టీఆర్​ఎస్​ డిక్షనరీ నుంచి తెలంగాణ ఔట్​

  • బీజేపీ డైరీలో సరికొత్త రికార్డు
  • టీఆర్​ఎస్​ డిక్షనరీ నుంచి తెలంగాణ ఔట్​

మొన్నటి డిసెంబర్ 8వ తేదీన దేశంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.  గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయ దుందుభి మోగిస్తే, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్​ఎస్​ పార్టీ బీఆర్​ఎస్​గా మారేందుకు ఈసీ నుంచి అనుమతి వచ్చింది. గుజరాత్​లో వరుసగా ఏడో సారి గెలిచి బీజేపీ తన డైరీలో సరికొత్త రికార్డును నెలకొల్పితే, అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి తన డిక్షనరీ నుంచి ‘తెలంగాణ’ను తుడిచేసుకున్నది.

గుజరాత్​ ఎన్నికలు బీజేపీకి ఊహించని విజయాన్ని కట్టబెడితే, దేశ రాజకీయాల్లో బలహీన పడు తున్న కాంగ్రెస్​ పార్టీకి హిమాచల్​ ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొత్త ఊపిరిని అందించాయి. అర్బన్​ పార్టీగా ముద్రపడిన ఆమ్​ ఆద్మీపార్టీకి జాతీయ పార్టీ హోదాను తెచ్చిపెట్టింది. చివరిగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, టీఆర్​ఎస్​ పార్టీ పేరు బీఆర్​ఎస్​గా మార్పు చెందడానికి కూడా అనుమతి లభించింది. నాలుగు రకాల మార్పులు ఒకే రోజు చోటుచేసుకోవడం యాదృశ్చికమే అయినా, దేశ రాజకీయాల్లో  అవి సరికొత్త ఆలోచనలకు అవకాశమిచ్చేవే. అయితే అవన్నీ కాలానికి నిలబడతాయని చెప్పే సాహసం మాత్రం ఎవరూ చేయలేరు.

తిరుగులేని  మోడీ చరిష్మా 

ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా ఏమాత్రం తగ్గలేదని, అది మరింత పెరిగిందని కూడా గుజరాత్​, హిమాచల్​ ప్రదేశ్​ అసెంబ్లీ ఫలితాలు చెపుతున్నాయి. గుజరాత్​ అసెంబ్లీ ఫలితాలు.. దేశంలో మోడీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేశాయని చెప్పాలి. గుజరాత్​లో బీజేపీ 80% పైగా అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడం మామూలు విషయం కాదు. ఇంకా చెప్పాలంటే, గుజరాత్​ సీఎం సుపరిపాలనతో వచ్చిన ఫలితాలు అనేకన్నా, దేశ ప్రధాని మోడీ నాయకత్వం పట్ల అచంచల విశ్వాసంతో వచ్చిన ఫలితాలంటేనే బాగుంటుంది. హిమాచల్​ ప్రదేశ్​లోనూ బీజేపీ ఘోరంగా ఓడింది కూడా ఏమీ లేదు.  కేవలం 0.9 శాతం ఓట్ల తేడాతో మాత్రమే వెనకబడటం గమనించొచ్చు. నిజంగా మోడీ ప్రజాదరణే లేకుంటే హిమాచల్​లో బీజేపీ చాలా ఘోరంగా ఓడిపోయి ఉండేది. అందునా హిమాచల్​లో ఐదేళ్ల కోసారి ప్రభుత్వాలను మార్చడం అక్కడ ఒక రివాజుగా మారిన విషయాన్ని కూడా మనం గమనించొచ్చు.  చివరకు ఢిల్లీ మున్సిపల్​ కార్పొరేషన్​ ఎన్నికల్లోనూ ఆప్​కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది తప్ప చేతులు ఎత్తేయలేదు. ఎగ్జిట్​ పోల్స్​ అన్నీ  ఆప్​ కనీసం 170 -– 190 స్థానాలు గెలుచుకుంటుందని చెప్పాయి. కానీ ఆప్​కు134 మాత్రమే దక్కాయి. బీజేపీకి 104 స్థానాలు దక్కాయి.  హిమాచల్​లో, ఢిల్లీలో వచ్చిన ఫలితాలు చూస్తే బీజేపీ  మెజారిటీ సాధించలేదనవచ్చు తప్ప అది బలహీనపడ్డదని ఎవరూ చెప్పలేరు.  మొత్తంగా చూస్తే దేశంలో మోడీ పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదని ఆ మూడు ఎన్నికలు కూడా రుజువుచేశాయి. ఎవరు ఎంత వ్యతిరేక ప్రచారం చేస్తున్నా.. దేశ రాజకీయాల్లో మోడీ మాత్రం ఒక లెజెండ్​గా మారిపోయారు.  ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అందులో దేశ హితమే ఉంటుందనే విశ్వాసం  ప్రజల్లో నాటుకుపోయింది. ప్రజలకు ఒకప్పుడు అలాంటి నమ్మకం ఇందిరాగాంధీ నాయకత్వంపై ఉండేది. ఇపుడు నరేంద్రమోడీపై అలాంటి నమ్మకమే  ఏర్పడింది. అందుకే  మోడీపై ప్రతిపక్షాలు ఎన్ని పడికట్టు విమర్శలు చేసినా.. ప్రజల్లో ఆయన పట్ల ఉన్న విశ్వాసాన్ని  ఏమాత్రం తుడిచేయలేకపోతున్నాయి.

