ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

కరీంనగర్ టౌన్,వెలుగు: ప్రజా కవి కాళోజీని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు సేవ చేయాలని కలెక్టర్ ఆర్వి కర్ణన్ అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, ట్రైనీ కలెక్టర్ లెనిన్ తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని కొత్తపల్లి ప్యారడైజ్, వావిలాలపల్లి శ్రీ చైతన్య స్కూల్, రేకుర్తిలో శుక్రవారం నిర్వహించారు. రేకుర్తి కాళోజీ నగర్​లో ఏర్పాటుచేసిన విగ్రహానికి నగర మేయర్ సునీల్​రావు, కార్పొరేటర్లు మాధవి- కృష్ణగౌడ్​, రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ ఇస్లావత్, మాజీ ఎంపీపీ రమేశ్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, కౌన్సిలర్లు నివాళులర్పించారు. కొత్తపల్లి ప్యారడైజ్​, సెయింట్ జార్జ్ స్కూళ్లలో తెలంగాణ భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. శ్రీ చైతన్య స్కూల్​లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ రవీందర్​రెడ్డి తెలుగు భాష గొప్పతనాన్ని వివరించారు. పారడైజ్ స్కూల్స్​ అధినేత ఫాతిమారెడ్డి, శ్రీచైతన్య స్కూల్ చైర్మన్ మల్లంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, డీజీఎం లక్ష్మణరావు, రీజినల్ ఇన్​చార్జి రాజు,  కో ఆర్డినేటర్ ప్రవీణ్, డీన్ శ్రీధర్ పాల్గొన్నారు.    

బై బై గణేశా..!

వెలుగు, నెట్​వర్క్: ఉమ్మడి కరీంనగర్​జిల్లావ్యాప్తంగా శుక్రవారం వినాయక నిమజ్జన ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. మానకొండూర్, చింతకుంట, కొత్తపల్లి చెరువుల వద్ద  కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు. మినిస్టర్​గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు పాతబజార్ లో లంబోదరుడికి ప్రత్యేక పూజలు చేశారు. కరీంనగర్​చైతన్యపురిలోని మహాశక్తి టెంపుల్ లో ఏర్పాటు చేసిన వినాయకుడికి బీజేపీ స్టేట్ చీఫ్​బండి సంజయ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జరిగిన నిమజ్జన కార్యక్రమంలో మంత్రి, ఎంపీ షేక్​ హ్యాండ్​ఇచ్చుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కరీంనగర్​కలెక్టరేట్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన గణేశ్​విగ్రహనికి కలెక్టర్ కర్ణన్ పూజలు నిర్వహించారు. అల్ఫోర్స్ సెంట్రల్ ఆఫీస్ లో చైర్మన్ వి.నరేందర్ రెడ్డి, భగవతి స్కూల్ లో చైర్మన్ రమణారావు, డైరెక్టర్ విజయలక్ష్మి ఉత్పవాల్లో పాల్గొన్నారు. జగిత్యాల మినీ ట్యాంక్ బాండ్ చింతకుంట చెరువు వద్ద నిమజ్జనంలో ఎస్పీ సింధుశర్మ, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి పాల్గొన్నారు. కొత్తపల్లి చెరువు వద్ద కలెక్టర్​కర్ణన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాలతో భారీ వానతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెద్దపల్లి మినీ ట్యాంక్​బండ్​లో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నిమజ్జనం చేశారు.  సిరిసిల్లలోని మానేరు నది వద్ద కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ ఏర్పాట్లు పరిశీలించారు.

డెంగీ టెస్టులు పెంచాలి

కోనరావుపేట,వెలుగు : ప్రజలు డెంగీ జ్వరం వస్తే భయపడొద్దని, లక్షణాలు ఉన్నవారికి వెంటనే పరీక్షల నిర్వహించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఏఎన్ఎం లకు సూచించారు. శుక్రవారం కోనారావుపేట ప్రైమరీ హెల్త్​సెంటర్​ను  ఆయన సందర్శించారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. సాధ్యమైనంత ఎక్కువ మందికి డెంగీ పరీక్షలు చేయాలన్నారు. టీబీ కేసులను గుర్తించేందుకు ఇంటింటా సర్వే చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు, జిల్లా డిప్యూటీ వైద్యాధికారి రజిత సిబ్బంది 
పాల్గొన్నారు. 

బండిని కలిసిన మండల నాయకులు

వీర్నపల్లి, వెలుగు: బీజేపీ స్టేట్​చీఫ్​బండి సంజయ్ కుమార్ ను వీర్నపల్లి మండల బీజేపీ లీడర్లు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీర్నపల్లి మండలాధ్యక్షుడు దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కొత్త మండలంలో ఇప్పటి వరకు గవర్నమెంట్​ఆఫీస్​ల నిర్మాణం జరగలేదని ఎంపీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. మండలంలో పర్యటించి ఎంపీ నిధుల ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. ఎంపీని కలిసినవారిలో  లీడర్లు బోడ మల్లేశం, కంచర్ల పర్శరాములు, లాకవతు రాజు తదితరులు ఉన్నారు.

