మార్పులు చేర్పులతో పీసీసీ లిస్ట్ రెడీ

మార్పులు చేర్పులతో పీసీసీ లిస్ట్ రెడీ
  • హైకమాండ్ పరిశీలన, ఆమోదమే తరువాయి

హైదరాబాద్, వెలుగు: రేపు, మాపు అంటూ ఊరిస్తున్న పీసీసీ కార్యవర్గం ప్రకటన ఓ కొలి క్కి వచ్చింది. స్వల్ప మార్పులు, చేర్పులతో లిస్టును రెడీ చేసిన పీసీసీ నాయకత్వం రెండు రోజుల కిందట హైకమాండ్ ఆమోదం కోసం ఢిల్లీకి పంపించింది. హైకమాండ్ ఈ లిస్ట్ పరిశీలించి ఆమోదముద్ర వేయడమే ఆలస్యం, ప్రకటన ఉంటుందని గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. రెండు, మూడు రోజుల్లోనే పీసీసీ కార్యవర్గం ప్రకటన ఉంటుందని అంటున్నారు.

కార్యవర్గంలో నలుగురు వర్కింగ్ ప్రెసి డెంట్లు, ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున ఉపాధ్యక్షులు ఉంటారని తెలిసింది. కొన్ని జిల్లాల్లో రెండు చొప్పున కూడా పదవులకు అవకాశం ఇచ్చినట్లు సమాచారం. పూర్తి స్థాయి కార్యవర్గానికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

నాలుగు వర్కింగ్ పోస్టులకు ఎనిమిది మంది పేర్లను పీసీసీ పంపించింది. ఎస్సీ, ఎస్టీ, రెడ్డి, మైనార్టీ వర్గాలకు.. ఈ నాలుగు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు ఇవ్వాలని నిర్ణయించిన పీసీసీ, ఒక్కో సామాజికవర్గం నుంచి ఇద్దరి పేర్లతో లిస్టును ఢిల్లీకి పంపించింది. వీటితో పాటు 12 నుంచి 15 మంది వరకు ఉపాధ్యక్షులను కూడా ప్రక టించనున్నారు. ఉమ్మడి జిల్లాకు ఒక ఉపాధ్యక్ష పోస్టు దక్కేలా, కొన్ని జిల్లాల్లో సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకొని రెండు చొప్పున కేటాయించినట్లు సమాచారం.

 ప్రస్తు తానికైతే వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులతోనే పీసీసీ కార్యవర్గం ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి, పీసీసీ ట్రెజరర్ పోస్టులపై కూడా ఒక్కో పేరును పీసీసీ హైకమాండ్​కు సిఫారసు చేసినట్లు సమాచారం. మరి ఆ పోస్టులను కూడా కార్యవర్గంతో పాటే ప్రకటిస్తారా.. లేదా అనేది పూర్తిగా హైకమాండ్ నిర్ణయం.