ఏజెన్సీ విధానాన్ని ఎత్తివేసి సర్కారే జీతాలివ్వాలి : ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ

ఏజెన్సీ విధానాన్ని ఎత్తివేసి సర్కారే జీతాలివ్వాలి : ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ

బషీర్​బాగ్, వెలుగు: రాష్ట్రంలో ఏజెన్సీ విధానాన్ని ఎత్తివేసి, ప్రభుత్వమే నేరుగా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్​పులి లక్ష్మయ్య డిమాండ్ చేశారు. హిమాయత్ నగర్ ఏఐటీయూసీ భవన్ లో ఆదివారం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు 2 లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారని, వారికి ఆరు నెలలకు ఒకసారి ఏజెన్సీలు జీతాలు చెల్లిస్తున్నాయన్నారు.

సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా, కేవలం రూ.14 వేలు ఇస్తూ శ్రమ దోపిడీ చేస్తున్నారన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ కూడా ఇవ్వడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించి, సమాన పనికి సమాన వేతనం నేరుగా చెల్లించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను సంఘటితం చేసి రాష్ట్ర సాధన ఉద్యమ తరహాలో మరో ఉద్యమాన్ని చేపడతామనిహెచ్చరించారు.