కేసీఆర్​ డిక్షనరీ నుంచి..

జాతీయ పార్టీగా మారాలంటే, జాతీయ నాయకుడిగా మారిపోవాలంటే.. మోడీ, అమిత్​షా పేర్ల ఉచ్ఛారణ లేకుండా ప్రెస్​ మీట్లు ఉండకూడదు! ఈడీ, సీబీఐ, ఐటీ వంటి  సీసపద్యాలు చదవకుండా బహిరంగ సభలు అసలే ఉండకూడదు! ఈడీ బోడీ వంటి ప్రాసలు లేకుండా చిట్​చాట్లు ఉండకూడదు! ఈ విధంగా  టీఆర్​ఎస్​ను బీఆర్​ఎస్ మార్చుకునే కసరత్తు ఇప్పటికే పూర్తయింది!  కాబట్టే  డిసెంబర్​ 8న టీఆర్​ఎస్​ పేరు బీఆర్​ఎస్​గా మారిపోయింది. ‘తెలంగాణ’ పదం కేసీఆర్ రాజకీయ​ డిక్షనరీ నుంచి తొలగిపోయింది.  తొమ్మిదేండ్ల టీఆర్​ఎస్​ పాలనలో పాలకుడుగా  బతికింది కేసీఆర్​ తప్ప తెలంగాణ కాదు.   కాబట్టి ఆయన తన పార్టీ పేరు నుంచి ఇప్పటికైనా తెలంగాణ పదాన్ని తొలగించినందుకు సంతోషించే ఉద్యమకారులు ఇవాళ కోకొల్లలుంటారు!  ఉద్యమ రాజకీయం నడిపిన నేతగా కేసీఆర్,​ పాలకుడిగా మారాక స్థిరపరిచింది తెలంగాణ అస్థిత్వాన్ని  కాదు, తన వ్యక్తిగత రాజకీయాన్ని స్థిరపరుచుకున్నారు!  రాజకీ య ఎత్తులు, జిత్తులతో తన పబ్బం గడుపుకోవడమే దినచర్యగా మారిపోయింది. ప్రజాసంబంధాలను దూరంగా పెట్టడం,, ఫక్తు రాజకీయం, పరిపాలనలో ఓటు లేదా సొంత ప్రయోజనం తప్ప అందులో  తెలంగాణ లేకపోవడం, అభివృద్ధిలోనూ ఆశించిన ప్రజా ప్రయోజనాలు కనిపించక పోవడం, కాళేశ్వరం, మిషన్​ భగీరథ వంటి పథకాల్లో సాఫల్యం లేకపోవడం, విద్య, వైద్యం నిర్లక్ష్యానికి గురికావడం, ఉద్యమ కారులను దూరం పెట్టడం,ఉద్యమ వ్యతిరేకులను అందలాలెక్కించడం వంటి అవలక్షణాలతో తెలంగాణ అస్థిత్వాన్ని  రాజకీయ వ్యాపారంగామార్చుకున్నారు. పాలకుడుగా మారిన ఒక ఉద్యమనేత నుంచి ఇలాంటి చేదు అనుభవాలను నిజానికి ఎవరూ ఊహించలేదు. ఇపుడు ‘తెలంగాణ’ పేరునే తొలగించుకున్నందుకు బాధపడే వారెవరుంటారని? అందువల్ల ఉద్యమ నేతగా కేసీఆర్​ పాపులారిటీ చెల్లని రూపాయిగా ఎప్పుడో  మారిపోయింది. ఇక జాతీయ నాయకుడిగా ఎలాంటి రూపాయిగా మారుతారో మనం చెప్పే కన్నా  కాలమే చెపుతుందంటే  బాగుంటుంది!

