- ఆఫీసర్లు ముందుచూపుతో వ్యవహరించాలి
- విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
- మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)
ములుగు, వెలుగు: జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలయ్యే ప్రతి పథకం సకాలంలో లబ్ధిదారులకు చేరేలా అధికారులు చూడాలని, ఆఫీసర్లు ముందుచూపుతో వ్యవహరిస్తూ ప్రజాసేవలో భాగస్వాములు కావాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) పిలుపునిచ్చారు. విద్య, వైద్యంపై ప్రత్యేక చొరవ చూపాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం ములుగు కలెక్టరేట్ లో ఎంపీ బలరాం నాయక్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం ఏర్పాటు చేయగా మంత్రి సీతక్క భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ దివాకర పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ప్రగతి పనుల లక్ష్యాలకు సంబంధించి శాఖల వారీగా సమీక్షించారు. రానున్న విద్యా సంవత్సరంలో జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని సూచించారు. జిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నామని, ఇటీవల లక్నవరంలో మూడో దీవిని ప్రారంభించామని
వివరించారు.
అంకిత భావంతో పనిచేయాలి
ములుగు జిల్లాలో పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులు అంకిత భావంతో పనిచేస్తూ జిల్లా సమగ్ర అభివృద్ధికి సహకరించాలని ఎంపీ పోరిక బలరాం నాయక్ అన్నారు. జిల్లాలో ఎమ్మారై పరీక్ష కేంద్రం ఉన్నప్పటికీ ఏజెన్సీ మండలాలైన వాజేడు, వెంకటాపురం మండలాల్లో మరో ఎమ్మారై పరీక్షా కేంద్రాన్ని నెలకొల్పడానికి కలెక్టర్ చర్యలు తీసుకోవాలని సూచించారు.
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటోందని, ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని మంత్రిని కోరారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా, డీఎఫ్ వో రాహుల్ కిషన్ జాదవ్, అడిషనల్కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్ తదితరులు
పాల్గొన్నారు.
ఆత్మస్థైర్యంతో ఎదగాలని..
దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ఎదగాలని, ప్రభుత్వం వారికి స్వశక్తిపై నిలబడేలా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆన్లైన్జాబ్పోర్టల్ను ప్రారంభించిందని మంత్రి సీతక్క తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవానికి మంత్రి ఎంపీ బలరాం నాయక్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు అలింకో సంస్థ ద్వారా సుమారు రూ.63లక్షల విలువచేసే సహాయ పరికరాలను మంజూరు చేశామని మంత్రి తెలిపారు. క్రీడల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించిన విజేతలను సన్మానించి, బహుమతులు అందజేశారు. ములుగు లీలా గార్డెన్స్‌లో నిర్వహించిన క్రిస్మస్పండుగలో మంత్రి, ఎంపీ, కలెక్టర్లు పాల్గొన్నారు.
బ్లాక్‌బెర్రీ ద్వీపం పరిశీలన
తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని పస్రా --తాడ్వాయి మధ్యలో 163 వ హైవేకి కూత వేటు దూరంలో దట్టమైన అడవిలో ఐదు ఎకరాల్లో పర్యాటకులను కనువిందు చేసేందుకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బ్లాక్ బెర్రీ అనే ద్వీపాన్ని ఏర్పాటు చేశారు. ఈ ద్వీపాన్ని సోమవారం సాయంత్రం మంత్రి సీతక్క ఎంపీ బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఫారెస్ట్ అధికారులతో పరిశీలించారు. దట్టమైన అడవిలో పర్యాటకుల కోసం అన్ని హంగులతో నిర్మించిన పర్యాటకశాఖ అధికారులను అభినందించారు.