
- కేఆర్ఎంబీ మీటింగ్కు ఆ రాష్ట్ర అధికారులు డుమ్మా
- కావాలని లేట్ చేస్తూ నీళ్లను ఎత్తుకెళ్లేందుకు కుట్రలు
- బోర్డు ముందు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన తెలంగాణ
- ఏ మీటింగ్‌కూ హాజరు కాని ఏపీ సెక్రటరీ.. అన్ని మీటింగ్‌లకూ రాష్ట్రం నుంచి రాహుల్ బొజ్జా
- శ్రీశైలం నుంచి ఏపీకి ఒక్క చుక్క కూడా ఇవ్వొద్దని తెలంగాణ డిమాండ్
- ఏపీ అధికారుల తీరుతో సమావేశం నేటికి వాయిదా
హైదరాబాద్, వెలుగు: శివరాత్రి పండుగను వదిలిపెట్టుకుని తెలంగాణ అధికారులు కృష్ణా బోర్డు మీటింగ్కు హాజరైతే.. ఏపీ అధికారులు అదే పండుగ పేరు చెప్పి ఎస్కేప్ అయ్యారు. కావాలని మీటింగ్ వాయిదాలు వేయిస్తూ దొడ్డిదారిన నీళ్లను ఎత్తుకెళ్లేందుకు ఏపీ కుట్రలు చేస్తున్నది. నీటి వాటాలపై ఈ నెల 21నే మీటింగ్ జరగాల్సి ఉన్నా.. 24కు ఏపీ వాయిదా వేయించింది.
ఆ మీటింగ్కు హాజరైనా కొర్రీలు పెడుతూ సీఈల కమిటీ పేరుతో నాన్చింది. బుధవారం మరోసారి మీటింగ్ పెట్టాలని 21నే డిసైడ్ చేశారు. అందుకు తగ్గట్టుగా జలసౌధలో కేఆర్ఎంబీ మీటింగ్‌ను ఏర్పాటు చేశారు. మీటింగ్ స్టార్ట్ అయ్యే టైమ్‌కు రావడం లేదని ఏపీ అధికారులు కబురు పంపించారు. శివరాత్రి పండుగ ఉందని తప్పించుకున్నారు. అయితే, మీటింగ్‌ను లేట్ చేసే కొద్దీ శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి మరిన్ని నీళ్లను ఎత్తుకుపోవాలన్న కుట్రలో భాగంగానే ఏపీ ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నదని తెలంగాణ అధికారులు మండిపడుతున్నారు.
ఏపీ తీరుపై బోర్డు చైర్మన్ అతుల్‌జైన్ ముందు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బోర్డు ఆదేశాలకే విలువ ఇవ్వకపోతే ఎలా అని ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. వాస్తవానికి 21న జరిగిన మీటింగ్‌లో ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు 23 టీఎంసీలకు ఒప్పుకున్నట్టు తెలిసింది. అలాంటిది ఇప్పుడు మీటింగ్కు రాకుండా ఎగ్గొట్టడం వెనుక ఆంతర్యం ఏంటని తెలంగాణ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సెక్రటరీ కూడా రావట్లే
బోర్డు మీటింగ్ పెట్టిన ప్రతిసారి తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా హాజరవుతున్నారు. ఏపీ సెక్రటరీ మాత్రం మీటింగ్ లకు రాకుండా తప్పించుకుంటున్నారు. కేవలం ఏపీ ఈఎన్సీ, ఇతర అధికారులను పంపిస్తూ చేతులు దులుపుకొంటున్నారు. ఈసారైతే ఏకంగా అధికారులెవరూ మీటింగ్కు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే చేసేదేమీ లేక గురువారం ఉదయం 11 గంటలకు బోర్డు మీటింగ్‌ను నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ సారి కూడా రాకపోతే ఊరుకునేది లేదని తెలంగాన అధికారులు తేల్చి చెబుతున్నారు. నీటి వాటాలపై తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. అక్టోబర్, నవంబర్‌లో వచ్చిన వరదలతో శ్రీశైలం నుంచి నీటిని తోడేసుకుని రిజర్వాయర్లలో నింపుకొన్న ఏపీ.. ఇప్పుడు ఆయకట్టు పేరు చెప్పి సాగర్ కుడి కాలువ నుంచి తన వాటాకు మించి ఎత్తుకెళ్తూ జలదోపిడీపై కుట్రలు పన్నుతున్నదని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నీటి తరలింపును పూర్తిగా ఆపాల్సిందే
శ్రీశైలం నుంచి ఏపీ పూర్తిగా నీటి తరలింపును ఆపాల్సిందేనని కృష్ణా బోర్డు ముందు తెలంగాణ తేల్చి చెప్పింది. ఒక్క చుక్క కూడా ఆ ప్రాజెక్టు నుంచి ఏపీ నీటిని తీసుకోవడానికి వీల్లేదని, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, మల్యాలల నుంచి అక్రమ నీటి తరలింపును తక్షణమే ఆపాలని స్పష్టం చేసింది. సాగర్ కుడి కాలువ నుంచి ప్రస్తుతం తీసుకెళ్తున్న 7 వేల క్యూసెక్కుల నీటి తరలింపును.. 5 వేల క్యూసెక్కులకు తగ్గించాలని డిమాండ్ చేసింది.
ఇటు సీఈల మీటింగ్‌లో మే వరకు కావాల్సిన నీటి అవసరాలపై ఇరు రాష్ట్రాలు చర్చించాయి. 2 ప్రాజెక్టుల నుంచి తెలంగాణ 63 టీఎంసీల నీటికి ఇండెంట్ పెట్టింది. ఆ నీళ్లను తమకు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఇటు ఏపీ.. ఇప్పటికే 640 టీఎంసీలకుపైగా వాడుకున్నా.. 666 టీఎంసీల్లో కేవలం ఇంకో 25 టీఎంసీలే ఆ రాష్ట్రానికి ఉన్నా .. 55 టీఎంసీలు కావాలంటూ నీళ్లపై తొండాటకు దిగింది.
సాగర్ కింద ఉన్న ఆయకట్టు ఎండిపోయే పరిస్థితి ఉన్నదని చెబుతూ బోర్డుకు ఇండెంట్ పెట్టింది. కానీ, రెండు ప్రాజెక్టుల్లో కలిపి ప్రస్తుతం లైవ్ స్టోరేజ్‌లో ఉన్న నీళ్లు కేవలం 60 టీఎంసీలే. సాగర్‌లో 40 టీఎంసీలు, శ్రీశైలంలో మరో 20 టీఎంసీల నీళ్లే ఉన్నాయని అధికారులు అంటున్నారు. అయితే, ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్లన్న విష యం గురువారం జరిగే మీటింగ్‌లో తేలనున్నది.