గర్వించదగిన పత్రికలు నీలగిరి, తెనుగు

‘‘ఎటువెళ్తున్నామో స్పష్టత ఉండాలంటే.. ఏడ మొదలయ్యామో తెలియాలి’’ అంటాడు శివసాగర్​(కె.జి సత్యమూర్తి).

తెలుగు పత్రికా రంగ చరిత్రలో వందల సంఖ్యలో పత్రికలొచ్చాయి. ఇందులో కొన్ని మాత్రమే సమకాలీన చరిత్రకు అద్దంపడుతూ జనాన్ని జాగృతం చేశాయి.

తెలంగాణ ప్రాంతంలో తొలినాళ్లలో వచ్చిన నీలగిరి, తెనుగు పత్రికలు ఆ కోవకు చెందినవే.

వార్తా పత్రిక లక్షణాలతో తొలిసారిగా ఈ ప్రాంతంలో 1913లో హితబోధిని పత్రిక వెలువడగా, ఆ తర్వాత 1922 ఆగస్టు నెలలో తెలంగాణ ప్రజలు గర్వించదగిన నీలగిరి, తెనుగు పత్రికలు వచ్చాయి. ఈ రెండు పత్రికలు వెలువడి 2022 ఆగస్టుతో వందేండ్లు. ఇంటర్నెట్ కాదు కదా కనీసం ల్యాండ్ ఫోన్ కూడా అందుబాటులో లేని ఆ కాలంలో వివిధ ప్రాంతాల నుంచి వార్తలు సేకరించడం, ఒక్కో అక్షరాన్ని ఏర్చికూర్చి పత్రికను ప్రింట్ చేయడం, వాటిని పాఠకులకు చేర్చడం వ్యయ ప్రయాసలతో కూడిన వ్యవహారం. అందివచ్చిన టెక్నాలజీ, అందుబాటులో ఉన్న వనరులతో పీడీఎఫ్ పత్రికలు, ఈ పేపర్లు ఇబ్బడిముబ్బడిగా వెలువడుతున్న ఈ సోషల్ మీడియా యుగంలో ఆ కాలం నాటి పత్రికల గురించి, అప్పటి సంపాదకుల చిత్తశుద్ధి గురించి తెలుసుకోవడం అవసరం.

ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పత్రికల స్థాపన

1920వ దశకం నాటికి హితబోధిని పత్రిక ఒకటే బండారు శ్రీనివాస శర్మ సంపాదకత్వంలో వచ్చి ఆగిపోయింది. కొన్ని ఇతర పత్రికలు వెలువడినా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండేవి కావు. అప్పటి వరకు వచ్చిన పత్రికల లక్ష్యానికి భిన్నంగా 1922లో వచ్చిన పత్రికలు నీలగిరి, తెనుగు. 1921లో నిజాం రాష్ట్రాంధ్ర కేంద్ర జనసంఘం ఏర్పాటైన తర్వాత ఈ సంఘ కార్యకలాపాలను ప్రచారం చేసేందుకు, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఓ పత్రికను నడపాలని మాడపాటి హనుమంతరావు, వడ్లకొండ నరసింగరావు తదితరులు భావించారు. బ్రిటీషాంధ్ర ప్రాంతం నుంచి వచ్చే పత్రికలు నిజాం రాష్ట్ర వార్తలకు ప్రాధాన్యమిచ్చేవి కావు.

అందుకే నిజాం రాష్ట్రాంధ్ర జన సంఘం ఉద్యమ వార్తల ప్రచారానికి పత్రిక తక్షణావసరంగా మారింది. దీంతో మాడపాటి హనుమంతరావు, వడ్లకొండ నరసింగరావు సూచన మేరకు నల్లగొండ జిల్లాకు చెందిన షబ్నవీస్‌ వెంకటరామ నరసింహారావు పత్రిక స్థాపనకు ముందుకొచ్చారు. ఆయన తన జిల్లా నల్లగొండ పేరు మీదే ‘నీలగిరి’ని 1922 ఆగస్టు 24న వారపత్రికగా ప్రచురించారు. పత్రిక స్థాపనలో, పుస్తకాల ముద్రణలో నష్టాలు ఉన్నాయని తెలిసి కూడా వెంకటరామ నరిసింహారావు పత్రికను స్థాపించడం సాహసమే.

