హైదరాబాద్: తెలంగాణ పోలీస్ బెటాలియన్లలో పనిచేసే కానిస్టేబుల్స్ చేస్తున్న ఆందోళనల పైన పోలీస్ శాఖ గుర్రుగా ఉంది. The Police Forces (Restriction of Rights) Act, The Police (Incitement to Disaffection) Act, Police Manual ప్రకారం విధులను బహిష్కరించటం, రోడ్ల పైకి వచ్చి ఖాకీలే ఆందోళన చేయడం తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘనగా పోలీస్ శాఖ భావిస్తోంది.
ఈ పరిణామాన్ని ఏమాత్రం లైట్ తీసుకోకూడదని పోలీసు శాఖ నిర్ణయించింది. పోలీసు శాఖలో పనిచేస్తూ జన జీవనానికి ఇబ్బంది కలిగేలా రోడ్లపై వచ్చి ఆందోళన చేస్తున్న పోలీసులపై చట్టపరమైన, శాఖాపరమైన చర్యలకు పోలీస్ శాఖ సిద్ధమైనట్లు సమాచారం.
ALSO READ | ఏక్ పోలీస్.. రాష్ట్రంలో రాజుకున్న నిప్పు
పోలీస్ బెటాలియన్ కానిస్టేబుల్స్కు సెలవుల విషయంలో పాత పద్ధతిని అనుసరిస్తామని ఇప్పటికే చెప్పినప్పటికీ ఉద్దేశపూర్వకంగా ఆందోళన చేస్తున్నారని పోలీస్ శాఖ ఆగ్రహంగా ఉంది. ఈ క్రమంలో బాధ్యులపై తీవ్రమైన చర్యలకు పోలీస్ శాఖ సిద్ధమైంది.
శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా నిరసనలకు దిగిన కొంతమందిని పోలీస్ శాఖ ఇప్పటికే గుర్తించింది. కానిస్టేబుళ్ల ఆందోళన వెనుక ప్రభుత్వం అంటే గిట్టని కొన్ని రాజకీయ శక్తుల హస్తముందని పోలీస్ శాఖ అనుమానిస్తోంది.