ఇవాళ తెలంగాణ ఒలింపిక్‌‌ సంఘం ఎన్నికలు.. సాయంత్రం ఫలితాలు

ఇవాళ తెలంగాణ ఒలింపిక్‌‌ సంఘం ఎన్నికలు.. సాయంత్రం ఫలితాలు

హైదరాబాద్‌‌, వెలుగు : తెలంగాణ ఒలింపిక్‌‌ సంఘం (టీఓఏ) ఎన్నికలకు రంగం సిద్ధమైంది.  హైదరాబాద్‌‌  ఒలింపిక్‌‌ భవన్‌‌లో గురువారం ఎన్నికలు జరగనున్నాయి.  ప్రెసిడెంట్ పోస్టుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్‌‌‌‌ రెడ్డి,  బ్యాడ్మింటన్ అసోసియేషన్‌‌ ఆఫ్​ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ వి, చాముండేశ్వర్ నాథ్ పోటీపడుతున్నారు. జనరల్ సెక్రటరీ పోస్టు కోసం పి. మల్లారెడ్డి, బాబూరావు బరిలో నిలిచారు. ట్రెజరర్ పోస్టుకు సతీష్‌‌ గౌడ్‌‌, ప్రదీప్ కుమార్ మధ్య పోటీ నెలకొంది. 

మరో నాలుగు వైస్ ప్రెసిడెంట్‌‌, నాలుగు జాయింట్ సెక్రటరీ, పది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్‌‌, ఐదు జిల్లా ఒలింపిక్స్ సంఘాల ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్‌‌ పోస్టులకు ఎన్నికలు జరగాలి. అయితే, ఈ  పోస్టులకు ఒక్కొక్కరే పోటీలో ఉండటంతో ఏకగ్రీవం కానున్నాయి.  ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌‌ సి.ప్రవీణ్‌‌కుమార్‌‌ ఎన్నికలకు రిటర్నింగ్‌‌ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఎలక్టోరల్‌‌ కాలేజీలోని వివిధ క్రీడా సంఘాలకు చెందిన 65 మంది ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

12 గంట‌‌ల నుంచి సాయంత్రం 4 గంట‌‌ల వ‌‌ర‌‌కు పోలింగ్‌‌ జరగనుంది. సాయంత్రం 4.30 నుంచి కౌంటింగ్ ప్రారంభం, అనంత‌‌రం ఫ‌‌లితాలు వెల్లడి ఉంటుంది. టీఓఏ ఎన్నికలపై తెలంగాణ బాక్సింగ్ సంఘం హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ పూర్తయ్యే వరకు ఎన్నికల ఫలితాల ప్రకటనపై స్టే విధించింది.