- హద్దుమీరుతున్న గోదావరి బోర్డు
- తెలంగాణ ఈఎన్‌సీ అభ్యంతరం
- రాష్ట్రం సమర్పించిన డీపీఆర్‌లపై కొర్రీలు
- బోర్డు మీటింగ్‌లో చర్చిద్దామన్న జీఆర్‌ఎంబీ
- బోర్డుకు అధికారం లేదంటూ రాష్ట్రం అభ్యంతరం
హైదరాబాద్, వెలుగు: ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)లపై గోదావరి బోర్డు (జీఆర్ఎంబీ), తెలంగాణ మధ్య ఫైటింగ్ నడుస్తున్నది. తమ డీపీఆర్‌లను బోర్డు పరిధికి మించి స్క్రుటినీ చేస్తున్నదని రాష్ట్ర సాగునీటి శాఖ గుర్రుగా ఉంది. స్క్రుటినీకి సీడబ్ల్యూసీలో డైరెక్టరేట్లున్నాయని, వాళ్ల పనిని బోర్డు తలకెత్తుకోవడం ఎందుకని అభ్యంతరపెడుతోంది. పరిధి దాటడం మాని డీపీఆర్‌లను సీడబ్ల్యూసీకి పంపాలంటూ జీఆర్‌ఎంబీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌కు ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ బుధవారం లేఖ రాశారు.
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ధారిస్తూ
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జులై 15న గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అది అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. తర్వాత ఆర్నెల్లలోగా అనుమతి లేని ప్రాజెక్టులకు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో చౌటుపల్లి హన్మంతరెడ్డి, చనాకా- కొరాట, చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వర్) లిఫ్ట్, తుపాకులగూడెం, సీతారామ, మోడికుంటవాగు ప్రాజెక్టుల డీపీఆర్‌లను బోర్డుకు తెలంగాణ సమర్పించింది. ‘‘ఇవన్నీ 2010లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించినవే గనుక విభజన చట్టంలోని సెక్షన్ 85(8)(డీ) పరిధిలోకి రావు. గోదావరిలో రాష్ట్ర వాటా అయిన 967.94 టీఎంసీల నికర జలాలకు లోబడే ఈ ప్రాజెక్టులు చేపట్టాం. తెలంగాణ వచ్చాక రాష్ట్ర అవసరాలకు తగ్గట్టు వాటి స్కోప్ మార్చామే తప్ప కొత్త ప్రాజెక్టులు కావు. హన్మంతరెడ్డి, చిన్న కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతారామ, మోడికుంట ప్రాజెక్టులు గెజిట్ నోటిఫికేషన్‌లో తప్పుగా అన్ అప్రూవ్డ్ జాబితాలో చేర్చారు. ప్రాజెక్టుల ఇరిగేషన్ ప్లానింగ్, కాస్ట్, కాస్ట్ ఎకనామిక్స్, డిజైన్ తదితరాలను బోర్డు పరిశీలించాల్సిన పని లేదు. అందుకు సీడబ్ల్యూసీలో అనేక డైరెక్టరేట్లున్నాయి. డీపీఆర్‌ల పరిశీలనలో ఒక్కో బోర్డు ఒక్కోలా వ్యవహరిస్తున్నది. ఏపీ ప్రభుత్వం సమర్పించిన రాయలసీమ లిఫ్ట్ డీపీఆర్‌ను కృష్ణా బోర్డు వెంటనే సీడబ్ల్యూసీకి పంపింది. హైడ్రాలజీ, ఇరిగేషన్ ప్లానింగ్, నీటి లభ్యత, అంతర్రాష్ట్ర అంశాలు తదితరాలను పరిశీలించే నైపుణ్యాలు తమకు లేవని బోర్డు చెప్పింది. ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పిస్తే పరిశీలించి త్వరగా అనుమతులిప్పిస్తామని రెండో అపెక్స్ కౌన్సిల్ భేటీలో హామీ ఇచ్చారు. కాబట్టి గోదావరి బోర్డు తన పరిధి దాటి డీపీఆర్‌ల పరిశీలన పేరుతో కాలయాపన చేయకుండా వాటిని వెంటనే సీడబ్ల్యూసీకి పంపాలి” అని కోరింది.
బోర్డు ఎలా స్పందిస్తుందో?
డీపీఆర్‌లపై గోదావరి బోర్డు ముందునుంచీ నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. తెలంగాణ సమర్పించిన డీపీఆర్‌లు సీడబ్ల్యూసీ నిబంధనల మేరకు లేవని మొదట్లోనే చెప్పింది. పలు సవరణలు కోరుతూ లేఖలు రాసింది. మొదట్లో బోర్డు లేఖలకు సాగునీటి శాఖ బదులిచ్చింది. తర్వాత ప్రత్యేక మీటింగ్ పెట్టింది. బోర్డు పరిధి దాటుతోందంటూ ఈఎన్సీ అక్టోబర్ 26న లేఖ రాశారు. దీనిపై బోర్డూ ఘాటుగానే స్పందించింది. డీపీఆర్‌ల పరిశీలన, బోర్డు పరిధి, అధికారాలపై ఫుల్ బోర్డు మీటింగ్ పెట్టి చర్చిద్దామంటూ రిప్లై రాసింది. ఇప్పుడు మళ్లీ అవే అంశాలతో తెలంగాణ ఇంకో లేఖ రాయడంతో బోర్డు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.