న్యూఢిల్లీ: తెలంగాణ యంగ్ క్రికెటర్లు గొంగడి త్రిష, కేసరి ధృతి ప్రతిష్టాత్మక అండర్–19 విమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో పోటీపడే ఇండియాకు ఎంపికయ్యారు. త్రిష వరుసగా రెండోసారి ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగనుండగా.. ధృతి తొలిసారి చోటు దక్కించుకుంది. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు కౌలాలంపూర్‌లో జరిగే ఈ మెగా టోర్నీ కోసం ఇండియా టీమ్‌ను బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. మొత్తం 15 మందితో కూడిన ఈ టీమ్‌లో టాపార్డర్ బ్యాటర్ త్రిష, ఆఫ్ స్పిన్నర్ ధృతితో పాటు మరో తెలుగమ్మాయి ఎండీ షబ్నం (వైజాగ్) కూడా ఉంది.
గత ఎడిషన్‌లో విజేతగా నిలిచిన టీమ్‌లో మెంబర్ అయిన త్రిష ఈ మధ్యే అండర్19 ఆసియా కప్‌లో ఇండియా విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించింది. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డులు గెలిచింది. హెచ్‌సీఏ తరఫున నిలకడగా ఆడుతున్న మరో హైదరాబాదీ ధృతి ఆసియాక ప్‌లో రెండు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగింది. కాగా, ఆసియా కప్‌లో టీమ్‌ను నడిపించిన నిక్కీ ప్రసాద్‌కే కెప్టెన్సీ అప్పగించగా.. వైస్ కెప్టెన్‌గా సానికా చల్కే ఎంపికయ్యారు. ఈ టోర్నీలో 16 జట్లు నాలుగు గ్రూపుల్లో పోటీ పడనున్నాయి.
గ్రూప్–ఎలో డిఫెండింగ్ చాంపియన్ ఇండియా, మలేసియా, వెస్టిండీస్, శ్రీలంక ఉన్నాయి. జనవరి 19న వెస్టిండీస్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో ఇండియా టోర్నీని ఆరంభిస్తుంది. 21, 23న మలేసియా, శ్రీలంకతో తలపడనుంది. ప్రతి గ్రూప్‌లోని టాప్–3 జట్లు సూపర్–6 స్టేజ్‌కు అర్హత సాధిస్తాయి. కాగా, వరల్డ్ కప్‌కు ఎంపికైన త్రిష, ధృతిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. టోర్నీలో ఇద్దరూ మంచి ప్రతిభ కనబరచాలని
ఆకాక్షించారు.
ఇండియా జట్టు: నిక్కీ ప్రసాద్ (కెప్టెన్), సానికా చల్కే (వైస్ కెప్టెన్), గొంగడి త్రిష, కేసరి ధృతి, కమిలిని, భవిక, అవసారె, మిథిల, జోషిత, సోనమ్, పర్ణిక, ఆయుషి శుక్లా, ఆనందిత, షబ్నం, వైష్ణవి.
స్టాండ్ బై ప్లేయర్లు: నంద. ఐరా, అనధి.