కొసమెరుపు

పేరు మార్చుకుంటే అదృష్టం మారుతుందని జ్యోతిష్యులు చెపుతుంటారు. ఒక ప్రాంతీయ పార్టీ పేరు మార్చుకుంటే అది జాతీయపార్టీగా మారిపోతుందా అనేది జ్యోతిష్యులు చెప్పలేరు, ప్రజలు మాత్రమే చెప్పగలుగుతారు.

గుజరాత్​లో తెలంగాణ ఓటు మోడీకే

సీఎం కేసీఆర్, రాష్ట్రానికి ‘ముఖ్యమైన’ మంత్రిగా భావించే కేటీఆర్​ ​ గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి హతాశులై ఉంటారు!  గుజరాత్​లో సూరత్​, అహ్మదాబాద్​ వంటి పారిశ్రామిక పట్టణాల్లో తెలంగాణ ప్రజలు లక్షలాదిగా ఉన్నారు. అక్కడి రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. వారు ఏ పార్టీవైపు మొగ్గు చూపితే ఆ పార్టీదే గెలుపు.  సూరత్​ లో ఉన్న 16 అసెంబ్లీ స్థానాలు అన్నీ బీజేపీ గెలుచుకుంది. అలాగే అహ్మదాబాద్​లో ఉన్న 21 స్థానాల్లో 19 స్థానాలు బీజేపీ గెలుచుకుంది. ఆ విధంగా గుజరాత్​లో స్థిరపడ్డ తెలంగాణ వాళ్లంతా బీజేపీ గెలుపులో భాగస్వాములయ్యారు. గుజరాత్​లో తెలంగాణ ఓటు ముమ్మాటికి బీజేపీకే వెళ్లింది.  మోడీ పై ఒంటికాలుపై లేస్తున్న కేసీఆర్​ అక్కడి ప్రజలను ఎందుకు ప్రభావితం చేయలేకపోయారో? గుజరాత్​లో ఉన్న తెలంగాణోళ్లనే ప్రభావితం చేయలేకపోయిన కేసీఆర్,​ రేపు జాతీయ నాయకుడిగా ఎలా రాణిస్తారో  తెలిసిపోతూనే ఉంది!          

ఆప్​ అర్బన్​ పార్టీయే!

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్​కు  హిమాచల్​ ప్రదేశ్​ గెలుపు మరోసారి జీవం పోసిందని చెప్పొచ్చు.  అది చిన్నపాటి హిల్ స్టేటే అయినా..  బలహీన పడుతున్న కాంగ్రెస్​ వంటి జాతీయ పార్టీకి ఊరట కలిగించిందని చెప్పాలి. హిమాచల్​లో ఆమ్ఆద్మీ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. పంజాబ్​లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో అక్కడ ఆప్​ అధికారంలోకి రాగలిగింది. కానీ అన్ని రాష్ట్రాల్లోనూ అలాంటి ఆదరణే లభిస్తుందని కేజ్రీవాల్​ ఆశించడం అత్యాశే. ఎంతచెప్పుకున్నా  దేశంలో అది అర్బన్​ పార్టీగానే  స్థిరపడుతున్నది. దేశంలో జాతీయపార్టీగా బీజేపీ నిలదొక్కుకున్నది, కానీ కాంగ్రెస్​ కూడా నిలదొక్కుకోలేక పోవడమే  అనేక ప్రాంతీయ పార్టీలకు దేశ రాజకీయాలు ఆటవిడుపుగా మారుతున్నాయి.

కల్లూరి శ్రీనివాస్​ రెడ్డి
సీనియర్​ జర్నలిస్ట్​