- దావోస్ వేదికగా హైదరాబాద్ ఘనత చాటేలా ప్రదర్శన
- చార్మినార్ టు ఫ్యూచర్ సిటీ విశేషాలతో వాల్ పోస్టర్లు
హైదరాబాద్, వెలుగు: స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో తెలంగాణ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతానికి భిన్నంగా ఈసారి ఇండియన్ గ్యాలరీలోనే అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక పెవిలియన్స్ కేటాయించారు. ‘‘తెలంగాణ మీన్స్ బిజినెస్’’ అనే థీమ్‌తో ఏర్పాటు చేసిన పెవిలియన్ దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలను, నిపుణులను ఆకట్టుకుంది. హైదరాబాద్‌లో ఉన్న ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతోపాటు అందుబాటులో ఉన్న నైపుణ్య వనరులు, తెలంగాణకు ఉన్న అనుకూలతలను చాటిచెప్పేలా ఈ పెవిలియన్ ను తీర్చిదిద్దారు.
అభివృద్ధి నినాదాలతో తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికలను ప్రదర్శించారు. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన సిటీగా హైదరాబాద్ నగరానికి ఉన్న ప్రత్యేకతలు, ఆకర్షణలను కళ్లకు కట్టేలా బ్యాక్ గ్రౌండ్ వాల్ పోస్టర్లను అమర్చారు. తెలంగాణలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల సమాచారాన్ని కూడా పొందుపర్చారు. దేశంలోనే మూడో అతి పెద్ద మెట్రో నెట్ వర్క్, ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో విస్తరణ, దేశ విదేశీ ప్రయాణీకులకు అనువైన అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు కొత్తగా తలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్డుతో మెరుగైన రవాణా సదుపాయాలను ప్రస్తావించారు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఐఎస్ బీ, ఐఐఐటీ, నల్సార్ లాంటి ప్రముఖ విద్యా సంస్థలు ఉన్నాయని తెలిపారు. పెట్టుబడులకు ప్రజా ప్రభుత్వం అనుసరిస్తున్న సానుకూల విధానాలను కూడా పేర్కొన్నారు. చారిత్రకంగా, సాంస్కృతికంగా, వారసత్వంగా హైదరాబాద్ కు ఉన్న ప్రాధాన్యతలు, ఇక్కడి కళా సంపదను తెలియజేయడంతో పాటు గ్రేటర్ సిటీ అభివృద్ధికి ఉన్న భవిష్యత్తు లక్ష్యాలను వివరించారు. భద్రతతో పాటు తక్కువ జీవన వ్యయం ఉన్న నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ పెట్టుబడులకు గమ్య స్థానంగా నిలిచిందని పేర్కొన్నారు.
అధునాతనంగా ఫోర్త్ సిటీ
హైదరాబాద్ నగరం ఏర్పడినప్పటి నుంచి ఎదిగిన తీరును వివరిస్తూ చార్మినార్ తో పాటు సికింద్రాబాద్ క్లాక్ టవర్, హైటెక్ సిటీ.. అధునాతన ఫ్యూచర్ సిటీ నమూనాను కండ్లకు కట్టేలా తెలంగాణ పెవిలియన్ లో ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణ రైజింగ్–2050 లక్ష్యానికి అనుగుణంగా ఫ్యూచర్ సిటీ14 వేల ఎకరాల్లో విస్తరిస్తుందని, అందులో 6 వేల ఎకరాల్లో అటవీ పరిరక్షణకు ఎకో జోన్ ఉంటుందని తెలిపారు. ఇది దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో సిటీగా అభివృద్ధి చెందుతుందని భవిష్యత్తు విజన్‌ను ఆవిష్కరించారు.