నయీం రైట్ హ్యాండ్..శేషన్నచిక్కిండు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: గ్యాంగ్‌‌‌‌స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్న ఎట్టకేలకు చిక్కాడు. ఆరేండ్లుగా తప్పించుకు తిరుగుతున్న శేషన్నను కౌంటర్ ఇంటెలిజెన్స్, సిటీ టాస్క్‌‌‌‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అక్రమ ఆయుధాల కేసులో హైదరాబాద్ హుమాయూన్ నగర్‌‌‌‌ ‌‌‌‌పోలీసులు గత వారం అక్బర్‌‌‌‌ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడు ఇచ్చిన సమాచారంతో శేషన్నపై పోలీసులు నిఘా పెట్టారు. షేక్​పేట్​ క్రాస్​రోడ్​లో ఓ సెటిల్‌‌‌‌మెంట్‌‌‌‌కు వచ్చినట్లు తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు. హుమయూన్‌‌‌‌నగర్‌‌‌‌ పీఎస్‌‌‌‌కి తరలించారు. తర్వాత జడ్జి ఇంట్లో శేషన్నను ప్రవేశపెట్టి, మంగళవారం రిమాండ్‌కు తరలించారు. విచారణలో కీలక ఆధారాలు సేకరించారు. గోల్కొండ, హుమాయూన్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ పీఎస్‌‌‌‌ల లిమిట్స్‌‌‌‌లో నాలుగు పిస్టల్స్ అమ్మినట్లు గుర్తించారు. ఆర్మ్స్‌‌‌‌ యాక్ట్‌‌‌‌ కింద కేసులు నమోదు చేశారు. గతంలో నయీంతో కలిసి చేసిన నేరాలకు సంబంధించిన కేసుల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

నయీం యాక్షన్ టీమ్‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ ‌‌‌‌జిల్లా అచ్చంపేటకు చెందిన శేషన్న అలియాస్ రామచంద్రుడు.. నయీం గ్యాంగ్‌‌‌‌లో కీలకంగా పనిచేశాడు. పోలీసులకు మోస్ట్‌‌‌‌ వాంటెడ్‌‌‌‌ క్రిమినల్. నయీంకు ప్రధాన అనుచరుడిగా ఉంటూ అక్రమాలకు పాల్పడ్డాడు. ఏడుగురు సభ్యుల యాక్షన్‌‌‌‌ టీమ్‌‌‌‌కు నాయకత్వం వహించాడు. మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లా మన్ననూరు నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహించాడు. గన్స్‌‌‌‌, పేలుడు పదార్థాలు సేకరించడంలో శేషన్న కీలకంగా వ్యవహరించాడు. ఏకే 47 గన్స్‌‌‌‌తో పాటు రివాల్వర్స్, డాగర్స్, కత్తులు సహా ఇతర మారణాయుధాలను సమకూర్చేవాడు. మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో ఓ కానిస్టేబుల్‌‌‌‌ హత్య కేసులో శేషన్న ప్రధాన నిందితుడు. నాటి పెనుగొండ ఎమ్మెల్యే పరిటాల రవి హత్య కేసులో నిందితుడిగా ఉన్న పటోళ్ల గోవర్ధన్‌‌‌‌రెడ్డిని 2011 డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో హత్య చేశారు. 1993లో ఐపీఎస్‌ ఆఫీసర్‌‌ కేఎస్‌ వ్యాస్‌ హత్య కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు. సుల్తాన్‌‌‌‌ బజార్‌‌‌‌ ‌‌‌‌పీఎస్‌‌‌‌ లిమిట్స్ బొగ్గులకుంటలో ఈ హత్య జరిగింది. ఈ కేసులోనూ శేషన్న కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

నయీంపై 250 కేసులు..

నయీం ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌ తర్వాత పోలీసులకు భారీ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. 250 కేసులను రిజిస్టర్ చేశారు. 125 మందిని అరెస్ట్ చేశారు. 330 మందిని వివిధ కేసుల్లో పీటీ వారెంట్ పై కోర్టుల్లో హాజరుపరిచారు. 107 మందిని కస్టడీలోకి తీసుకుని సిట్ విచారించింది. 878 మందిని సాక్షులుగా చేర్చింది. ఈ కేసుల్లో నయీం అనుచరులు పాశం శ్రీను, సందెల సుధాకర్, అబ్దుల్ నాజర్, బాచు నాగరాజు, పులి నాగరాజు, సరగడ హరి, కత్తుల జంగయ్య, సామ సంజీవ రెడ్డి, మహ్మద్ తబ్రేజ్, గుమ్మడవలి శీనివాస్, షేక్ జహంగీర్, షేక్ జానీ పాషా, షేక్ అబ్దుల్లా, మహ్మద్‌‌‌‌ ముబిన్‌‌‌‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌‌‌‌కి తరలించారు. వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. 29 కేసుల్లో విచారణలు ప్రారంభమయ్యాయి. సాక్ష్యాధారాలు సరిగా లేవన్న కారణంతో 10 కేసులు క్లోజ్ అయ్యాయి. సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ రూ.2 వేల కోట్లకు పైగా ఉంటుందని తెలిసింది. 

సెటిల్‌‌‌‌మెంట్లు, కిడ్నాపులు, కబ్జాలు

పటోళ్ల గోవర్ధన్‌‌‌‌రెడ్డి హత్య కేసుతో నయీం టీమ్‌‌‌‌లో శేషన్న కీలక వ్యక్తిగా మారాడు. నయీంతో కలిసి ల్యాండ్ సెటిల్‌‌‌‌మెంట్లు, కిడ్నాపులు, భూకబ్జాలు చేశాడు. నయీం గ్యాంగ్‌‌‌‌తో పాటు యాక్షన్‌‌‌‌ టీమ్‌‌‌‌కి కావాల్సిన రివాల్వర్స్, తుపాకులు, కత్తులు సహా మారణాయుధాలను శేషన్న ఆధ్వర్యంలో కొనేవారు. ఏకే 47 సహా అత్యాధునిక ఆయుధాలను శేషన్న సేకరించేవాడు. వీటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చేవాడనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. 2016 ఆగస్ట్‌‌‌‌ 8న షాద్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌లో నయీం చనిపోయాడు. ఆ తర్వాత నయీం గ్యాంగ్‌‌‌‌ మెంబర్స్‌‌‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వం సిట్‌‌‌‌ ఏర్పాటు చేసి గాలించినా.. శేషన్న ఆచూకీ మాత్రం దొరకలేదు. కర్నూల్ జిల్లా సున్నిపెంటకు చెందిన మాజీ మావోయిస్ట్‌‌‌‌ వెంకట్ రెడ్డి వద్ద శేషన్న కొంతకాలం షెల్టర్‌‌‌‌ ‌‌‌‌తీసుకున్నట్లు తెలిసింది. అక్కడికి వెళ్లిన పోలీసులకు శేషన్న దొరకలేదు. అప్పటి నుంచి స్థావరాలు మార్చుతూ తిరిగాడు.