హద్దు దాటి డీపీఆర్‌‌లు స్క్రూటినీ చేస్తున్నరు

హద్దు దాటి డీపీఆర్‌‌లు స్క్రూటినీ చేస్తున్నరు
  • గోదావరి బోర్డు తీరుపై తెలంగాణ అభ్యంతరం
  • వెంటనే వాటిని సీడబ్ల్యూసీకి పంపాలని డిమాండ్

హైదరాబాద్‌‌, వెలుగు: ప్రాజెక్టుల డీపీఆర్‌‌లను పరిధికి మించి స్క్రూటినీ చేస్తున్నారని గోదావరి బోర్డు తీరును తెలంగాణ ఆక్షేపించింది. వెంటనే వాటిని సీడబ్ల్యూసీకి పంపాలని డిమాండ్‌‌ చేసింది. ఇరిగేషన్‌‌ ఈఎన్సీ మురళీధర్‌‌ ఈ మేరకు గురువారం జీఆర్‌‌ఎంబీ చైర్మన్‌‌ చంద్రశేఖర్‌‌ అయ్యర్‌‌కు లేఖ రాశారు. ఏపీ రీఆర్గనైజేషన్‌‌ యాక్ట్‌‌లోని 85(8)(డీ) క్లాజ్‌‌లో తొమ్మిదో పార్ట్‌‌ ప్రకారం డీపీఆర్‌‌లను బోర్డులు ఎంతవరకు పరిశీలించాలో స్పష్టతనిచ్చారని తెలిపారు. కొత్తగా నిర్మించే ప్రాజెక్టులకు మాత్రమే సంబంధిత రివర్‌‌ బోర్డులు, సీడబ్ల్యూసీ అనుమతులు అవసరమని గుర్తు చేశారు. బోర్డులు డీపీఆర్‌‌లు ఇవ్వాలని కోరిన ప్రాజెక్టులన్నీ రాష్ట్ర విభజనకు ముందు పూర్తి చేసినవేనని చెప్పారు. జీఆర్‌‌ఎంబీ తన అధికార పరిధిని దాటి డీపీఆర్‌‌లపై అనేక రిమార్కులు రాస్తూ కాలయాపన చేస్తోందని ఆరోపించారు. జీఆర్‌‌ఎంబీ ఆక్షేపిస్తున్న అంశాలను పరిశీలించడానికి సీడబ్ల్యూసీలో అనేక డైరెక్టరేట్లు ఉన్నాయని గుర్తు చేశారు.
అనుమతుల కోసమే..
కేంద్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి రివర్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ బోర్డుల పరిధిని నిర్ధారిస్తూ జులై15న జారీ చేసిన గెజిట్‌‌ నోటిఫికేషన్‌‌ ప్రకారం6 నెలల్లోగా ప్రాజెక్టులకు అనుమతులు తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలోనే గోదావరిపై నిర్మిస్తున్న సీతారామ లిఫ్ట్‌‌, తుపాకులగూడెం బ్యారేజీ, ముక్తేశ్వర(చిన్న కాళేశ్వరం)లిఫ్ట్‌‌, మోడికుంటవాగు, చౌట్‌‌పల్లి హన్మంతరెడ్డి లిఫ్ట్‌‌, చనకా కొరాటా బ్యారేజీ డీపీఆర్‌‌లు బోర్డుకు సమర్పించారు. వాటిని సీడబ్ల్యూసీకి పంపకుండా గోదావరి బోర్డు డీపీఆర్‌‌లలో పలు వివరాలు లేవని కొర్రీలు పెడుతూ ఇరిగేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌కు తిప్పి పంపుతోంది. ఈ క్రమంలోనే డీపీఆర్‌‌ల పరిశీలన పేరుతో బోర్డు పలు వివరాలు కోరుతోందని, ఆ అధికారం జీఆర్‌‌ఎంబీకి లేదని ఈఎన్సీ తేల్చి చెప్పారు. ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్‌‌ను కేఆర్‌‌ఎంబీకి సమర్పిస్తే, దాన్ని పరిశీలించే నిపుణులు, యంత్రాంగం తమ వద్ద లేదని సీడబ్ల్యూసీ పరిశీలనకు పంపారని గుర్తు చేశారు. పరిశీలన పేరుతో కాలయాపన చేయకుండా తమ డీపీఆర్‌‌లను వెంటనే సీడబ్ల్యూసీకి పంపాలని కోరారు. డీపీఆర్‌‌లను సీడబ్ల్యూసీలోని హైడ్రాలజీ, ఐఎస్‌‌ఎం, ఇరిగేషన్‌‌ ప్లానింగ్‌‌, వాటర్‌‌ అవైలెబులిటీ, కాస్ట్‌‌, కాస్ట్‌‌ ఎకనామిక్‌‌, డిజైన్‌‌ తదితర డైరెక్టరేట్లు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు.