దేశాభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర: కేంద్రమంత్రి రాజ్‎నాథ్ సింగ్

దేశాభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర: కేంద్రమంత్రి రాజ్‎నాథ్ సింగ్


రాజకీయాలు వేరు దేశ భద్రత వేరని.. దేశ భద్రత విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. దామగుండంలో నిర్మించనున్న నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కృషి అభినందనీయమని కొనియాడారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండంలో ఏర్పాటు చేయనున్నవెరీ లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్‌కు శంకు స్థాపన కార్యక్రమానికి రాజ్ నాథ్ సింగ్ చీఫ్ గెస్ట్‎గా హాజరయ్యారు. నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రక్షణ రంగ పరికరాల తయారీలో హైదరాబాద్‎కు మంచి పేరు ఉందని.. దేశాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం కీలకంగా మారిందని అన్నారు. 

కమ్యూనికేషన్ విషయంలో దామగుండం రాడార్ స్టేషన్‎ ప్రముఖ పాత్ర పోషిస్తోందని తెలిపారు.  దేశ రక్షణలో వీఎల్ఎఫ్ స్టేషన్‏తో అనేక విధాలుగా ప్రయోజనం ఉంటుందని చెప్పారు. కమ్యూనికేషన్ విషయంలో భవిష్యత్ దిశగా అడుగులు వేయాలని.. సాంకేతిక యుగంలో కమ్యూనికేషన్ అనేక రకాలుగా ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం జయంతి నాడు నేవీ రాడార్ స్టేషన్‎కు హైదరాబాద్‎లో భూమి పూజ చేయడం సంతోషంగా ఉందన్నారు. దేశ కమ్యూనికేషన్ వ్యవస్థ పటిష్టంగా ఉందని.. దానిని మరింత స్ట్రాంగ్‎గా చేసుకోవడం అనివార్యమన్నారు.

త్రివిధ దళాల్లో అత్యాధునికి టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని తెలిపారు. గత పదేళ్లలో ఇండో  ఫసిఫిక్ బెల్టులో సవాళ్లు పెరిగాయని.. సముద్ర ఖనిజ సంపదపై అన్ని దేశాలు దృష్టి పెట్టాయన్నారు. సముద్రాలపై ఆధిపత్యం సాధిస్తేనే దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందన్న రాజ్‎ నాథ్ సింగ్. సముద్రాలపై ఆధిపత్యం ఆంగ్లేయుల విస్తరణకు ఎంతగానో ఉపయోగపడిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, స్పీకర్ గడ్డం ప్రసాద్, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, అధికారులు తదితరులు పాల్గొన్నారు.