కస్తూర్బా స్కూల్లో డీఈఓ తనిఖీ

ఇల్లందకుంట, వెలుగు : జమ్మికుంట మండలం కొత్తపల్లిలోని అద్దె భవనంలో నిర్వహిస్తున్న ఇల్లందకుంట మండల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని డీఈఓ జనార్దన్ రావు శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్కూల్లోని విద్యార్థుల సంఖ్య, సరుకుల రవాణా, బిల్లుల చెల్లింపులు, భోజన సదుపాయాలను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల నివారణకు చేపట్టిన ముందస్తు చర్యలు, అందుబాటులో వున్న మందులపై ఏఎన్ఎంలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జిల్లా కో ఆర్డినేటర్ కృపారాణి, స్కూల్ ఎస్ఓ రమాదేవి వున్నారు.

గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు

కరీంనగర్ సిటీ(మానకొండూరు), వెలుగు: గర్భిణులకు పీహెచ్ సీల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆశాలు, ఏఎన్ఎంలు ఆరోగ్య సూచనలు చెప్పాలని కరీంనగర్​కలెక్టర్ కర్ణన్ అన్నారు. శుక్రవారం మానకొండూర్ పీహెచ్​సీ ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్లు సాధారణ ప్రసవాలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలన్నారు. కేసీఆర్​కిట్ వెబ్ సైట్ లో గర్భిణుల వివరాలను నమోదు చేయాలని తెలిపారు. అనంతరం హాస్పిటల్ లో అందిస్తున్న వైద్యసేవలు, మందులు,  ప్రసూతి గదిని పరిశీలించారు. గదులు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఆయన వెంట అడిషనల్​కలెక్టర్, ట్రైనీ కలెక్టర్, ఎంపీడీఓ దివ్యదర్శన్ ఉన్నారు.    

సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల సమ్మె

గోదావరిఖని, వెలుగు : సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఇచ్చిన నిరవధిక పిలుపులో భాగంగా రామగుండం రీజియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మూడు డివిజన్లలో శుక్రవారం నుంచి సమ్మె మొదలైంది. మొదటి రోజు సమ్మెలో మెజార్టీ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్జీ 1 పరిధిలోని గోదావరిఖనిలో నిరసన ర్యాలీలో జేఏసీ లీడర్లు కడారి సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వేల్పుల కుమారస్వామి, తోకల రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కె.విశ్వనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చిటికెల రాజలింగు, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జీఎం ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముందు ధర్నాలో మడ్డి ఎల్లా గౌడ్, గోసిక మోహన్, తాళ్ళపల్లి మల్లయ్య, గెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద ఐఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీయూసీ ఆధ్వర్యంలో పూసాల తిరుపతి, టి.పవన్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విశాల్, సంపత్, ఆర్జీ 2, ఆర్జీ 3 డివిజన్లలో జేఏసీ లీడర్లు ఏ.వెంకన్న, వైవి రావు, బుర్ర తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2013 నుంచి రావలసిన హైపర్ కమిటీ వేతనాలను అమలు చేయలేదని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఖాతరు చేయడం లేదన్నారు. 

గెలుపే లక్ష్యంగా పని చేయాలి

చొప్పదండి, వెలుగు : రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని బీజేపీ స్టేట్​చీఫ్​బండి సంజయ్ అన్నారు. శుక్రవారం ఎంపీ నివాసంలో చొప్పదండి అసెంబ్లీ పరిధిలోని పార్టీ మండలాధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చొప్పదండిలో పార్టీ బలోపేతానికి మరింత కష్టపడి పనిచేయాలన్నారు. 12 నుంచి ప్రారంభమయ్యే 4వ విడత ప్రజా సంగ్రామ యాత్రలో అందరు పాల్గొనాలన్నారు. సమావేశంలో చొప్పదండి, రామడుగు, గంగాధర, కొడిమ్యాల, మల్యాల, బోయినిపల్లి మండలాల అధ్యక్షులు మావురం సుదర్శన్​రెడ్డి, ఒంటెల కర్ణాకర్​రెడ్డి, కోల అశోక్, రేకులపల్లి రవీందర్ రెడ్డి, నేరెళ్ల శ్రవణ్ రెడ్డి, గుడి రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.

విద్యుత్ షాక్ తో రైతు మృతి

జగిత్యాల, వెలుగు: మేడిపల్లి మండలం మోత్కురావుపేటలో విద్యుత్ షాక్ తో నాగం మల్లేశ్(44) అనే రైతు మృతి చెందాడు. మోత్కురావుపేటకు చెందిన మల్లేశ్​శుక్రవారం పొలానికి వెళ్లాడు. పశువుల కోసం మెషిన్ తో గడ్డి కోస్తుండగా కరెంట్ షాక్ తగిలి కింద పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ఎల్లయ్య తెలిపారు. 

