
- ముగ్గురు నిందితుల రిమాండ్
పాపన్నపేట, వెలుగు: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుకు కారకుడయ్యాడన్న కోపంతో వినోద్ రెడ్డిని ఫ్రెండ్సే కొట్టి చంపారని మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈనెల 10న ఏడుపాయల్లో జరిగిన హత్యకేసు వివరాలను సోమవారం వెల్లడించారు. పాపన్నపేట మండలం రామతీర్థం గ్రామానికి చెందిన వడ్ల నవీన్ సంగారెడ్డిలోని బేవరేజ్ కంపెనీలో పనిచేసేవాడు.
ఈ సమయంలో తొగర్పల్లికి చెందిన వినోద్‌రెడ్డి, సంగారెడ్డికి చెందిన బేగరి రాములు, కుమ్మరి రమణాచారి స్నేహితులయ్యారు. కొంతకాలంగా స్వగ్రామంలో ఉంటున్న నవీన్ కొత్త బైక్ కొనేందుకు ఫిబ్రవరి 17న సంగారెడ్డి వెళ్లాడు. బైక్ కొన్నాక మరునాడు రాములు, వినోద్ రెడ్డి, రమణాచారితో కలసి మద్యం తాగారు. ఇంటికి వెళ్తుండగా పోలీసులు రోడ్డుపై డ్రంక్అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ వారిని ఆపారు.
నవీన్ పోలీసులను బతిమాలుతుండగా, వినోద్‌రెడ్డి పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో వారిపై కేసు నమోదుచేశారు. ఈ క్రమంలో కోర్టు జరిమానా, ఇతర ఖర్చులను నవీన్ భరించాడు. అప్పటినుంచి వినోద్ రెడ్డిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో మార్చి 8న నవీన్ తన కూతురు బర్త్ సర్టిఫికెట్ తీసుకునేందుకు సంగారెడ్డి వెళ్లాడు. సాయంత్రం నవీన్, బేగరి రాములు, రమణాచారి సంగారెడ్డి లో మందు తాగుతుండగా వినోద్‌రెడ్డి వారికి ఫోన్ చేశాడు.
అవకాశం కోసం ఎదిరిచూస్తున్న నవీన్ అతన్ని రమ్మని పిలిచాడు. నలుగురు కలిసి అక్కడ మద్యం తాగారు. అనంతరం ప్లాన్ ప్రకారం.. ఏడుపాయలలో దావత్ చేసుకుందామని వినోద్ రెడ్డిని తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళాక ఏడుపాయల్లో మళ్లీ మందుకొని మునివుట్ట వద్ద తాగారు. అప్పటికే కోపంతో ఉన్న నవీన్ కట్టెతో వినోద్‌రెడ్డిపై దాడి చేశాడు. అతనితో పాటు రాములు, రమణాచారి విచక్షణ రహితంగా కొట్టడంతో వినోద్ రెడ్డి చనిపోయాడు.
అనంతరం నిందితులు నవీన్ ఇంటికి వచ్చి అక్కడ డబ్బులు తీసుకొని అజ్ఞాతంలోకి వెళ్లారు. మృతుని సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు. మార్చి 8న సంగారెడ్డిలో నలుగురు కలిసి ఉన్న విషయాన్ని చూసిన కొంతమంది ఇచ్చిన సమాచారం మేరకు నిందితుల్ని పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.