తెలంగాణ పీసీసీకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు..హైకమాండ్​కు లిస్ట్​

 తెలంగాణ పీసీసీకి నలుగురు  వర్కింగ్  ప్రెసిడెంట్లు..హైకమాండ్​కు లిస్ట్​
  • హైకమాండ్​కు లిస్ట్​ పంపిన రాష్ట్ర నాయకత్వం 
  • చామల, బలరాం నాయక్ ఖరారు 
  • మూడో పోస్టు కోసం మాదిగ కోటాలో కవ్వంపల్లి,సంపత్ పేర్ల పరిశీలన
  • నాలుగో వర్కింగ్ ప్రెసిడెంట్రేసులో మహిళ..బీసీ కోటాలో సరిత, సునీత 
  • రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్న పీసీసీ చీఫ్​

హైదరాబాద్, వెలుగు: పీసీసీకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు రానున్నారు. ఇప్పటికే ఇద్దరి పేర్లు దాదాపు ఖరారు కాగా.. మరో రెండు పోస్టుల కోసం నాలుగు పేర్లను పార్టీ రాష్ట్ర నాయకత్వం హైకమాండ్ కు పంపించింది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ (ఆర్గనైజేషన్), మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ కు  వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు ఖాయమైనట్లు తెలిసింది. ఇక మూడో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం మాదిగ సామాజిక వర్గం నుంచి కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ పేర్లు పంపించగా, ఒకరిని హైకమాండ్ ఎంపిక​చేయనుంది. నాలుగో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కోసం బీసీ మహిళా నేతను ఎంపికచేయనున్నారు.

 ఈ పోస్టు కోసం గద్వాల జడ్పీ మాజీ చైర్ పర్సన్ సరితా యాదవ్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు పోటీ పడుతున్నారు. అలాగే, పీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరు ఖరారు అయిందని, ప్రకటనే ఆలస్యమనే ప్రచారం పార్టీ వర్గాల్లో సాగుతోంది. ఇక సీఎం రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా సన్నిహితుడు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి పేరు పీసీసీ ట్రెజరర్ పోస్టుకు ఖరారు అయినట్టు సమాచారం. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై ఆశలు పెట్టుకున్న ఈయనకు, చామల అడ్డుపడడంతో చివరికి సీఎం రేవంత్ ట్రెజరర్ పోస్టుతో రోహిన్ ను సంతృప్తిపరిచినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరో రెండు రోజుల్లో పీసీసీ కార్యవర్గంతో సంబంధం లేకుండా ముందుగానే నాలుగు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల ప్రకటన ఉంటుందని గాంధీ భవన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.  పీసీసీ కార్యవర్గం కసరత్తు పూర్తయినప్పటికీ, హైకమాండ్ ఆదేశం మేరకు తుది జాబితాలో కొన్ని మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నందున.. దానిని వచ్చే నెల మొదటి వారంలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. డీసీసీ అధ్యక్షుల నియామకం కూడా అప్పుడే ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. 

మహిళా నేతల మధ్య తీవ్ర పోటీ.. 

నాలుగో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కోసం ఇద్దరు మహిళా నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇటు మహిళ, అటు బీసీ కోటా కింద గద్వాల జడ్పీ మాజీ చైర్ పర్సన్ సరితా యాదవ్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు (ముదిరాజ్)లలో ఎవరిని ఫైనల్​చేస్తారోననే ఉత్కంఠ పార్టీ వర్గాల్లో నెలకొంది. సరితా యాదవ్ పేరును సీఎం రేవంత్ రెడ్డి సిఫారసు చేయగా,  సునీతా రావు పేరును ఢిల్లీ పెద్దలు సూచిస్తున్నట్లు సమాచారం. ఆరు నెలల కిందే మహిళా కాంగ్రెస్ చీఫ్ పోస్టు కోసం సరితా పేరును సిఫారసు చేస్తూ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ విభాగం నేషనల్​చీఫ్ అల్కా లంబాకు లేఖ పంపించారు. దీన్ని పసిగట్టిన సునీతా రావు తనకున్న పరిచయాలతో ఢిల్లీలో లాబీయింగ్ చేసి తన పదవిని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. దీంతో సరితకు కనీసం వర్కింగ్ పోస్టు ఇవ్వాలని రేవంత్ పట్టుబడుతుండగా, మహిళతో పాటు బీసీ కోటాలో ఈ పదవి తనకే ఇవ్వాలని సునీతారావు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. దీంతో సరిత, సునీతలలో ఈ పదవి ఎవరిని వరించనుందనేది ఆసక్తి రేపుతోంది.