
- ఏడాది క్రితం వరకు తెలంగాణ ప్రశాంతంగా ఉంది: హరీశ్ రావు
హైదరాబాద్, వెలుగు: ఏడాది క్రితం వరకు శాంతియుతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హింస, నేరాలు పెరుగుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని నార్యనాయక్ తండాలో బీఆర్ఎస్ నాయకులపై జరిగిన దాడే ఇందుకు నిదర్శనమని శనివారం ఎక్స్‌లో పేర్కొన్నారు.
కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుందని అప్పట్లో రేవంత్ చెప్పారని, ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులను ఉసిగొల్పుతూ నిజంగానే మార్పు తెచ్చారన్నారు. ఎమర్జెన్సీ పాలనను కొల్లాపూర్‌లో అమలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి జూపల్లి కృష్ణా రావు అనుచరుల దాడులు పెరుగుతున్నా.. పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారన్నారు. సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పనిచేస్తుంటే.. కాంగ్రెస్ నేతలకు జీర్ణం కావడం లేదన్నారు. ఇలాంటి దాడులకు భయపడబోమని తేల్చి చెప్పారు.