తలసరి ఆదాయంలో రంగారెడ్డి టాప్​.. వికారాబాద్ లాస్ట్​..

తలసరి ఆదాయంలో రంగారెడ్డి టాప్​..  వికారాబాద్ లాస్ట్​..
  • 2024-25లో పర్​క్యాపిటాఇన్​కం 3.80 లక్షలు
  • నిరుడితో పోలిస్తే 9.6 శాతం పెరుగుదల
  • రూ.16 లక్షల కోట్లకు జీఎస్​డీపీ..10.1 శాతం వృద్ధి రేటు
  • జిల్లాల నడుమ కొనసాగుతున్న అంతరాలు
  • హైదరాబాద్​, చుట్టు పక్కల జిల్లాల్లోనే అభివృద్ధి
  • సోషియో ఎకనామిక్​ సర్వేలో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రతలసరి ఆదాయం రూ.4 లక్షల దిశగా దూసుకెళ్తున్నది. 2024–25 సంవత్సరంలో 3.80 లక్షలకు చేరింది.  నిరుడు పర్​ క్యాపిటా ఇన్​కం రూ.3,46,457 తో పోల్చినప్పుడు  ఈసారి రూ.32,452 పెరిగి, 9.6% వృద్ధి రేటు నమోదు చేసింది. దేశ తలసరి ఆదాయం రూ.2,05,579 కన్నా ఇది 1.8 రెట్లు ఎక్కువ. కాగా,  తలసరి ఆదాయంలో రంగారెడ్డి, హైదరాబాద్​మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా, వికారాబాద్ చిట్టచివరన నిలిచింది. 

ఈ సారి హనుమకొండ, వికారాబాద్​తప్ప మిగిలిన జిల్లాలన్నింటి తలసరి ఆదాయం 2 లక్షల మార్క్​ దాటడం విశేషం. 2024--–25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ జీఎస్డీపీ (గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్) రూ.16 లక్షల12 వేల 579 కోట్లకు చేరింది. గతేడాది  రూ.14,64,378 లక్షల కోట్లతో పోల్చినప్పుడు 10.1శాతం వృద్ధి రేటు నమోదైంది. దేశ వృద్ధి రేటు(9.9)తో పోలిస్తే ఇది 0.2 ఎక్కువ కావడం విశేషం.  

జీఎస్డీపీలో జిల్లాల కంట్రిబ్యూషన్​లో తేడా

దేశ జీడీపీలో తెలంగాణ వాటా ఈ ఏడాది 4.9 శాతం కాగా, అంతకుముందు రెండేండ్లలో వరుసగా 5, 4.8, 4.9 శాతంగా ఉంది. ఈ లెక్కన నిరుడితో పోలిస్తే జీడీపీలో తెలంగాణ వాటా స్వల్పంగా 0.1 శాతం తగ్గింది.  మరోవైపు తెలంగాణ జీఎస్డీపీ కి జిల్లాల నుంచి కంట్రిబ్యూషన్ లో చాలా తేడా కనిపిస్తున్నది. 

ఐటీ, ఫార్మా, నిర్మాణ, తదితర రంగాలతో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్​గిరి, సంగారెడ్డి, నల్గొండ లాంటి జిల్లాల్లో జీడీడీపీ (గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్) ఎక్కువగా ఉంటే పారిశ్రామికంగా వెనుకబడి, వ్యవసాయం తప్ప మరే ఇతర ఆదాయ వనరులు పెద్దగా లేని ములుగు, జయశంకర్​ భూపాలపల్లి,  కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, నారాయణపేట లాంటి జిల్లాల్లో జీడీడీపీ అతి తక్కువ గా ఉంది. 

ఐటీ, ఫార్మా, ఇతర పరిశ్రమలన్నీ హైదరాబాద్, దాని చుట్టు పక్కల జిల్లాల్లోనే ఏర్పాటుకావడం, ఇక్కడే రియల్ ఎస్టేట్, సేవా రంగం కూడా విస్తరించడమే ఇందుకు కారణమంటున్నారు. మిగిలిన జిల్లాల్లో ఐటీ, ఇతర పరిశ్రమల ఏర్పాటును ప్రభుత్వాలు ప్రోత్సహించకపోవడంతో కొన్ని జిల్లాలు ఆర్థికంగా వెనుకబడుతున్నాయి. ఫలితంగా ఆయా జిల్లాల నుంచి హైదరాబాద్​కు ఉపాధి కోసం వలసలు పెరుగుతున్నాయి.

తలసరి ఆదాయంలో రంగారెడ్డి టాప్​..  వికారాబాద్ లాస్ట్​.. 

2024–--25 సంవత్సరానికి తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా రూ. 10 లక్షల55 వేల913తో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవగా..  వికారాబాద్ జిల్లా రూ. 1,98,401తో చివరి స్థానంలో ఉంది.  తలసరి ఆదాయంలోనూ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్​లాంటి జిల్లాలు​ మొదటి నాలుగు స్థానాల్లో ఉండగా, నారాయణపేట, మహబూబాబాద్​లాంటి జిల్లాలు అట్టడుగున నిలిచాయి. 

కాగా, 2014–-15లో 1.24 లక్షలుగా ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం పదేండ్లలో రూ.3.80 లక్షలకు పెరిగింది. అదే సమయంలో పదేండ్ల కింద 2014–-15లో రూ.72,658 కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పులు ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి 7 లక్షల38 వేల 707 కోట్లకు చేరాయి. అంటే తలసరి ఆదాయం 305 శాతం పెరిగితే రాష్ట్ర అప్పులు మాత్రం ఏకంగా వెయ్యి రెట్లు పెరగడం గమనార్హం.  అంటే రాష్ట్ర అప్పులు పెరిగిన 
నిష్పత్తిలో తలసరి ఆదాయం పెరగడం లేదని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 


అతి ఎక్కువ తలసరి ఆదాయం కలిగిన 5 జిల్లాలు

  • జిల్లా    తలసరి  ఆదాయం
  • రంగారెడ్డి     10,55,913
  • హైదరాబాద్​     5,54,105
  • సంగారెడ్డి     3,45,478
  • మేడ్చల్​– మల్కాజ్​గిరి    3,43,130
  • భద్రాద్రి కొత్తగూడెం    3,21,281

అతి తక్కువ తలసరి ఆదాయం కలిగిన 5 జిల్లాలు

  • జిల్లా    తలసరి ఆదాయం
  • వికారాబాద్    1,98,401
  • హనుమకొండ    1,99,490 
  • జగిత్యాల    2,05,273 
  • నారాయణపేట    2,07,784 
  • మహబూబాబాద్​    2,12,232 

2023-24 సంవత్సరానికి  జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)

ప్రస్తుత ధరల వద్ద జిల్లా    జీడీడీపీ

  • రంగారెడ్డి    రూ.3,17,898 కోట్లు
  • హైదరాబాద్​     రూ.2,57,949 కోట్లు
  • మేడ్చల్​ మల్కాజిగిరి    రూ.1,04,710కోట్లు
  • సంగారెడ్డి    రూ.65,190 కోట్లు
  • నల్గొండ    రూ.53,771 కోట్లు

అతి తక్కువ జీడీడీపీ జిల్లాలు

  • ములుగు     రూ. 8,873 కోట్లు
  • భూపాలపల్లి    రూ. 12,932 కోట్లు
  • కుమ్రంభీమ్​    రూ.13,700 కోట్లు
  • నారాయణపేట    రూ.13,818 కోట్లు
  • రాజన్న సిరిసిల్ల    రూ. 13,981 కోట్లు