
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పోలీసులు హైకోర్టులో సవాల్ చేశారు. ఆ ఉత్తర్వులను సవరించాలంటూ పిటిషన్ వేశారు. లంచ్ మోషన్ రూపంలో విచారించాలని పీపీ పల్లె నాగేశ్వర్‌రావు గురువారం హైకోర్టును కోరారు. ట్రయల్ కోర్టులో నిందితుల(ఏ–4, ఏ–5) కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారని, ఒకవేళ పిటిషన్‌కు అనుమతిస్తే ధిక్కరణ చర్యల కిందకు వస్తుందన్నారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ కింది కోర్టు నిందితులను పోలీసుల కస్టడీకి ఇవ్వలేదని, మధ్యంతర పిటిషన్‌ను శుక్రవారం విచారిస్తామని పేర్కొన్నారు.