కుటుంబ పాలన అవినీతిపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి

జనగామ జిల్లా: తెలంగాణలో కుటుంబ పాలన అవినీతిపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని.. అందుకే మార్పు కోరుకుంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వరంగల్ జిల్లా పర్యటన కు వచ్చిన ఆయన జనగామ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. ఇవాళ  కేవలం భద్రకాళి అమ్మవారి దర్శనం కోసమే పర్యటిస్తున్నానని చెప్పారు. వరంగల్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సందర్శిస్తానని తెలిపారు.  తెలంగాణ ప్రజలు మార్పు రావాలని కోరుకుంటున్నారు.. అది దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనే కాకుండా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా వస్తుంది.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు జరుగుతున్నాయని వివరించారు. రానున్న రోజుల్లో  తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఉద్యమ కారుల ఆకాంక్షలను బీజేపీ నెరవేరుస్తుందన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వాన అద్భుతమైన పాలన అందిస్తోందని.. కావాలని పనికట్టుకుని కొన్ని  రాజకీయ  పార్టీలు రైతులను అయోమయానికి గురిచేస్తున్నాయని విమర్శించారు. రైతు వ్యవసాయ చట్టంలో  ఏ ఒక్క అంశం కూడా రైతులకు వ్యతిరేకంగా లేదన్నారు. దేశవ్యాప్తంగా పంజాబ్లో తప్ప ఏ రాష్ట్రంలో కూడా ఈ బిల్లును వ్యతిరేకించడం లేదన్నారు. శరద్ జోషి ,స్వామినాథన్, వ్యవసాయ శాస్త్ర వేత్తలు,మేధావులు వ్యవసాయ బిల్లుకు మద్దతు పలికారని చెప్పారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలకు ప్రజలతో  సంఘటితంగా ఉండి  ముందుకు సాగుతాం.. వరంగల్ పర్యటన అనంతరం దివంగత నేత నోముల నర్సింహయ్య కుటుంబాన్ని పరామర్శిస్తానని కిషన్ రెడ్డి తెలిపారు.