ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నరు : మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్

కరీంనగర్ టౌన్,వెలుగు: టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలతో విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ జోస్యం చెప్పారు. శనివారం స్థానిక డీసీసీ ఆఫీస్ లో నిర్వహించిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో డీసీసీప్రెసిడెంట్ కె.సత్యనారాయణ తో కలిసి మాట్లాడారు. జనవరి 26 నుంచి  రాష్ట్రంలో ప్రారంభం కానున్న హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ లోని అంతర్గత కలహాలను భూతద్దంలో చూపిస్తున్నారని ఆరోపించారు. మేడ్చల్ జిల్లాలో మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా నలుగురు ఎమ్మెల్యేలు సమావేశమైనా, కరీంనగర్ జిల్లాలో బీజేపీ స్టేట్ చీఫ్​ కు వ్యతిరేకంగా మాజీ జిల్లా అధ్యక్షులు సమావేశాలు నిర్వహించినా పట్టించుకోకుండా పనిగట్టుకుని కాంగ్రెస్ పై విమర్శించడం దారుణమన్నారు. సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లేశం, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


తెలంగాణ కోసం ఐక్యంగా పోరాడాలి  

జగిత్యాల: కాంగ్రెస్ అధికారంలోకి రావడం చారిత్రాత్మక ఆవశ్యకమని, తెలంగాణ భవిషత్ కోసం ఐక్యంగా పోరాడాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం జగిత్యాలలోని ఓ ఫంక్షన్ హాల్ లో పీసీసీ జిల్లా ప్రెసిడెంట్ లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన హాత్ సే హాత్ జోడో అభియాన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే కాంగ్రెస్ పాలనలో క్వింటాల్ వరిధాన్యానికి రు.2,500 ఇస్తామని హామీ ఇచ్చారు. రూ.2,500 పింఛన్, కేజీ టూ పీజీ అమలు చేసే విధానాన్ని ఎన్నికల మేనిఫేస్టోలో ప్రకటిస్తామన్నారు.  జగిత్యాల, ధర్మపురి, చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల్లో జనవరి 26 నుంచి జోడో యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో పీసీసీ సభ్యులు గిరి నాగభుషణం, నందయ్య  పాల్గొన్నారు. 

అందరి విశ్వాసాలను  గౌరవించాలి : ఎమ్మెల్యే రాజేందర్​ 

హుజూరాబాద్​ వెలుగు: అందరి సంప్రదాయాలు, నమ్మకాలు, విశ్వాసాలను గౌరవించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. శనివారం స్థానిక క్యాంపు ఆఫీస్​లో నిర్వహించిన నియోజకవర్గ పాస్టర్ల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. అందరి ప్రేమ అభిమానాలతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానన్నారు. నియోజకవర్గంలో ప్రశాంతతను చెడకొట్టే ప్రయత్నాలు చేసే వారికి ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు. అనంతరం కేక్​కట్​చేశారు. కార్యక్రమంలో ఐదు మండలాలకు చెందిన పాస్టర్లు, నాయకులు పాల్గొన్నారు. 

నగరాన్ని క్రీడా హబ్‌గా తీర్చిదిద్దుతాం : మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్ టౌన్,వెలుగు: పట్టణాన్ని క్రీడా హబ్‌ గా తీర్చిదిద్దుకుందామని బీసీ,సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం స్థానిక అంబేద్కర్ స్టేడియంలో మార్వాడి మంచ్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ పోటీల్లో మంత్రి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో అంతర్జాతీయ స్థాయిలో మైదానాలు సిద్ధమవుతున్నాయన్నారు. భవిష్యత్​లో నిత్యం ఏదో ఒక క్రీడా టోర్నీతో పట్టణం కళకళలాడుతుందన్నారు. త్వరలో కరీంనగర్‌ క్రికెట్‌ అభిమానులకు తీపి కబురు చెబుతానని మంత్రి అన్నారు. లోయర్‌ మానేరు డ్యాం సమీపంలోని 12 ఎకరాల స్థలంలో క్రికెట్ స్టేడియం నిర్మించుకుందామని తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహకులు రూపక్, విజయ్, నిఖిల్, మన్మోహన్, ఆశీష్, విమల్, నిర్మల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ వ్యాఖ్యలు అర్ధరహితం : ఎమ్మెల్యే సంజయ్ కుమార్ 

జగిత్యాల, వెలుగు : రైతాంగ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలు అర్ధరహితమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు కట్టిన పన్నులలో 40 శాతం రాష్ట్రానికి తిరిగి ఇవ్వాల్సి ఉండగా అసంపూర్తిగా ఇస్తూ కేంద్రం ఇబ్బంది పెడుతోందన్నారు. బీఆర్ఎస్ నాయకుల నిరసనలపై ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రైతులు, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడడం సరైంది కాదని, విశేష అనుభవం ఉన్న జీవన్ రెడ్డి వ్యాఖ్యలు బాధాకరమన్నారు. సమావేశంలో మాజీ జెడ్పీటీసీ ఎల్లారెడ్డి, మండల రైతుబంధు సమితి కన్వీనర్ రవీందర్ రెడ్డి, కౌన్సిలర్ నారాయణ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

‘ధర్నాల పేరుతో  బీఆర్ఎస్​ డ్రామా’ 

కోరుట్ల,వెలుగు: రైతుల కల్లాలకు నిధులు ఇవ్వడం లేదంటూ జగిత్యాల జిల్లా కేంద్రంలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఆ పార్టీ లీడర్లతో ధర్నా చేయించి కొత్త డ్రామాకు తెర తీశారని కాంగ్రెస్ సీనియర్​లీడర్​జువ్వాడి కృష్ణారావు ఆరోపించారు. శనివారం కోరుట్లలో ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ ఎమ్మెల్యేగా ప్రభుత్వం ద్వారా పనులు చేయించాలని, కానీ దానికి భిన్నంగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారన్నారు. ఆరేళ్లలో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ముందు ఎమ్మెల్యే ఎందుకు ధర్నా నిర్వహించలేదని ప్రశ్నించారు. నిజామాబాద్​ఎంపీ అరవింద్​ప్రత్యేక పసుపు బోర్డు తీసుకొస్తానని,  షుగర్ ఫ్యాక్టరీని సొంత నిధులతో నిర్వహిస్తానని చెప్పి బాండు కాగితం ద్వారా ప్రజలకు హామీ ఇచ్చి మోసం చేశారని కృష్ణారావు తెలిపారు.