
- బడ్జెట్ సమావేశాల్లో పెట్టకుంటే.. ఈ ఏడాది అమలు కష్టమే!
- ఇప్పటికే డ్రాఫ్ట్ బిల్లును సర్కార్‌కు సమర్పించిన విద్యా కమిషన్
- దానిపై త్వరగా చర్చించి, అసెంబ్లీలో పెట్టాలని పేరెంట్స్ విజ్ఞప్తి
- చట్టం చేస్తరని ఇప్పటికే ఫీజులు పెంచేసిన కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు.. ఆ ఫీజులు ముందుగానే చెల్లించాలంటూ రూల్స్
హైదరాబాద్, వెలుగు: త్వరలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండడంతో పేరెంట్స్‌లో మళ్లీ స్కూల్ ఫీజుల భయం మొదలైంది. ప్రభుత్వం త్వరగా ఫీజుల నియంత్రణ చట్టం చేయాలని వాళ్లు కోరుతున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెట్టి, ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఫీజుల నియంత్రణకు సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లును తెలంగాణ విద్యా కమిషన్ ఇప్పటికే సర్కార్‌కు అందించింది.
దీంతో బడ్జెట్సమావేశాల్లోనే బిల్లు పెడ్తారని అందరూ ఆశించారు. అయితే, ఆ బిల్లు గురించి ఎలాంటి ఊసులేకపోవడంతో.. ఈ ఏడాదైనా ఫీజుల నియంత్రణ చట్టం తెస్తారా? లేదా? అని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.
డ్రాఫ్ట్ బిల్లు రెడీ..
ఫీజుల నియంత్రణ కోసం తెలంగాణ విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలో పేరెంట్స్, టీచర్లు, మేనేజ్మెంట్లు, విద్యావేత్తలు, ఎన్జీవోలతో సమావేశాలు నిర్వహించి, అభిప్రాయాలు సేకరించారు. ‘తెలంగాణ ప్రైవేట్ స్కూల్ ఫీజు రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్’ ఏర్పాటు చేయాలని సర్కార్‌కు చేశారు. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లునూ అందజేశారు. విద్యాసంస్థకు ఉన్న ల్యాండ్, వసతులు, టీచర్లు, ఫెసిలిటీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఫీజులను నిర్ణయించాలని అందులో కమిషన్పేర్కొంది.
స్కూళ్లను ఐదు కేటగిరీలుగా చేయాలని, మొదటి కేటగిరీకి మినహా మిగిలిన వాటికి గరిష్ట ఫీజు డిసైడ్ చేయాలని సూచించింది. ప్రతి స్కూల్‌లో గరిష్ట ఫీజు మించకుండా రెండేండ్లకోసారి ఫీజులు పెంచుకోవచ్చని ప్రతిపాదించింది. ప్రతీ మూడు, నాలుగేండ్లకోసారి కమిషన్ ఫీజులను మార్చుతుంద ని తెలిపింది. కమిషన్‌కు చైర్మన్‌గా రిటైర్డ్ జడ్జి లేదా రిటైర్డ్ ఐఏఎస్ ఉండాలని సూచించింది. ఆన్‌లైన్‌లోనే ఫీజులు వసూలు చేయాలని, ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని బిల్లులో పేర్కొంది.
తొందరగా చట్టం చేస్తేనే మేలు..
వచ్చే విద్యాసంవత్సరం ఫీజులను నియంత్రించాలంటే.. ఇప్పటి నుంచే సర్కార్ చర్యలు మొదలుపెట్టాలి. కానీ, ఇప్పటికీ తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన ముసా యిదా బిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంకా ఆలస్యమైతే ఈ చట్టం చేసినా, ఈ ఏడాది అమలు కష్టమే. స్టేట్ సిలబస్ మినహా, ఇతర బోర్డుల అకడమిక్ ఇయర్ ముందుగానే ప్రారంభం కానున్నది. చట్టం తీసుకొస్తుందనే భయంతో చాలా కార్పొరేట్ స్కూళ్లు 30% నుంచి 50% వరకు ఫీజులు పెంచేశాయనే ప్రచారం జరుగుతున్నది. పలు చోట్ల పేరెంట్స్ ఆందోళనలకూ దిగారు.
వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించిన ఫీజులు కూడా ఇప్పటికే 30 నుంచి 50శాతం వరకు ముందుగానే కట్టాలనే నిబంధనలనూ మేనేజ్మెంట్లు పెడుతున్నాయి. దీంతో పేరెంట్స్‌లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం ఇప్పటికైనా తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన ఫీజుల నియంత్రణ డ్రాఫ్ట్ బిల్లుపై నిర్ణయం తీసుకోవాలని పేరెంట్స్ కోరుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే దీనిపై చర్చించి, నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రైవేట్ స్కూళ్లలోనే ఎక్కువ మంది..
రాష్ట్రంలో దాదాపు 10వేలకు పైగా కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు ఉన్నాయి. వాటిల్లో 35 లక్షలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. సర్కార్ బడుల కంటే ప్రైవేట్ బడుల్లోనే 10 లక్షల మంది ఎక్కువగా చదువుతున్నారు. ప్రస్తుతం ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో రూ.30వేల నుంచి రూ.12 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. అయితే, ఎవరు? ఎంత? వసూలు చేయాలనే దానిపై సమగ్రమైన నిబంధనలు లేకపోవడంతో.. మేనేజ్మెంట్లు ఇష్టానుసారంగా ఫీజులు పెంచుకుంటూ పోతున్నాయి. ఈ క్రమంలోనే గత ప్రభుత్వం ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో కమిటీని వేసినా.. ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజుల నియంత్రణకు మళ్లీ చర్యలు మొదలుపెట్టింది.