
- 18 పతకాలు సాధించిన మన పోలీసులు
- ఓవరాల్ టీమ్ చాంపియన్ షిప్ ట్రోఫీ కైవసం
హైదరాబాద్ సిటీ, వెలుగు: జార్ఖండ్‌లోని రాంచీలో ఈనెల 10 నుంచి 15 వరకు జరిగిన 68వ అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్ –2025లో తెలంగాణ పోలీస్ బృందం అద్భుత ప్రతిభ కనబరిచింది. వివిధ కేటగిరిల్లో మొత్తం 18 పతకాలు సాధించి ఓవరాల్ టీమ్ చాంపియన్ షిప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ పోటీల్లో దేశంలోని మిగిలిన రాష్ట్రాలు రెండంకెల పతకాలు సాధించలేకపోయాయి. తెలంగాణ సీఐడీ డైరెక్టర్ జనరల్ శిఖా గోయల్ శనివారం తన ఆఫీసులో ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. మొత్తం 6 బంగారు, 4 రజత, 8 కాంస్య పతకాలను మన రాష్ట్ర పోలీసులు గెలుచుకున్నారని ఆమె తెలిపారు.
సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్, యాంటీ సాబొటేజ్ చెక్ కంప్యూటర్ అవేర్‌నెస్, డాగ్ స్క్వాడ్ పోటీల్లో ఓవరాల్ టీం చాంపియన్‌షిప్ ను కైవసం చేసుకున్నారని చెప్పారు. తెలంగాణ పోలీస్ బృందం తరపున సీఐడీ ఎస్పీ బి.రామి రెడ్డి ట్రోఫీని స్వీకరించారు. కాగా.. ఈ విజయంపై సీఎం రేవంత్‌రెడ్డి, డీజీపీ జితేందర్ హర్షం వ్యక్తం చేశారు. మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్ర బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ విజయానికి తమ సిబ్బంది కఠిన శిక్షణ, అంకితభావం, నిబద్ధతే కారణమని డీజీపీ డాక్టర్ జితేందర్ ట్వీట్ చేశారు.