- రౌండ్ టేబుల్ సమావేశంలో లీడర్లు
ఖమ్మం టౌన్, వెలుగు : సిటీలోని కెమిస్ట్రీ అండ్ డ్రగ్ భవనంలో ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్న వారిపై ఉపా చట్టాన్ని ప్రయోగించడం దుర్మార్గమైన చర్య అని, అలాంటి చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల లీడర్లు మాట్లాడారు.
భారత్ భాచావో నాయకులు డాక్టర్ ఎం.ఎఫ్ గోపినాథ్, గాదె ఇన్నయ్య, జంజర్ల రమేశ్లపై పోలీసులు పెట్టిన ఉపా కేసును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులను ఎత్తివేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. ఉపా చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల లీడర్లకు పిలుపునిచ్చారు. ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధిస్తున్నారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో పాటు ప్రజాస్వామిక హక్కును ఏడవ గ్యారంటీగా అమలు చేయాలని సీసీఏ నాయకులు కోరారు. సమావేశంలో డాక్టర్ ఎం. ఎఫ్.గోపినాథ్, స్పర్శ భాస్కర్, సీపీఐ ప్రజాపంథా రాష్ట్ర నాయకులు ఆవుల అశోక్, సింగ్ నరసింహారావు, సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు వై.విక్రమ్, సామాజిక ఉద్యమకారులు గుంతేటి వీరభద్రం, టీపీజేఏసీ జిల్లా కన్వీనర్ దేవిరెడ్డి విజయ్, కో కన్వీనర్స్ టి.వేణు, డి.రమేశ్, సాహిత్య వేదిక పగిల్లపల్లి వెంకటేశ్వర్లు, టీపీటీఎఫ్ పూర్వపు రాష్ట్ర నాయకులు బాబురావు, జీవన్ కుమార్, పీడీఎస్ యూ రాష్ట్ర నాయకులు ఆజాద్, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్, మస్తాన్, దాసరి శ్రీను పాల్గొన్నారు.