నంబర్​ వన్​ స్థానంలో ఉంది. అక్రమాలకు పాల్పడుతున్న సీఎం కేసీఆర్​ ను బీజేపీ అధికారంలోకి రాగానే జైలులో పెడ్తం. కేసీఆర్​ మిషన్​ అంటేనే కమీషన్​ అని అర్థం. కాళేశ్వరం, మిషన్​ కాకతీయ, మిషన్​ భగీరథ, ఓఆర్​ఆర్​, మియాపూర్​ భూముల్లో అక్రమాలు జరిగినయ్​.

కమీషన్ల ముఠాను బయటకు గుంజి జైలుకు పంపుతం” అని ఆయన స్పష్టం చేశారు. జనగామలోని ప్రెస్టన్​ గ్రౌండ్​లో సోమవారం మధ్యాహ్నం నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో అమిత్​ షా మాట్లాడారు. బీఆర్​ఎస్​ను భ్రష్టాచార్​ పార్టీ అని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తే సామాజిక న్యాయం కోసం బీసీని సీఎం చేస్తామని, గతంలో ఏ ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. 

ఇవి సాధారణమైన ఎన్నికలు కావు..

‘‘కొమురెల్లి మల్లన్న, సిద్దులగుట్ట సిద్దేశ్వరుడ్ని కొలుచుకుంటూ చెబుతున్న. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు సాధారణమైనవి కావు. దేశ భవిష్యత్తును నిర్ణయించేవి. రాష్ట్రంలో  2జీ, 3జీ, 4జీ పార్టీలున్నయ్​. 2జీ అంటే కేసీఆర్, కేటీఆర్.. 3 జీ అంటే ఎంఐఎం.. 4జీ అంటే​ నెహ్రూ, ఇందిరాగాంధీ,  రాజీవ్​ గాంధీ, రాహుల్​ గాంధీ. ఈ కుటుంబ పార్టీలను ఓడించి ప్రజల పార్టీ బీజేపీని గెలిపించాలి’’  అని అమిత్​ షా అన్నారు. అధికారంలోకి రాగానే మతపరమైన ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను ఎత్తేస్తామని.. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను పెంచుతామని చెప్పారు.

‘‘సీఎం కేసీఆర్​కు ఒవైసీ అంటే భయం. అందుకే తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించడం లేదు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే సెప్టెంబర్​ 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతం” అని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కేసీఆర్​ అమలు చేయలేదని,  జనగామలో పాలిటెక్నిక్​ కాలేజీ ఏర్పాటు చేయలేదని, ఇక్కడి బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే, ఇప్పుడున్న బీఆర్​ఎస్​ అభ్యర్థి ఇద్దరూ భూ కబ్జాదారులే అని అమిత్​ షా ఆరోపించారు. జనగామ నియోజకవర్గంలోని బైరాన్​పల్లి అమరులకు గుర్తుగా అమరవీరుల స్మృతిచిహ్నం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 

అయోధ్య రాముడి దర్శనం ఉచితం

నరేంద్రమోదీ పాలన ప్రపంచానికి ఆదర్శమని అమిత్​ షా అన్నారు. ‘‘విశ్వగురుగా భారత్​ ఖ్యాతిని మోదీ పెంచారు. చంద్రయాన్​ సక్సెస్, అయోధ్యలో రామమందిరం నిర్మాణం, జీ 20 సదస్సు నిర్వాహణ, కొత్త పార్లమెంట్​ బిల్డింగ్​ నిర్మాణం ఘనత మోదీకే దక్కాయి” అని తెలిపారు. జనవరిలో అయోధ్య రామ మందిరం పున:ప్రతిష్టాపన ఉంటుందని, అధికారంలోకి వస్తే  శ్రీరాముడి దర్శనం ఉచితంగా కల్పించే బాధ్యత తమదేనని చెప్పారు.

తెలంగాణపైన ప్రత్యేక శ్రద్ధతో ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, రైతులకు ఫసల్​ బీమా సొమ్మును కేంద్రమే భరిస్తున్నదని చెప్పారు.  పసుపు బోర్డు ఏర్పాటుతోపాటు, పేదలకు ఏడాదికి 4 గ్యాస్​ సిలిండర్లు ఉచితంగా అందిస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2024లో జరిగే ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి పట్టంకట్టాలని కోరారు. మోదీని మూడో సారి ప్రధాన మంత్రిని చేయాలని అన్నారు. ఈ సభలో బీజేపీ జనగామ, పాలకుర్తి, స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే అభ్యర్థులు ఆరుట్ల దశమంత్​ రెడ్డి, లేగ రామ్మోహన్​ రెడ్డి, గుండె విజయరామారావు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్  పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్​కు ఒవైసీ అంటే భయం. అందుకే తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించడం లేదు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే సెప్టెంబర్​ 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతం.

అమిత్​ షా

మేం రాగానే నిజాం షుగర్స్ రీ ఓపెన్ చేస్తం

మెట్​పల్లి, వెలుగు: బీజేపీ అధికారంలోకి రాగానే నిజాం షుగర్స్​ను పునరుద్ధరిస్తామని, పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు పసుపులోని ఆయుర్వేద గుణాలపై పరిశోధన కోసం   టర్మరిక్​ మెడికల్​వ్యాల్యూస్ రీసెర్చ్​ సెంటర్​ ఏర్పాటు చేయనున్నట్లు  కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. సోమవారం జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో నిర్వహించిన సకలజనుల  విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘కోరుట్ల బీజేపీ అభ్యర్థి, నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్ కేంద్రంతో కోట్లాడి పసుపు బోర్డు సాధించారు.

దాంతోపాటు రూ.200 కోట్లతో టర్మరిక్​ మెడికల్ వ్యాల్యూస్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే 3 నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరుస్తాం”అని హామీ ఇచ్చారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో లక్షల సంఖ్యలో బీడీ కార్మికులున్నారని, వారి ఆరోగ్యం కోసం నిజామాబాద్​లో  500 బెడ్లతో  పెద్దాస్పత్రి నిర్మిస్తామన్నారు.  కేసీఆర్ మాటల మాంత్రికుడని, దళితుడిని సీఎం చేస్తానని మాట తప్పారని అమిత్​షా విమర్శించారు. ఎంపీ అర్వింద్, ఆర్మూర్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి, బాల్కొండ అభ్యర్థిని అన్నపూర్ణ, జగిత్యాల అభ్యర్థిని భోగ శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్ ఖజానా నిండింది

ఉప్పల్, వెలుగు: బీఆర్​ఎస్​ ప్రభుత్వం కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని కేంద్ర హోం మంత్రి అమిత్​షా ఆరోపించారు. ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి సొంత ఖజానా నింపుకున్న సీఎం కేసీఆర్​ను జైలుకు పంపుతామన్నారు. సోమవారం ఉప్పల్​లో బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్ఎస్​ప్రభాకర్​కు మద్దతుగా నిర్వహించిన రోడ్​షోలో అమిత్​షా మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఉచితంగా 4 గ్యాస్​ సిలిండర్లు, పేదలకు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఏడాదికి రూ.10 లక్షల వరకు ఉచిత ఆరోగ్య కవరేజీ, రైతులకు రూ.2500ల ఇన్​పుట్​ అసిస్టెన్స్​ అందిస్తామని హామీ ఇచ్చారు.