దేశంలో నం.‌‌1 పోలీస్‌‌ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి : డీజీపీ జితేందర్​

దేశంలో నం.‌‌1 పోలీస్‌‌ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి : డీజీపీ జితేందర్​
  • పేరు తెచ్చిన సిబ్బందికి అభినందనలు: డీజీపీ జితేందర్​
  • రాష్ట్రంలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాను
  • ఎస్‌‌హెచ్‌‌ఓలు పనితీరు మరింత మెరుగుపరుచుకోవాలి
  • క్యూఆర్ కోడ్‌‌ ద్వారా సమాచారం సేకరిస్తున్నామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: దేశంలో నంబర్‌‌‌‌ వన్‌‌ పోలీసింగ్​గా దక్కిన గౌరవాన్ని నిలబెట్టుకోవాలని రాష్ట్ర పోలీసులకు డీజీపీ జితేందర్‌‌ సూచించారు.‌‌ రాష్ట్ర పోలీస్ శాఖకు దక్కిన గౌరవాన్ని నిలుపుకోవాలంటే బాధితులకు న్యాయం చేయాలనే ప్రధాన ఉద్దేశంతో పోలీసులు పనిచేయాలని సూచించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్​(ఎస్​హెచ్​వో)లు తమ పనితీరు మరింత మెరుగుపరుచుకోవాలని అన్నారు. పోలీసుల పనితీరు తెలుసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో క్యూఆర్ కోడ్ పద్ధతిని ప్రవేశపెట్టామని చెప్పారు. 

ఇండియా జస్టిస్ రిపోర్ట్–2025 పోలీస్ ర్యాంకింగ్‌‌లో రాష్ట్ర పోలీస్ శాఖ దేశంలోనే ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా రాష్ట్రంలోని అన్ని యూనిట్లకు చెందిన ఎస్​హెచ్​వోలతో శనివారం సమావేశం నిర్వహించారు. లా అండ్ ఆర్డర్ డీజీ మహేశ్‌‌ భగవత్‌‌తో కలిసి వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. తెలంగాణలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నానని అన్నారు. తాను సివిల్ సర్వీసెస్‌‌కు సెలెక్ట్ అయిన తర్వాత ఏ సర్వీస్ ఎంపిక చేసుకోవాలని పలువురితో చర్చించానని తెలిపారు.

ఐపీఎస్ ఎంపిక పట్ల చాలా విముఖత కనబరిచారన్నారు. కానీ 33 ఏండ్ల తన సర్సీస్‌‌లో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నానని సంతోషం వ్యక్తం చేశారు. సీసీటీఎన్ఎస్ పనితీరును క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు. ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయడం ద్వారా ఉత్తమ పోలీస్ అధికారులుగా గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. శాంతిభద్రతల అడిషనల్ డీజీపీ శ్రీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. కింది స్థాయిలో పోలీస్ సిబ్బంది తప్పులు చేస్తే ఉన్నతాధికారులు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్లు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలలో, పోలీస్ స్టేషన్ల సిబ్బందిలో మంచి పేరు తెచ్చుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అవినీతికి పాల్పడవద్దని.. తద్వారా చెడ్డ పేరు తెచ్చుకోవద్దని హెచ్చరించారు.