రూ.లక్షన్నర పలికిన గణేశ్​ లడ్డూ 

జగిత్యాల, వెలుగు : గణేశ్​నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం వినాయక మండపాల్లో నిర్వహించిన లడ్డూ వేలంపాటలో భక్తులు భారీగా పాల్గొన్నారు. వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో చెన్నమనేని పవిత్ర, రాంబాబు రావు దంపతులు రూ.లక్షా59 వేలు వేలం పాడి లడ్డూను దక్కించుకున్నారు. గణేశ్​నగర్ లోని శ్రీలక్ష్మీగణేశ్​మందిరంలో లడ్డూ వేలం వేయగా వంజరి రామ్ సేన సభ్యులు రూ.1,15,116-కు లడ్డూను దక్కించుకున్నారు. 

కుక్కల దాడిలో ఏడుగురికి గాయాలు

జ్యోతినగర్, వెలుగు: రామగుండం ఎన్టీపీసీ ఐదో డివిజన్ శాలపల్లి లో శుక్రవారం నలుగురిపై పిచ్చి కుక్క దాడి చేసింది. వారిలో బొద్దుల నాగమ్మ(80)కు తీవ్ర  గాయాలు కావడంతో గోదావరి ఖని హాస్పిటల్​కు తరలించారు. 

సుల్తానాబాద్​లో ముగ్గురు..

సుల్తానాబాద్:  ఒకేరోజు వేర్వేరు చోట్ల గురువారం రాత్రి కుక్కలు దాడి చేయడంతో సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన గంధం రాజమ్మ(65), ఎం. శ్రీకర్(8), కల్యాణం అంజు(13) గాయపడ్డారు. వీరిని కరీంనగర్ హాస్పిటల్​కు తరలించారు.

కరీంనగర్​లో భారీ వర్షం 

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ సిటీలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో ముకరంపుర, రాంనగర్, విద్యానగర్, జ్యోతినగర్, కట్టరాంపూర్ తదితర ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. శాతవాహన యూనివర్సిటీ రోడ్డులోని సెయింట్ జాన్స్ స్కూల్ ఎదుట మూడు ఫీట్ల మేర నీరు నిలవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం పడడంతో వినాయక నిమజ్జనాలు ఆలస్యంగా జరిగాయి.
మెట్ పల్లి:  పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. వెల్లుల్ల రోడ్, మార్కెట్ యార్డ్​ముందర, చైతన్యనగర్, రబ్బానీవురా, ఇందిరా ప్రియదర్శిని కాలనీ, నిఖిల్ భారత్ స్కూల్ ఏరియా, సుల్తాన్ పురా, పెద్దమ్మ టెంపుల్ ఏరియా, అభయహస్తం హనుమాన్ టెంపుల్ ఏరియాల్లో సరైన డ్రైనేజీలు లేకపోవడంతో నీరు నిలిచిపోయింది. అంబేద్కర్ స్టేడియంలో వరదనీరు చేరి చెరువులా మారింది.  

400 క్వింటాళ్ల బియ్యం పట్టివేత

పెద్దపల్లి, వెలుగు: అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్​రైస్ ను పెద్దపల్లి పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. పక్కా సమాచారం అందడంతో పెద్దపల్లి లోని కునారం రోడ్ లోగల రైస్ మిల్లు లో సుమారు 400 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నట్లు పెద్దపల్లి ఎస్సై రాజేశ్ తెలిపారు. ఈ రైస్​ను కొంతమంది రేషన్ డీలర్ల నుంచి కొని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు తెలిసింది. బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అందజేసి కేసు నమోదు  చేసినట్లు ఎస్సై తెలిపారు. 

నేడు మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్   

సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు : జిల్లాలోని అన్ని అంగన్​వాడీ సెంటర్ లలో ప్రతీనెల రెండో శనివారం మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తెలిపారు. శుక్రవారం తన చాంబర్​లో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్​10వ తేదీ నుంచి జిల్లాలోని 587 అంగన్​వాడీ సెంటర్ లలో ఫుడ్​ఫెస్టివల్ ప్రారంభమవుతోందన్నారు. పోషక విలువల ప్రాధాన్యతను తెలియజెప్పడం కోసం మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

చికిత్స పొందుతూ బాలుడు మృతి

ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన

కరీంనగర్ సిటీ, వెలుగు : కరీంనగర్ లోని సందీప్​ పిల్లల హాస్పిటల్​లో జ్వరానికి చికిత్స పొందుతూ 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. డాక్టర్ నిర్లక్ష్యంతోనే బాబు మృతి చెందాడని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. వివరాలు.. నగరంలోని సుభాష్​నగర్​కు చెందిన నీల శైలేశ్(12) జ్వరం రావడంతో సందీప్ పిల్లల ఆస్పత్రిలో చూయించారు. నయం కాకపోవడంతో గురువారం ఆస్పత్రిలో చేర్పించా రు. తర్వాత డాక్టర్ సూచనతో శుక్రవారం ఉదయం మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శైలేశ్ చనిపోయాడు. దీంతో కుటుంబీకులు ఆందోళన చేశారు. బాలుడి మృతిపై డాక్టర్ ను ‘వెలుగు’ వివరణ కోరగా ఆస్పత్రికి వచ్చినప్పుడే బాలుడి పరిస్థితి విషమంగా ఉందని అన్నారు.