
- అసెంబ్లీలో కొత్త బిల్లు పెట్టిన మంత్రి దామోదర.. సభ ఏకగ్రీవ ఆమోదం
- ఆర్గాన్ డొనేషన్, మార్పిడి పర్యవేక్షణకు అడ్వైజరీ కమిటీ
- అవయవాల సేకరణ, స్టోరేజీ కేంద్రాల ఏర్పాటు
- చర్మం, ఎముక మజ్జ, రక్తనాళాలు, హార్ట్ వాల్వ్‌లు కూడా అవయవ మార్పిడి పరిధిలోకి
- అమ్మమ్మ, నానమ్మ, తాతలు తమ మనుమలు, మనుమరాళ్లకు అవయవాలివ్వొచ్చు
హైదరాబాద్, వెలుగు: అవయవాల అక్రమ రవాణా, అక్రమ మార్పిడిపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తేల్చిచెప్పారు. కొత్త చట్టం ప్రకారం కోటి రూపాయల జరిమానా, పదేండ్ల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. పాత చట్టం ప్రకారం జరిమానా కేవలం రూ.5 వేల ఫైన్, 3 ఏండ్ల జైలు శిక్ష పడేదని తెలిపారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తోవ-1995 (తోట- 2011) చట్టాన్ని, నిబంధనలను అడాప్ట్ చేసుకుంటున్నదని ఆయన ప్రకటించారు. అవయవదానం కొత్త బిల్లును గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహా మాట్లాడారు. అవయవదానానికి సంబంధించి 1994లో కేంద్ర ప్రభుత్వం తోవ (టీహెచ్వోఏ: ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ యాక్ట్ (సెంట్రల్ యాక్ట్ 42), 1994 రూల్స్, 1995 తోవ) చట్టాన్ని చేసిందన్నారు. దానికి 2011లో కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసి టీహెచ్‌వోటీఏ (తోట) చట్టంగా పిలుస్తున్నదని, దానికి సంబంధించిన నిబంధనలను 2014లో కేంద్రం విడుదల చేసిందని వివరించారు. 24 రాష్ట్రాల్లో ప్రస్తుతం అదే అమలవుతున్నదని చెప్పారు. సవరణలు చేసిన తోట చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడాప్ట్ చేసుకున్నదని ఆయన పేర్కొన్నారు. దీని ప్రకారం అవయవదానం, మార్పిడి పర్యవేక్షణ కోసం ప్రభుత్వ స్థాయిలో అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు ‘అవయవాలు, కణజాల సేకరణ కేంద్రాలు, స్టోరేజీ సెంటర్లు’ను ఏర్పాటు చేస్తామని, తద్వారా పారదర్శకత పెరుగుతుందని చెప్పారు. ఇది మెడికల్ టూరిజం పెరిగేందుకు దోహదం చేస్తుందని ఆయన అన్నారు.
అవయవదానం కిందికి మరిన్ని..!
కొత్త చట్టం పరిధిలోకి గుండె, కిడ్నీ, కాలేయం వంటి అవయవాలతో పాటు చర్మం, ఎముక మజ్జ, రక్తనాళాలు, హార్ట్ వాల్వ్స్ వంటివి కూడా అవయవదానం కిందికి వస్తాయని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. బ్రెయిన్‌డెడ్ అయిన వారి నుంచి వీటిని సేకరించి అవసరమైన వారికి మార్పిడి చేసేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. అమ్మమ్మ, నానమ్మ, తాతలు వారి మనుమలు, మనువరాళ్లకు అవయవాలను దానం చేసేందుకు కొత్త చట్టం అనుమతిస్తుందని వెల్లడించారు. అలాగే మనుమలు, మనుమరాళ్లు కూడా వారి అమ్మమ్మ, నానమ్మ, తాతలకు అవయవదానం చేయొచ్చన్నారు. ‘‘కొన్ని రకాల జన్యుపరమైన సమస్యలతో పిల్లలకు లివర్ మార్పిడి చేయాల్సి వస్తున్నది. ఇలాంటి పిల్లలకు, వారి తాత, అమ్మమ్మ, నానమ్మ కాలేయదానం చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. పిల్లల ప్రాణాలను కాపాడేందుకు ఇది దోహదం చేస్తుంది.
1995 నాటి నిబంధనల ప్రకారం బ్రెయిన్ డెత్‌ను డిక్లేర్ చేసే అధికారం న్యూరో సర్జన్లు, న్యూరో ఫిజిషియన్లకు మాత్రమే ఉండేది. కానీ, కొత్త నిబంధనల ప్రకారం ఫిజీషియన్, సర్జన్, అనస్థీషియా స్పెషలిస్ట్, ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టులూ బ్రెయిన్ డెత్‌ను డిక్లేర్ చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీని వల్ల బ్రెయిన్ డెడ్ కేసుల్లో అవయవాలు వృథాగా పోకుండా అవసరమైన పేషెంట్ల ప్రాణాలను కాపాడేందుకు దోహపడుతుంది. మన రాష్ట్రంలో స్టేట్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ (సోటో)ను ఏర్పాటు చేస్తున్నం. రీజనల్ స్థాయిలో రోటో, జాతీయ స్థాయిలో నోటో ఉంటాయి. మన రాష్ట్రంలో పేషెంట్లకు అవయవాలు దొరకని సందర్భంలో దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా పొందేందుకు రోటో, నోటోతో సోటో (జీవన్‌దాన్) అనుసంధానమవుతుంది. అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటాం. సీఎంతో చర్చించి ఆర్గాన్ డోనర్ల కుటుంబాలను ఆదుకునేందుకు అవసరమైన పాలసీని రూపొందిస్తం’’ అని మంత్రి దామోదర చెప్పారు. కాగా, ఈ బిల్లుకు సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.