తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విన్యాసాలు చూస్తున్న ప్రజలు ఇక భరించే స్థితిలో లేనట్లు స్పష్టమౌతున్నది. గత ఐదేండ్లలో జరిగిన పరిణామాలను బీఆర్ఎస్ వీరాభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. దళితులకు సీఎం పదవి ఆశచూపి దగా చేయటం, సబ్-ప్లాన్, ప్రత్యేక అభివృద్ధి నిధుల దారి మళ్లింపుతో దళితులు బీఆర్ఎస్ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. షెడ్యూల్ తెగల వారికిచ్చిన హామీలు నీటిమూటలుగా మారాయి. ఇక బీసీ వర్గాలను గొర్రెలు, బర్రెలు, చేపల పంపిణీ పేరిట 1975 నాటి స్థితిలో ఉంచటానికి చేసిన తమాషా అభాసుపాలైంది.
నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం
విద్యార్థులకు, నిరుద్యోగులకు కేసీఆర్ సర్కారు చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. ఉద్యోగాల భర్తీపట్ల ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ చూపిన నిర్లక్ష్యం గర్హనీయం. పేపర్ లీకులతో నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న తీరుపై సర్వత్రా తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. 2014, 2018లో బీఆర్ఎస్ విజయానికి యువత వెన్నుదన్నుగా నిలిచింది. అయితే యువత ఆశలను ప్రభుత్వం నెరవేర్చడంలో విఫలమైంది. కాగా, వ్యవసాయ విధానాల్లోనూ నిలకడ లేకపోవటం రైతన్నలను కలవరపరిచింది. సన్నాలు పండించాలని ఒకసారి, వద్దని మరోసారి అన్నదాతలను అయోమయానికి గురిచేసింది. పత్తి, పప్పు దినుసులు, చిరు ధాన్యాల సాగు విషయంలోనూ అస్పష్టత, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో అలసత్వంతో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కొంతమంది రైతులు కళ్లాల వద్దే ప్రాణాలు విడిచారు. వందల ఎకరాలు ఉన్నవాళ్లకు, ఎన్ఆర్ఐలకు రైతుబంధు ఇచ్చి ప్రజాధనాన్ని కేసీఆర్ ప్రభుత్వం వృథా చేసింది.
కౌలురైతులను గుర్తించని ప్రభుత్వం
పంటల బీమా అమలు చేయాలని రైతాంగం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో తక్షణ సహాయం అందక రైతులు విలవిలలాడిపోయారు. ఇక కౌలు రైతులను గుర్తించటానికి కూడా ప్రభుత్వం ఇష్టపడలేదు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్లో కౌలుదారులే అధికసంఖ్యలో ఉండటం శోచనీయం. ధరణితో అవస్థల పాలైన కుటుంబాలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేట్టు తిరుగుతున్నా న్యాయం దొరకటం లేదు. బదిలీలు, పదోన్నతులు, రెగ్యులరైజేషన్ జరగక, సకాలంలో జీతాలు రాక ఉద్యోగులు కూడా ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ప్రయివేట్ విద్యకు పెద్దపీట వేయడాన్ని విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు, పౌర సమాజం తీవ్రంగా నిరసిస్తున్నాయి. కట్టలు తెంచుకొని విస్తరించిన అవినీతి క్రింది నుంచి పై స్థాయి దాకా వేళ్లూనుకున్నది.
ప్రాజెక్టుల అవినీతికి కాళేశ్వరమే సాక్ష్యం
ప్రాజెక్టుల పేరుతో జరిగిన అవినీతికి కాళేశ్వరం సజీవ సాక్ష్యం. మేడిగడ్డ, సుందిళ్ల, -అన్నారం వద్ద లీకులు, కుంగిపోవటం వెనుక ఎన్ని వేల కోట్ల ప్రజా ధనం చేతులు మారిందో సమగ్ర విచారణ జరిగితేగాని వెల్లడి కాదు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కుంగిన పిల్లర్లు రిపేర్ చేయటం వీలుకాదని మొత్తంగా పునాదుల నుంచి పున:నిర్మాణం చేయాలనీ 'డ్యాం సేఫ్టీ కమిటీ' ఇచ్చిన నివేదిక ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసింది. ప్రతి పథకంలోనూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వాటాలు కొల్లగొట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దళితబంధు పథకంపై సమీక్ష సమయంలో ఈ రహస్యం బట్టబయలైంది. ముఖ్యమంత్రే స్వయంగా అవినీతిని అంగీకరించినా మళ్ళీ వారినే ఎన్నికలలో అభ్యర్థులుగా నిలబెట్టడాన్ని ప్రజలు సహించలేకపోతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత మౌత్ టాక్తో దావానలంలా వ్యాపిస్తున్నది. మార్పు రావాలని కోరుకుంటున్న ప్రజలతో పౌర సంఘాలు మమేకమై ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేస్తున్నాయి. మార్పు తప్పదని సర్వేలు సైతం వెల్లడిస్తున్నాయి. నియంతృత్వ పాలనా విధానాలకు చరమ గీతం పాడే సమయం వచ్చింది. సామాజిక తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ పాలనలో మనమూ భాగస్వాములమవుదాం.
- మరింగంటి యాదగిరాచార్యులు,రిటైర్డ్ ప్రొఫెసర్