ఇనుగుర్తి నుంచి తెనుగు

నీలగిరి పత్రిక మొదలైన 3 రోజులకే తెలంగాణ పత్రికారంగ చరిత్రలో ఓ అద్భుత ఆవిష్కరణ జరిగింది. తెలంగాణలో పత్రికను ప్రారంభించడమే ఓ సాహసంగా చూసే ఆ రోజుల్లో వరంగల్‌ జిల్లా మానుకోట డివిజన్‌లోని మారుమూల అటవీ గ్రామమైన ఇనుగుర్తి నుంచి ‘తెనుగు’ పత్రిక వెలువడింది. ఒద్దిరాజు సోదరులుగా ప్రసిద్ధులైన ఈ పత్రిక సంపాదకులు ఒద్దిరాజు సీతారామచంద్రారావు, రాఘవరంగారావు అసాధారణ ప్రజ్ఞావంతులు. కాశీనాథుని నాగేశ్వర్‌రావు బొంబాయి నుంచి నడుపుతున్న ఆంధ్ర పత్రికతోపాటు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వీరింటికి వచ్చేవి. మద్రాస్‌ నుంచి ప్రింటింగ్ మిషన్ తీసుకొచ్చి ఓ పత్రికను స్థాపించాలని ఇద్దరు సోదరులు నిర్ణయించుకున్నారు.

మద్రాస్‌కు వెళ్లి కాశీనాథుని నాగేశ్వర్‌రావును,  బందర్​వెళ్లి ముట్నూరి కృష్ణారావును కలిసి సలహాలు అడిగారు. దేశంలో రాజకీయ, సాంఘిక చైతన్యం కలిగించడంలో పత్రికలకు మించిన సాధనం మరొకటి లేదని వారు హితబోధ చేశారు. నిజాం సర్కారు అనుమతితో ‘తెనుగు’ పత్రిక తొలిసంచికను1922, ఆగస్టు 27న ఆదివారం వెలువరించారు. పత్రిక మొదలయ్యాక పోస్టల్‌ డిపార్ట్ మెంట్‌ డైరెక్టర్‌తో మాట్లాడి గ్రామంలో పోస్టాఫీసు పెట్టించారు. వార్తలు, వ్యాసాలు రాసేవారు, చందాదారులను చేర్పించేవారు. ఈ పత్రిక మొదటి ఏడాది ప్రతివారం 500,  రెండో ఏడాదిలో 1000 ప్రతుల వరకు ముద్రించారు. ఇలా తెనుగు పత్రిక ఆరు సంవత్సరాలు ఇనుగుర్తి నుంచి వెలువడి తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ చైతన్యానికి ఎంతగానో కృషి చేసింది. 

పత్రికలో పలువురి రచనలు

తెనుగు పత్రికలో శేషాద్రి రమణ కవులు, హరిబాపయ్య, పంగనామముల రామచంద్రరావు, రాయప్రోలు సుబ్బారావు, దేవులపల్లి వేంకటచలపతిరావు, నామపల్లి కృష్ణారావు, చకిలం శ్రీనివాస శర్మ, బి.వెంకటరామరాజు హరిదాసులతోపాటు చాట్రాతీ లక్ష్మీనరసమాంబ, పందింటి సత్యవతీబాయి, పాపమ్మలాంటి మహిళల రచనలు కూడా అచ్చయ్యేవి. తగినన్ని వనరులు, పత్రికల పంపిణీకి సరైన రవాణా సౌకర్యాలు లేకపోయినా మూడు, నాలుగేండ్లు నిర్విఘ్నంగా పత్రికలను నడిపిన షబ్నవీస్‌ వెంకటరామ నరసింహారావు, ఒద్దిరాజు సోదరుల స్ఫూర్తి ఈ తరానికి కూడా ఆదర్శం. 

- డాక్టర్ నుగ్గునూతుల యాకయ్య